ప్రత్యేక హోదా ఇచ్చే దాకా విశ్రమించం

17 Mar, 2015 03:05 IST|Sakshi

అనంతపురం అర్బన్ : ప్రజలకు మాయ మాటలు చెప్పారు? అమలు కానీ హామీలిచ్చి పదవులు అనుభవిస్తున్నారు. విభజన చట్టంలో నమోదు చేసిన ప్రత్యేక హోదా తీసుకురావడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పది నెలలు ఓపిగ్గా భరించాం. సహనం కోల్పోయి ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధమయ్యాం. ప్రత్యేక హోదా సాధించే వరకు విశ్రమించం.. అంటూ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, మాజ మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, బొత్స సత్యనారాయణ, శైలజానాథ్ వెల్లడించారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రతిపత్తి, నిధులు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి తదితర అంశాలపై కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట సోమవారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. నగర అధ్యక్షులు దాదాగాంధీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ రిలే  దీక్షలు ఈ నెల 20 వరకు కొనసాగిస్తారు.  ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం రాజధాని నిర్మాణానికి రూ.4 ల క్షల కోట్లు అడిగిన ఈ పెద్దమనిషి.. ఇప్పుడు ఎందుకు నోరు మెదపడని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. పది నెలల పాలన పూర్తయినా రాష్ట్రానికి సంబంధించి ఏ ఒక్క విషయంలోనూ ముందుకు వెళ్లలేకపోయారు. రాష్ట్రాభివృద్ధి విషయంలో మీకు ఇంత నిర్లక్ష్యం ఎందుకంటూ ప్రశ్నించారు.

మీకు చేతకాకపోతే మమ్మలను కలుపుకోండి కేంద్రంపై పోరాడి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. రాష్ట్రాభివృద్ధికి ఏడాదికి రూ. లక్ష కోట్లు చొప్పున ఐదేళ్లు రూ.5లక్షల కోట్లు  కేటాయించాలని తమ ప్రభుత్వం అప్పట్లో విభజన చట్టంలో పొందపరిచింది.. వాటిని తీసుకురావడంలో ఎందుకు నిర్లక్ష్యం అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వైఎస్ హయాంలోనే కోట్ల రూపాయలు ఖర్చు పెడితే.. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ముష్టి రూ. 100 కోట్లు కేటాయిస్తే చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.  రాష్ట్ర ప్రజలను నిట్టనిలువునా మోసం చేసిన పెద్దమనిషి వెంకయ్యనాయుడు అని దుయ్యబట్టారు.

రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక నిధులు తీసుకురావయ్యా అంటే..  రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానని, మలేషియాలా మారుస్తానని రూ. 20 కోట్ల ప్రజా సొమ్ము దుర్వినియోగం చేసి ప్రత్యేక విమానంలో పర్యటనలు చేశారని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. అపద్ధాలను భూతద్ధంలో చూపించి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కవ్.. ఇక ఐదు సంవత్సరాలు ఏమవుతుందిలే.. అనుకుంటున్నావేమో... వదిలే ప్రసక్తే లేద ంటూ హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే తాగునీటి సమస్య తీవ్ర రూపం దాలుస్తోంది. లక్షలాది మంది పింఛన్లు కోల్పోయారు.

తమ ప్రభుత్వంలో నిర్మాణం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు అర్ధంతరంగా ఆగిపోయాయి. వీటిపై నీ స్పందన ఏమిటి బాబు అని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టుల పూర్తి చేయడంలో ఐదు సంవత్సరాలు కాదు కాదా..? పది సంవత్సరాల్లో కూడా పూర్తి చేయలేరు. మా ఆనం రామనారాయణరెడ్డికి మీ మంత్రి కొలువులో రెండు సంవత్సరాలు నీటి పారుదల శాఖ మంత్రిగా పదవి ఇవ్వండి.. ప్రాజెక్టులను పూర్తి చేసి రాయలసీమ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు తక్కువ కాకుండా సాగు, తాగునీరు అందించి చూపిస్తాం.. అంటూ చంద్ర బాబుకు రఘువీరా సవాల్ విసిరారు.  జిల్లా రైతాంగాన్ని ఆదుకోవడానికి రూ. 1100ల కోట్లు పంటల బీమాకు మేము నిధులిస్తే.. వాటిని కూడా రైతులకు ఇవ్వకుండా మోసం చేస్తున్నావ్..? నిన్ను నడిరోడ్డులో నిలదీసే రోజులు దగ్గరపడ్డాయంటూ ధ్వజమెత్తారు.

హంద్రీ-నీవాకు రూ. 500 కోట్లు ఖర్చుపెట్టి జిల్లాకు సాగు, తాగునీరు తెచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికే దక్కిందన్నారు. శిలఫలాలకే పరిమితం చేసిన హంద్రీ-నీవాను 90 శాతం పూర్తి చేస్తే.. మిగిలిన 10శాతం పనులు పూర్తి చేయడానికి రూ. 1600ల కోట్లు అవసరం ఉండగా.. కేవలం రూ. 212 కోట్లు బడ్జెట్‌లో కేటాయించి పెళ్లికూతురికి చదివింపులు ఇచ్చినట్లుగా చంద్రబాబు హంద్రీ-నీవాకు నిధులు కేటాయించారని ఎద్దేవా చేశారు. 

మొదటి రోజు దీక్షలో భాగంగా పెనుకొండ, కదిరి, శింగనమల నియోజకవర్గాల పరిధిలోని  కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే సుధాకర్, నాయకులు కేటీ శ్రీధర్, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు కెవి రమణ, గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ బొమ్మలాటపల్లి నరసింహరెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి, డాక్టర్ గోవర్ధన్‌రెడ్డి, బీసీ నాగరాజు, అనిల్‌కుమార్, నారాయణమ్మ, లక్ష్మిదేవి, వనజాక్షి,  వశికేరి శివ, మైనార్టీ నాయకులు షహానాజ్, హరీఫ్, హైదర్‌వలి, రమణారెడ్డి, రామచరణ్‌తేజ్, శంకర్, వంశీ, కొండారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.     
 
పొట్టి శ్రీరాములు సేవల చిరస్మరణీయం
రాష్ట్రానికి పొట్టి శ్రీరాములు చేసిన సేవలు చిరస్మరణీయమని ఏపీ పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు దాదాగాంధీ అధ్యక్షతన చేపట్టిన రిలే నిరాహారదీక్ష కార్యక్రమానికి విచ్చేసిన రఘువీరారెడ్డి, మాజీ మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, బొత్స సత్యనారాయణ, సాకే శైలజనాథ్ తదితరులు సోమవారం పొట్టి శ్రీరాముల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణాలు ఆర్పించారని తెలిపారు.
 
ఐఎంఎం మద్దతు
 కాంగ్రెస్ రిలే దీక్షలకు ఐఎంఎం పార్టీ మద్దతు పలికింది. ఈ సందర్భంగా ఐఎంఎం అధ్యక్షుడు ఎస్.మహబూబ్‌బాషా మాట్లాడుతూ... రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించి, పోలవరం ప్రాజెక్టుకు రూ. 10 వేల కోట్లు నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహమ్మద్ రఫిక్, నేతలు అమీర్, మహబూబ్, అబ్దుల్ జబ్బర్, నబీరసూల్, నజీర్ హుస్సేన్, లాలు, బాబా ఫకృద్దీన్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు