రిలయన్స్‌ ‘రికార్డు’ల హోరు!

19 Oct, 2019 04:19 IST|Sakshi

క్యూ2లో అత్యధిక త్రైమాసిక లాభం; రూ. 11,262 కోట్లు

రిటైల్, జియోల జోరుతోనే భారీ లాభాలు 

5 శాతం వృద్ధితో రూ.1,63,754 కోట్లకు ఆదాయం 

ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ హైకి రిలయన్స్‌ షేర్‌ 

9 లక్షల కోట్లకు కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ !

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రికార్డ్‌ స్థాయి లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌లో రూ.9,516 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.11,262 కోట్లకు ఎగసిందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది. షేర్‌ పరంగా చూస్తే, నికర లాభం రూ.16.1 నుంచి రూ.18.6కు పెరిగింది. ఒక్క క్వార్టర్‌లో ఈ స్థాయి లాభం సాధించడం ఈ కంపెనీకి ఇదే మొదటిసారి. అత్యదిక త్రైమాసిక లాభం సాధించిన ప్రైవేట్‌ కంపెనీగా తన రికార్డ్‌ను తానే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ బద్దలు కొట్టింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఈ కంపెనీ రూ.10,362 కోట్ల నికర లాభం సాధించింది. ఈ క్యూ2లో ఈ రికార్డ్‌ను బ్రేక్‌ చేసింది. స్టాండ్‌అలోన్‌ పరంగా చూసినా, ఈ క్యూ2లో రికార్డ్‌ నికర లాభం, రూ.9,702 కోట్లను ఈ కంపెనీ సాధించింది.  

రిటైల్, జియోల జోరు.....
సాంప్రదాయ రిఫైనింగ్, పెట్రో కెమికల్స్‌ విభాగాల లాభాలు బలహీనంగా ఉన్నా, రిఫైనింగ్‌ మార్జిన్లు టర్న్‌ అరౌండ్‌ కావడం, రిటైల్, టెలికం... ఈ రెండు కన్సూమర్‌ వ్యాపారాలు జోరుగా పెరగడం వల్ల ఈ రికార్డ్‌ స్థాయి లాభాలను సాధించామని కంపెనీ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ వివరించారు. ఇక ఆదాయం 5 శాతం వృద్ధితో రూ.1,63,754 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. రిటైల్‌ వ్యాపారం నిర్వహణ లాభం 12 శాతం పెరిగి రూ.2,322 కోట్లకు చేరిందని,  టెలికం విభాగం, జియో రూ.990 కోట్ల నికర లాభం సాధించిందని తెలి పారు.  ఈ రెండు విభాగాలు రికార్డ్‌ స్థాయి స్థూల లాభాలు సాధించాయని పేర్కొన్నారు.  మొత్తం కంపెనీ నిర్వహణ లాభంలో ఈ రెండు విభాగాల వాటా మూడో వంతుకు చేరిందని చెప్పారు.   

రిటైల్‌ పరుగు...
రిలయన్స్‌ రిటైల్‌ స్థూల లాభం 67% పెరిగి రూ.2,322 కోట్లకు, ఆదాయం 27% పెరిగి రూ.41,202 కోట్లకు చేరాయి. స్టోర్‌ ఉత్పాదకత, నిర్వహణ సామర్థ్యాలు మెరుగుపడటం, గ్రామీణ ప్రాంతాల్లో విస్తరణే దీనికి కారణం. క్యూ2లో కొత్తగా 337 రిటైల్‌ స్టోర్స్‌ను ప్రారంభించింది. దీంతో 6,700 నగరాల్లో మొత్తం రిటైల్‌ స్టోర్స్‌ సంఖ్య 10,901కు చేరింది.  

మరిన్ని విశేషాలు...
►9.9 మిలియన్‌ టన్నుల రికార్డ్‌ ఉత్పత్తిని సాధించినప్పటికీ, పెట్రో కెమికల్స్‌ వ్యాపారం స్థూల లాభం 6 శాతం తగ్గి రూ.7,692 కోట్లకు చేరింది. ఈ విభాగం స్థూల లాభం తగ్గడం ఇది వరుసగా ఆరో క్వార్టర్‌.  

►స్థూల రిఫైనింగ్‌ మార్జిన్‌(ఒక్క బ్యారెల్‌ ముడి చమురును ఇంధనంగా మార్చినందువల్ల లభించే మార్జిన్‌) గత క్యూ2లో 9.5 డాలర్లుగా ఉండగా, ఈ క్యూ2లో 9.4 డాలర్లకు తగ్గింది. క్యూ1 జీఆర్‌ఎమ్‌(8.1 డాలర్లు)తో పోలి్చతే పెరిగింది.  

►ఈ ఏడాది జూన్‌ చివరికి రూ.2,88,243 కోట్లుగా ఉన్న రుణభారం సెప్టెంబర్‌ నాటికి రూ.2,91,982 కోట్లకు పెరిగింది. నగదు నిల్వలు రూ.1,34,746 కోట్లకు పెరిగాయి.

జియో...జిగేల్‌
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ టెలికం విభాగం రిలయన్స్‌ జియో నికర లాభం ఈ ఆరి్థక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 45 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.681 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.990 కోట్లకు ఎగసింది. నిర్వహణ ఆదాయం రూ.9,240 కోట్ల నుంచి 34 శాతం వృద్ధితో రూ.12,354 కోట్లకు చేరింది.  రిలయన్స్‌ జియో 35 కోట్ల వినియోగదారుల మైలురాయిని దాటిందని రిలయన్స్‌ ఎమ్‌డీ ముకేశ్‌ అంబానీ తెలిపారు.  సీక్వెన్షియల్‌గా చూస్తే, ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) రూ.2 తగ్గి రూ.120కు చేరింది. కాగా ఈ క్యూ2లో కొత్తగా 2.4 కోట్ల మంది వినియోగదారులు రిలయన్స్‌ జియోకు జతయ్యారు.

రిలయన్స్‌ మార్కెట్‌ విలువ రికార్డ్‌
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ శుక్రవారం మరో రికార్డ్‌ ఘనత సాధించింది. ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ ఇంట్రాడేలో రూ.9,05,214 కోట్లను తాకింది. రూ.9 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ను తాకిన తొలి భారత కంపెనీ ఇదే. ఆరి్థక ఫలితాలపై సానుకూల అంచనాల నేపథ్యంలో (మార్కెట్‌ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి) ఇంట్రాడేలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,428ను తాకింది. చివరకు 1.3% లాభంతో రూ.1,428 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ.9 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ను తాకిన ఈ షేర్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.  రూ.8,97,179 కోట్లకు చేరింది. రూ.8 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ సాధించిన ఘనతను ఈ కంపెనీ గత ఏడాది ఆగస్టులోనే సాధించింది. కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ 14 నెలల్లోనే లక్ష కోట్లకు పైగా ఎగియడం విశేషం. మరో రెండేళ్లలో ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ 20,000 కోట్ల డాలర్ల(రూ.14 లక్షల కోట్లకు)కు పెరగగలదని ఇటీవలే బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా అంచనా వేసింది.  

వినియోగదారుల వ్యాపారాల జోరు కారణంగా రికార్డ్‌ స్థాయి లాభం సాధించాం. రిటైల్‌ వ్యాపారం వృద్ది కొనసాగుతుండటం సంతోషదాయకం. వినియోగదారులకు ఉత్తమ విలువ అందించడమే లక్ష్యంగా రిలయన్స్‌ రిటైల్‌ మంచి పనితీరు కనబరుస్తోంది. ఈ విభాగం రికార్డ్‌ స్థాయి ఆదాయాన్ని, నిర్వహణ లాభాన్ని సాధించింది. ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న డిజిటల్‌ సరీ్వసుల కంపెనీగా రిలయన్స్‌ జియో నిలిచింది. ప్రతి నెలా కొత్తగా కోటిమంది వినియోగదారులవుతున్నారు. వినియోగదారులు, ఆదాయం పరంగా రిలయన్స్‌ జియో కంపెనీ భారత్‌లోనే అతి పెద్ద కంపెనీగానే కాకుండా, డిజిటల్‌ గేట్‌వే ఆఫ్‌ ఇండియాగా కూడా నిలిచింది. ఇళ్లకు, వ్యాపార సంస్థలకు బ్రాడ్‌బాండ్‌ సేవలందించడానికి జియో ఫైబర్‌ పేరుతో మరో విప్లవాత్మకమైన చర్యకు శ్రీకారం చుట్టాం.
–ముకేశ్‌ అంబానీ, చైర్మన్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

మరిన్ని వార్తలు