కార్యదర్శుల భర్తీకి మరో నెలరోజులు

8 Dec, 2013 05:27 IST|Sakshi

కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : పంచాయతీ కార్యదర్శుల పో స్టుల భర్తీకి మరో నెలరోజుల సమయం పట్టనుంది. వేల సంఖ్యలో దరఖాస్తులు రావడంతో ప్రక్రియకు ఎక్కువ సమయం పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని 92 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను రాత, మౌ ఖిక పరీక్ష లేకుండా నేరుగా భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ జారీచేశారు. 92 పోస్టులకు 13,837 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో పోస్టుకు 150 మంది పోటీ పడుతున్నారు. డిగ్రీలో సాధించిన మార్కులు, ఏడాదికో మార్కు చొప్పున వెయిటేజీ మార్కుల ఆధారంగా నియామకాలు చేపట్టనున్నారు. ఇప్పటికే కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న కార్యదర్శులు 87 మందికి పోస్టుల భర్తీలో ప్రాధాన్యత కల్పిస్తారు. అంటే ఒక్కొక్కరికి అదనంగా 25 వెయిటేజీ మార్కులు కలపనున్నారు.

దీంతో 87 మంది కాంట్రాక్ట్ పంచాయతీ కార్యదర్శుల్లో ఎక్కువ మందికి అవకాశం లభించనుంది. కేవలం పది పోస్టులకోసం 13 వేల మందికి పైగా నిరుద్యోగులు పోటీపడుతున్నారు. ఇప్పటివరకు అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తుల పరిశీలన పూర్తైంది. ప్రస్తుతం దరఖాస్తులను కంప్యూటరైజేషన్ చేసే పని చేపడుతున్నారు. వేలాది దరఖాస్తులు రావడంతో సుమారు పదిహేను రోజుల పాటు కంప్యూటరైజేషన్ ప్రక్రియ కొనసాగనుంది. అనంతరం మార్కులు, వెయిటేజీని కలిపి రిజర్వేషన్ ప్రకారం మెరిట్ జాబితా ప్రకటిస్తామని డీపీవో కుమారస్వామి తెలిపారు. మొత్తంగా పోస్టుల భర్తీకి నిరుద్యోగులు మరో 20 రోజులు ఎదురుచూడాల్సిందే.
 

మరిన్ని వార్తలు