వ్యాధులొస్తున్నాయ్.. వైద్యులు వెళ్తున్నారు!

26 Jul, 2014 02:09 IST|Sakshi
వ్యాధులొస్తున్నాయ్.. వైద్యులు వెళ్తున్నారు!

రిమ్స్ క్యాంపస్: వర్షాకాలం వచ్చింది. పెద్దగా వానలు లేకపోయినా.. అప్పుడప్పుడూ కురుస్తున్న చిన్న వర్షాలకే వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఆస్పత్రులు వ్యాధిగ్రస్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ సీజనులో ఇటువంటి ప్రమాదం ఉంటుందన్నది కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అందువల్ల పూర్తిస్థాయిలో సిబ్బంది, మందులు, ఇతరత్రా వనరులతో అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్యశాఖదే. ఎప్పుడు ఎక్కడ అవసరమొచ్చిన తక్షణమే వైద్య సిబ్బందిని పంపించాలి.
 
వైద్య శిబిరాలు ఏర్పాటు చేయించాలి. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తే అలా కనిపించడంలేదు. పూర్తిస్థాయిలో వైద్యులే లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. పెద్ద సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉండగా, ఉన్న వారిలో కొందరు వైద్యు లు  పీజీ కోర్సులు చేసేందుకు కొద్దిరోజుల్లో వెళ్లిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఉన్న వైద్యులతోనే సర్దుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వ్యాధులు ప్రబలే కాలంలో అలా సర్దుకుపోవడం సాధ్యమేనా.. పెలైట్ జిల్లాగా ఎంపిక చేసిన చోటే పరిస్థితి ఇలా ఉంటే వ్యా ధులను అదుపు చేయ డం ఎలా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో 78 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటికి ప్రభుత్వం 143 వైద్యుల పోస్టులు మంజురు చేసింది. అయితే 101 పోస్టులకే రెగ్యులర్ నియామకాలు జరిగాయి. మరో 35 పోస్టుల కాంట్రాక్టు వైద్యులతో భర్తీ చేశామనిపించారు.
 
అంటే 136 మంది వైద్యు లు ఉన్నట్లు లెక్క.. 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్యులు లేని పీహెచ్‌సీలకు ఇతర చోట్ల నుంచి వైద్యులను పంపించి ఇంతకాలం ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. ఇప్పుడు వర్షాకాలం మొదలైంది.. ఇదే సమయంలో సరికొత్త సమస్య ఎదురైంది. రెగ్యులర్ వైద్యుల్లో 12 మంది పీజీ కోర్సు చేసేందుకు ఈ నెలాఖరున వెళ్లిపోతున్నారు. దీంతో ఖాళీల సంఖ్య 19కి పెరుగుతుంది. మరోవైపు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న 35 మంది వైద్యుల కాల పరిమితి ఈ ఏడాది జూన్ 30నాటికే ముగిసింది.
 
దీన్ని డిసెంబరు 31 వరకు పొడిగిస్తున్నట్లు తెలిసింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎండార్స్‌మెంట్ రాలేదు. దీంతో కాంట్రాక్టు వైద్యుల పరిస్థితి త్రిశంకు స్వర్గంలా ఉంది. ఎండార్స్‌మెంట్ రాకపోయినప్పటికీ డీఎంహెచ్‌ంవో గీతాంజలి విజ్ఞప్తి మేరకు వీరంతా ఇప్పటివరకు విధులకు హాజరవుతున్నారు. వైద్యులు లేని పీహెచ్‌సీలకు ఇతర పీహెచ్‌సీల నుం చి సర్దుబాటు చేస్తుండగా దూరాభారమైనప్పటికీ వెళుతున్నారు. అయితే వైద్యుల సంఖ్య ఇంకా తగ్గిపోనుండటంతో ఇబ్బం దులు సైతం పెరగనున్నాయి.
 
పెలైట్ జిల్లా అయినా దిక్కు లేదు
వైద్య ఆరోగ్యశాఖ పరంగా శ్రీకాకుళాన్ని పెలైట్ జిల్లాగా దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి గతంలోనే ప్రకటిం చారు. ఆ మేరకు అవసరమైన పోస్టులను జిల్లాస్థాయిలోనే నియమించుకునే అధికారం ఉంది. గతంలో వైద్యుల కొరత ఏర్పడగానే ఇదే రీతిలో  నియామకాలు చేపట్టేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.

తమ ఆదేశాలు లేకుండా ఎటువం టి నియామకాలే చేపట్టరాదని ఆరోగ్య శాఖ డెరైక్టర్ నుంచి జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు ఆదేశాలు అందాయి. దీంతో వైద్యుల కొరత ఏర్పడితే సమస్య తప్ప టం లేదు. జిల్లా కలెక్టర్ దీనిపై దృష్టిసారించి పెలైట్ జిల్లా కింద వైద్యుల నియామకాన్ని జిల్లాస్థాయిలోనే చేపట్టేలా చూస్తే తప్ప వైద్యుల కొరత తీరదు. సకాలంలో ప్రజలకు వైద్యం అందదు.

మరిన్ని వార్తలు