పునర్నిర్మాణంలో భాగస్వాములవ్వాలి

7 Mar, 2014 01:51 IST|Sakshi

 ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే జోగు రామన్న అభిప్రాయపడ్డారు. జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ విశ్రాంతి భవనంలో ఎదుట జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం ముగిశాయి. ఎట్టకేలకు తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం అపాయింటెడ్ డేను ప్రకటించడంతో దీక్షలు విరమించారు. జేఏసీ జిల్లా అధికార ప్రతినిధి కారింగుల దామోదర్ నేతృత్వంలో చేపట్టిన దీక్షలు గురువారానికి 1523 రోజులకు చేరాయి. ముగింపు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రామన్న దీక్షలో కూర్చున్న వారికి నిమ్మరసం ఇచ్చారు.

అంతకుముందు జేఏసీ నాయకులు అమరవీరుల స్థూపానికి, తెలంగాణ తల్లికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామన్న మాట్లాడుతూ.. తెలంగాణ సమాజం ఒక్కటై పోరాటం చేయడం వల్లనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలంగాణ కోసం వెయ్యి మందికిపైగా విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని పేర్కొన్నారు. 2009లో కేసీఆర్ తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్షకు దిగడంతో ఉద్యమం ఉగ్రరూపం దాల్చిందన్నారు.

 తెలంగాణ కోసం ఉద్యోగ, ఉపాధ్యాలయులు, కార్మికులు, కులసంఘాలు, రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన సంఘాలు ఉద్యమించాయన్నారు.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జేఏసీ అధికార ప్రతినిధి కారింగుల దామోదర్ మాట్లాడుతూ.. అమరుల త్యాగాలు వృథా కాలేదని, పోరాడి తెలంగాణను సాధించుకున్నామని అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా దీక్షలు విరమించలేదన్నారు. అమర వీరుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం అపాయింటెడ్ డేను జూన్ 2గా ప్రకటించడంతో దీక్షలు విరమించామన్నారు.

కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమరెడ్డి, టీఎన్‌జీవోస్ జిల్లా అధ్యక్షుడు అశోక్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు బి.రవీంద్ర, సాెహ బ్‌రావు పవార్, జాదవ్ కిరణ్‌కుమార్, బీజేపీ నాయకలు దుర్గం రాజేశ్వర్, పాయల్ శంకర్, మడావి రాజు, సురేష్ జోషి, టీఆర్‌ఎస్ నాయకులు గంగరెడ్డి, గంగన్న, అనంద్, బాలశంకర్ కృష్ణ, గోలి శంకర్, ప్రశాంత్, బండారి సతీష్, రంగినేని శ్రీనివాస్, కస్తాల ప్రేమల, అంజలి, త్రిశూల, అనుసూయ, సురేఖ, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు