రొయ్యల ప్లాంట్‌లో గ్యాస్ లీక్

10 Oct, 2013 03:01 IST|Sakshi
 ఇందుకూరుపేట, న్యూస్‌లైన్: రొయ్యల ప్లాంట్‌లో అమ్మోనియా గ్యాస్ పైపులైను లీకవడంతో 70 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇందుకూరుపేట మండలం డేవిస్‌పేటలోని ఓ రొయ్యల ప్లాంటులో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. బుధవారం ఉదయం 9 గంటలకు కార్మికులు ప్లాంట్‌కు చేరుకోగా, 10 గం టల సమయంలో గ్యాస్ లీకవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. కొందరు ప్రమాదాన్ని గుర్తించి బయటకు పరుగులు తీయగా, మరికొందరు అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది, పోలీసులు, స్థానికులు సహాయ చర్యలు చేపట్టారు. బాధితులను హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. కలెక్టర్ శ్రీకాంత్, ఎస్పీ పీవీఎస్ రామకృష్ణ, జేసీ లక్ష్మీకాంతం, డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుధాకర్, ఎన్‌సీడీ అధికారి ఈదూరు సుధాకర్, డీఆర్‌డీఏ పీడీ వెంకటసుబ్బయ్య, తహశీల్దార్ శీనానాయక్, నెల్లూరు రూరల్ డీఎస్పీ బాలవెంకటేశ్వరరావు, సీఐ సుధాకర్‌రెడ్డి, ఎస్సై సుధాకర్‌బాబు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. 
 
 బాధితులకు సకాలంలో చికిత్స 
 నెల్లూరు(బారకాసు): రొయ్యల ప్లాంట్‌లో అస్వస్థతకు గురైన వారిని రామచంద్రారెడ్డి ఆస్పత్రి, డీఎస్సార్ ప్రభుత్వ ప్రధాన వైద్యశాల, విజయా కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. బాధితులందరికీ సకాలంలో వైద్యసేవలు అందించడంతో ప్రాణాపాయం తప్పింది. బాధితులను సకాలంలో ఆస్పత్రులకు తరలించడంతో ప్రాణాపాయం తప్పిందని డీఎస్సార్ ఆస్పత్రి ఆర్‌ఎంఓ డాక్టర్ ఉషాసుందరి తెలిపారు. చికిత్స పొందుతున్న వారిని కలెక్టర్ శ్రీకాంత్, ఎస్పీ పీవీఎస్ రామకృష్ణ, జేసీ బి.లక్ష్మీకాంతం పరామర్శించారు. 
 
 కేసు నమోదు
 నెల్లూరు(క్రైమ్): గ్యాస్ లీకేజీ ఘటనకు సంబంధించి కంపెనీపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ పీవీఎస్ రామకృష్ణ తెలిపారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై ఆరా తీస్తున్నామని చెప్పారు. దాని ఆధారంగా కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 
 
మరిన్ని వార్తలు