సాహో..‘సమన్యు’

28 Apr, 2018 01:26 IST|Sakshi
కిలిమంజారో పర్వతంపై జాతీయ పతాకంతో సమన్యు

కిలిమంజారోని అధిరోహించిన ఏడేళ్ల బాలుడు 

ఈ ఘనతను సాధించిన అతిపిన్న వయస్కుడిగా రికార్డు 

కర్నూలు (గాయత్రీ ఎస్టేట్‌): ఈ బుడతని పేరు సమన్యు యాదవ్‌. వయసు ఏడేళ్లు. చదివేది మూడో తరగతి. ఇందులో ప్రత్యేకత ఏముందనుకుంటున్నారా? ఉంది మరి..ఈ బాలుడు అతి చిన్నవయసులోనే కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు. అంతేకాదు ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. కర్నూలు నగరం బాలాజీనగర్‌కు చెందిన లావణ్య, కృష్ణకాంత్‌ దంపతులు. కృష్ణకాంత్‌ హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ ఉద్యోగి కాగా లావణ్య గృహిణి. వీరికి హసిత, సమన్యుయాదవ్‌ సంతానం.

సమన్యు సికింద్రాబాద్‌లోని బోల్టన్‌ స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్నాడు. హసిత మౌంట్‌ ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంపునకు వెళ్లేందుకు ఫిట్‌నెస్‌ పరీక్షలో ఎంపికైంది. హసిత శిక్షణకు వెళుతుంటే ఆమెతో పాటు అక్కడికి వెళ్లిన క్రమంలో సమన్యు ట్రెక్కింగ్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. తాను కూడా ఎవరెస్టు ఎక్కడానికి వెళతానని మారాం చేయడంతో నిపుణులు సమన్యు ఫిట్‌నెస్‌ను పరీక్షించారు. మిగతావారి కన్నా సమన్యు అతివేగంగా వ్యాయామాలు చేస్తుండటాన్ని గమనించిన ఫిట్‌నెస్‌ నిపుణులు ఈ బుడతడి ఉత్సాహాన్ని చూసి ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంపు వెళ్లడానికి అనుమతినిచ్చారు. 45 రోజుల శిక్షణ అనంతరం సమన్యు సాహసయాత్రకు బయలుదేరి మౌంట్‌ ఎవరెస్ట్‌ను అధిరోహించాడు.

మౌంట్‌ ఎవరెస్ట్‌ను అధిరోహించిన స్ఫూర్తితోనే సమన్యు కిలిమంజారో పర్వతారోహణకు గత నెల 17న హైదరాబాద్‌ నుంచి బయలుదేరి 29న కిలిమంజారోను అధిరోహించడం ఆరంభించాడు. ఈనెల 2న ఉదయం 11:52 గంటలకు (5,380 మీటర్ల) లక్ష్యాన్ని పూర్తి చేసి గిన్నిస్‌బుక్‌ రికార్డు నెలకొల్పాడు. కిలిమంజారో అధిరోహించిన అతి పిన్న వయసు వారిలో గతంలో 2,824 రోజుల వయసున్న క్యాష్‌ అనే బాలుడు (అమెరికా) ఉండగా, ఈ పర్వతం అధిరోహించేనాటికి సమన్యు వయసు 2,821 రోజులు. మూడు రోజుల వయసు తక్కువగా ఉండటంతో గత రికార్డును సమన్యు అధిగ మించి సరికొత్త రికార్డు నెలకొల్పి చరిత్రపుటల్లోకెక్కాడు.   

మరిన్ని వార్తలు