ఒకే రోజు ముగ్గురికి పాముకాట్లు

22 Sep, 2018 11:12 IST|Sakshi

కృష్ణాజిల్లా, కోడూరు/అవనిగడ్డ: కోడూరు, అవనిగడ్డ మండలాల్లో శుక్రవారం ముగ్గురు పాముకాట్లకు గురయ్యారు. కోడూరు 10వ వార్డుకు చెందిన దామెర్ల దుర్గమ్మ (56) ఉదయం నరసింహపురం సమీపంలో పొలం పనులకు వెళ్లింది. నాటు వేస్తుండగా ఐదడుగుల మేర ఉన్న పాము దుర్గమ్మ చేతిపై కరిచింది. తోటి కూలీలు హుటాహుటిన పీహెచ్‌సీకి తరలించడంతో వైద్యులు యాంటీ స్నేక్‌ వీనం (పాము కాటు విరుగుడు మందు)ను ఇచ్చారు. దుర్గమ్మ కోలుకుంటోందని వైద్యులు తెలిపారు.

అవనిగడ్డ ఏరియా ఆస్పత్రిలో ఇద్దరికి చికిత్స
స్థానిక ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో రెండు పాముకాటు కేసులు నమోదయ్యాయి. కోడూరు మండలం పిట్టల్లంక పంచాయతీ శివారు భావిశెట్టివారిపాలెంకు చెందిన భావిశెట్టి ప్రభాకరరావు పొలం పనులకు వెళ్లగా పాముకాటుకు గురయ్యాడు. స్థానికులు స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. అలాగే స్థానిక లంకమ్మ మాన్యంలో నివాసం ఉంటున్న సీపీఐ మండల కన్వీనర్‌ నారేపాలెం శంకరరావు పొలం పనులు చేస్తుండగా కాలికి పాము కాటేసింది. వెంటనే స్థానిక వైద్యశాలలో చేరి చికిత్స పొందుతున్నారు. శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌ ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన సందర్భంగా పాముకాటు బాధితులను పరామర్శించారు. ఆయనతో పాటు ఎంపీపీ బీవీ కనకదుర్గ, జెడ్పీటీసీ కొల్లూరి వెంకటేశ్వరరావు ఉన్నారు. ఈ సందర్భంగా పాముకాటు వివరాలను బుద్ధప్రసాద్‌ అడిగి తెలుసుకోగా తగ్గుముఖం పట్టినట్టు వైద్యులు చెప్పారు. 

మరిన్ని వార్తలు