ఎడారిలో పచ్చదనం కోసం కృషి చేస్తున్న స్కూల్‌ టీచర్‌.. ఇప్పటికే 4లక్షల మొక్కలు

26 Aug, 2023 11:24 IST|Sakshi

నిజాయితీగా, విరామం లేకుండా కృషి చేస్తే విజయం తప్పక సాధిస్తామని నమ్మే ట్రీ టీచర్‌... అతిపెద్ద థార్‌ ఎడారిని సస్యశ్యామలం చేసేందుకు నిర్విరామంగా కృషిచేస్తున్నాడు. ఇసుకమేటలను పచ్చని అడవులుగా మార్చేందుకు తను తాపత్రయపడుతూ.. అందరిలో అవగాహన కల్పిస్తున్నాడు. ‘‘ప్రకృతిని తన కుటుంబంలో ఒకరిగా చూసుకుంటూ భూమాతను కాపాడుకుందాం రండి’’ అంటూ పచ్చదనం పాఠాలు చెబుతున్నాడు ట్రీ టీచర్‌ భేరారం భాఖర్‌. 

రాజస్థాన్‌లోని బార్మర్‌ జిల్లా కుగ్రామం ఇంద్రోయ్‌కుచెందిన భేరారం భాఖర్‌ స్కూల్లో చదివే రోజుల్లో .. విద్యార్థులందర్నీ టూర్‌కు తీసుకెళ్లారు. ఈ టూర్‌లో యాభై మొక్కలను నాటడం ఒక టాస్క్‌గా అప్పగించారు పిల్లలకు. తన స్నేహితులతో కలిసి భేరారం కూడా మొక్కలను ఎంతో శ్రద్ధ్దగా నాటాడు. అలా మొక్కలు నాటడం తనకి బాగా నచ్చింది. టూర్‌ నుంచి ఇంటికొచ్చిన తరువాత మొక్కలు నాటి, వాటిని పరిరక్షించడం వల్ల ప్రకృతి బావుంటుంది అని తెలిసి భాఖర్‌కు చాలా సంతోషంగా అనిపించింది. మిగతా పిల్లలంతా మొక్కలు నాటడాన్ని ఒక టాస్క్‌గా తీసుకుని మర్చిపోతే భేరారం మాత్రం దాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నాడు.‘‘ప్రకృతిని ఎంత ప్రేమగా చూసుకుంటే అది మనల్ని అంతగా ఆదరిస్తుంది. పర్యావరణాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత’’అని నిర్ణయించుకుని అప్పటి నుంచి మొక్కలు నాటడం మొదలు పెట్టాడు. 

ట్రీ టీచర్‌గా...
మొక్కలు నాటుతూ చదువుకుంటూ పెరిగిన భాఖర్‌కు ప్రభుత్వ స్కూల్లో టీచర్‌ ఉద్యోగం వచ్చింది. దీంతో తనకొచ్చిన తొలిజీతాన్ని మొక్కల నాటడానికే కేటాయించాడు.‘మొక్కనాటండి, జీవితాన్ని కాపాడుకోండి’ అనే నినాదంతో తన తోటి టీచర్లను సైతం మొక్కలు నాటడానికి ప్రేరేపించాడు. ఇతర టీచర్ల సాయంతో బర్మార్‌ జిల్లా సరిహద్దుల నుంచి జైసల్మేర్, జోధర్, ఇంకా ఇతర జిల్లాల్లో సైతం మొక్కలు నాటుతున్నాడు. ఒకపక్క తన విద్యార్థులకు పాఠాలు చెబుతూనే, మొక్కల ప్రాముఖ్యాన్ని వివరిస్తూ ప్రకృతిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాడు. మొక్కలను ఉచితంగా సరఫరా చేస్తూ మొక్కలు నాటిస్తున్నాడు. తన స్కూలు విద్యార్థులకేగాక, ఇతర స్కూళ్లకు కూడా తన మోటర్‌ సైకిల్‌ మీద తిరుగుతూ మొక్కలు నరకవద్దని చెబుతూ ట్రీ టీచర్‌గా మారాడు భేరారం.

అడవి కూడా కుటుంబమే...
బర్మార్‌లో పుట్టిపెరిగిన భాఖర్‌కు అక్కడి వాతావరణ పరిస్థితులపై మంచి అవగాహన ఉంది. సరిగా వర్షాలు కురవకపోవడం, నీళ్లు లేక పంటలు పండకపోవడం, రైతుల ఆవేదనను ప్రత్యక్షంగా చూసి ఎడారిలో ఎలాగైనా పచ్చదనం తీసుకురావాలని కంకణం కట్టుకున్నాడు. ఈ క్రమంలోనే... ‘ఫ్యామిలీ ఫారెస్ట్రీ’ పేరుతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. మొక్కను మన కుటుంబంలో ఒక వ్యక్తిగా అనుకుంటే దానిని కచ్చితంగా కాపాడుకుంటాము. అప్పుడు మొక్కలు పచ్చగా పెరిగి ప్రకృతితో పాటు మనమూ బావుంటాము అని పిల్లలు, పెద్దల్లో అవగాహన కల్పిస్తున్నాడు. భేరారం మాటలతో స్ఫూర్తి పొందిన యువతీ యువకులు వారి చుట్టుపక్కల ఖాళీస్థలాల్లో మొక్కలు నాటుతున్నారు. 

నాలుగు లక్షలకుపైగా...
అలుపెరగకుండా మొక్కలు నాటుకుంటూపోతున్న భేరారం ఇప్పటిదాకా నాలుగు లక్షలకుపైగా మొక్కలు నాటాడు. వీటిలో పుష్పించే మొక్కలు, పండ్ల మొక్కలు, నీడనిచ్చే మొక్కలతో సహా మొత్తం లక్షన్నర ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి. ఇక్కడి మట్టిలో చక్కగా పెరిగే మునగ మొక్కలు ఎక్కువగా ఉండడం విశేషం. రాజస్థాన్‌లోని ఎనిమిది జిల్లాల్లో పన్నెండు లక్షల విత్తనాలను నాటాడు. 28వేల కిలోమీటర్లు బైక్‌ మీద తిరుగుతూ లక్షా ఇరవైఐదు వేలమందికి మొక్కల నాటడంతో పాటు, వాటి  ప్రాముఖ్యం గురించి అవగాహన కల్పించాడు. మొక్కలే కాకుండా 25వేల పక్షులకు వసతి కల్పించి వాటిని ఆదుకుంటున్నాడు. గాయపడిన వన్య్రప్రాణులను సైతం చేరదీస్తూ పర్యావరణాన్ని పచ్చగా ఉంచేందుకు కృషిచేస్తున్నాడు. చంద్రయాన్‌ మిషన్‌ విజయవంతమైనట్టుగా.. భేరారం కృషితో ఎడారి ప్రాంతం కూడా పచ్చదనంతో కళకళలాడాలని కోరుకుందాం.
  

మరిన్ని వార్తలు