ప్రాజెక్టు ‘జియో’కు శ్రీకారం

19 Oct, 2019 04:14 IST|Sakshi
ప్రాజెక్టు జియో కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎస్పీ సిద్ధార్ధ్‌ కౌశల్‌.

పోలీస్‌ శాఖ ప్రక్షాళన దిశగా అడుగులు

ఇక కేసుల దర్యాప్తు వేగవంతం

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:పోలీస్‌ శాఖలో ప్రక్షాళన దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయడానికి ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కేసుల దర్యాప్తు విషయంలో ఎస్సైలు, సీఐలపైనే ఆధారపడకుండా ఏఎస్సైలు, హెడ్‌ కానిస్టేబుళ్లకు కూడా దర్యాప్తు బాధ్యతలు అప్పగించేలా చర్యలు చేపట్టారు. ‘జూనియర్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ (జియో)’ పేరుతో ఓ ప్రాజెక్టును ప్రారంభించి, వారికి నైపుణ్య శిక్షణను కూడా మొదలుపెట్టారు.

2020 జనవరి 1 నాటికి జూనియర్‌ ఇన్వెస్టిగేషన్‌ అధికారులు సైతం పూర్తి స్థాయి నైపుణ్యం సాధించేలా ఎప్పటికప్పుడు వారి పనితీరును సమీక్షిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ‘ప్రాజెక్టు జియో’ విజయవంతమైతే దీన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ యోచిస్తున్నారు. జూనియర్‌ ఇన్వెస్టిగేషన్‌ అధికారులకు గతంలో మాదిరిగా ఏసీ గదుల్లో శిక్షణ ఇవ్వడం కాకుండా నేరం జరిగిన వెంటనే సీనియర్‌ అధికారులు వీరిని ఘటనా స్థలానికి తీసుకెళ్లి దర్యాప్తు ఏ విధంగా మొదలుపెట్టాలి? ఎలాంటి ఆధారాలు సేకరించాలి? కేసు ఎలా నమోదు చేయాలి? దర్యాప్తును పూర్తి చేసిన తర్వాత నివేదిక ఏ విధంగా రూపొందించాలి? అనేవాటిపై క్షేత్ర స్థాయిలో శిక్షణ ఇవ్వనున్నారు.

కాగా..పోలీస్‌ శాఖలో ఉన్న సిబ్బంది కొరతను అధిగమించేందుకు ‘జియో’ ఉపయోగపడుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో డీఎస్పీ, సీఐ, ఎస్సై స్థాయి అధికారులు ప్రస్తుతం వంద మంది మాత్రమే ఉండడంతో కేసులు త్వరగా పరిష్కారం కావడం లేదు. గతేడాది జిల్లాలో 12 వేల కేసులు నమోదు కాగా 6 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో జూనియర్‌ ఇన్వెస్టిగేషన్‌ అధికారులను నియమించాక మొత్తం 500 మంది వరకు దర్యాప్తు అధికారులు తయారయ్యారు. వీరి ద్వారా కేసుల దర్యాప్తును వేగవంతం చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రతినెలా దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన జూనియర్‌ అధికారులకు రివార్డులు కూడా అందించాలని నిర్ణయించారు.

మరిన్ని వార్తలు