అ‘ధర్మ’కర్త మండలి !

19 Aug, 2018 08:30 IST|Sakshi

దుర్గగుడి పాలక సభ్యులపై  తీవ్ర స్థాయిలో ఆరోపణలు

అవినీతికి ఆలవాలమైన కమిటీ

ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న వైనం 

తాజాగా సెక్యూరిటీ సిబ్బందిపై లైంగిక వేధింపులు

ఇప్పటికే చీరల చోరీ కేసులో  సభ్యురాలి తొలగింపు 

సాక్షి,విజయవాడ : ఎన్నో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న దుర్గ గుడి పాలక మండలి అవసరమా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే దుర్గమ్మకు భక్తులు సమర్పించిన చీరను కాజేయడంతో కోడెల సూర్యలతను పాలకమండలి నుంచి ప్రభుత్వం తొలగించింది.  పదవి కోల్పోయిన సూర్యలత పాలకమండలి చైర్మన్‌ యలమంచిలి గౌరంగబాబు, సభ్యుడు వెలగపూడి శంకరబాబు పై ఆరోపణలు చేశారు. వెలగపూడి శంకరబాబు ఐదుగురు ఓపీడీఎస్‌ మహిళల్ని వేధించారని, దీనిపై వారు ఫిర్యాదు చేసినా చైర్మన్‌ పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఎంతో హుందాగా ఉండాల్సిన పాలకమండలి సభ్యుడు దేవస్థానంలో పనిచేసే మహిళా సెక్యురిటీ సిబ్బందిని లైంగిక వేధింపులకు గురి చేశారనే విషయం  ఇంద్రకీలాద్రి పై చర్చనీయాశంగా మారింది.  చైర్మన్‌ దేవస్థానంలో సెక్యురిటీ టెండర్లను పారదర్శకంగా పాటించకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా పాలకమండలిలో ఉన్న మరొక సభ్యుడుకు నేర చరిత్ర ఉంది. 

అవినీతికి ఆలవాలమైన కమిటీ...
దుర్గగుడి పాలకమండలి అవినీతికి ఆలవాలంగా మారింది. పాలకమండలి సభ్యులకు ప్రభుత్వ పెద్దలతో సంబంధాలు ఉండటంతో అధికారులు, సిబ్బంది కూడా ఏమీ చేయలేకపోతున్నారు. ఇప్పటికే 14 నెలలు గడిచిపోవడంతో ఉన్న కొద్దికాలంలో సాధ్యమైనంత రాబట్టేందుకు కొంతమంది పాలకమండలి సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. 

తాము చేయాల్సిన పనులు వదిలివేసి...
పాలకమండలి సభ్యుడు దేవస్థానం ఆదాయం పెంచేందుకు కృషి చేయాలి. తమ పరపతిని ఉపయోగించి దేవస్థానానికి విరాళాలు వచ్చేటట్లు చేయాలి. అయితే ఏడాది గడిచిన పెద్దగా విరాళాలు తెచ్చిన దాఖాలు లేవు. తమ పరపతిని ఉపయోగించి ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాబట్డడం లేదు. ఇక అధికారులకు మంచి సూచనలేమైనా చేశారంటే అదీ కనపడదు. భక్తులపై ఆర్థిక భారం తగ్గించే ప్రయత్నాలు కూడా ఏమీ కపడవు. భక్తిభావం లేని ఇటువంటి పాలకమండలి ఎంతమేరకు అవసరమని భక్తులు ప్రశ్నిస్తున్నారు. 

మరిన్ని వార్తలు