రెండో ప్రపంచ యుద్ధం నాటి తుపాకులు లభ్యం

21 May, 2019 12:38 IST|Sakshi
పునాదులు తవ్వుతుండగా దొరికిన 303 వెపన్స్‌

తూర్పుగోదావరి  ,కాకినాడ క్రైం: కాకినాడ అశోక్‌నగర్‌లో అపార్టుమెంట్లు కట్టేందుకు తీస్తున్న పునాదుల్లో రెండో ప్రపంచ యుద్ధం నాటివిగా భావిస్తున్న 10 తుపాకులు బయటపడ్డాయి. ఈ ప్రాంతంలో బ్రిటిషు మిలటరీ దళాలు కార్యక్రమాలు నిర్వహించేవని, అప్పట్లో ఈ ప్రాంతానికి మిలటరీ రోడ్డు అనే పేరు కూడా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. విశాఖపట్నానికి చెందిన కేఎస్‌ఆర్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్టుకు చెందిన వారు అశోక్‌నగర్‌లోని భాష్యం పాఠశాల ఎదురుగా ఉన్న ఎకరం స్థలంలో ఆదివారం అపార్టుమెంట్ల నిర్మాణానికి పునాదులు తవ్వుతున్నారు.

ఏడు అడుగుల లోతులోఈ తుపాకులు బయట పడడంతో ప్రాజెక్టు మేనేజర్‌ స్వరూపరాజు ఈ విషయాన్ని టూటౌన్‌ పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న టూ టౌన్‌ సీఐ ఎ.నాగమురళి, ఏఆర్‌ డీఎస్పీ అప్పారావు, ఏఆర్‌ ఆర్‌ఐ ఈశ్వరరావు అక్కడకు వెళ్లి తుపాకులను పరిశీలించారు. ఇవి 1939–45 మధ్య జరిగిన రెండో ప్రపంచ యుద్ధంలో వాటిన తుపాకులు అయి ఉంటాయని భావిస్తున్నారు. మార్‌–1303 వెపన్స్‌గా వీటిని గుర్తించారు. ఇవి పూర్తిగా తుప్పు పట్టి ఉన్నాయని, వీఆర్వో శ్రీనివాస్‌తో పంచనామా నిర్వహించామని సీఐ నాగమురళి సోమవారం విలేకర్లకు  వివరించారు. 303 వెపన్స్‌ లభ్యంపై సీఆర్‌పీసీ 102 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. వీటిని కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు.


 

మరిన్ని వార్తలు