జులుం చేస్తే తాట తీస్తా

12 Mar, 2016 04:40 IST|Sakshi
జులుం చేస్తే తాట తీస్తా

రౌడీషీటర్లకు ఇదే ఫైనల్ వార్నింగ్
ఎస్పీ విశాల్ గున్నీ

 
 నెల్లూరు(క్రైమ్): ‘గతంలో ఏం జరిగిందో నాకు తెలి యదు.. పద్ధతి మార్చుకోండి...ఇదే ఫైనల్ వార్నింగ్.. కాదని  జులుం చేస్తే తాట తీస్తా’ అని ఎస్పీ విశాల్‌గున్నీ రౌడీషీటర్లను హెచ్చరించారు. శుక్రవారం నగరంలోని ఉమేష్‌చంద్రా మెమోరియల్ కాన్ఫరెన్స్ హాల్లో నగరంలోని రౌడీషీటర్లకు ఎస్పీ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ రౌడీషీటర్ల కదలికలపై పోలీసు నిఘా దగ్గరగా ఉంటుందన్నారు. ఈ విషయాన్ని గమనించి ఒళ్లు దగ్గర పెట్టకొని తమ ప్రవర్తనను మార్చుకోవాలన్నారు. దందాలు, పంచాయతీలు మానుకోవాలన్నారు.  తమకు రాజకీయ నేతల అండ ఉందని తామేమి చేసినా ఎవరూ ఏమీ చేయలేరని విర్రవీగితే తగిన బుద్ధిచెబుతామన్నారు. ఇకపై ఏదైనా నేరం చేసినా, చేయించినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. 

ప్రతి వారం విధిగా పోలీసుస్టేష న్‌లో హాజరువేయించుకోవడంతో పాటు  అసాంఘిక శక్తులు, కార్యక్రమాలపై సమాచారం అందించాలన్నా రు. లేనిపక్షంలో ఆయా ప్రాంతాల్లో జరిగే నేరాలకు అక్కడున్న రౌడీషీటర్లే నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.  ప్రజాజీవనానికి, శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే దండన తప్పదన్నారు.  ఈ సందర్భంగా పలువురు రౌడీషీటర్లు తాము గతంలో చేసిన తప్పిదాల వల్ల రౌడీషీట్లు తెరిచారని తెలిపారు. కొన్నేళ్లుగా తాము ఏ నేరం చేయలేదనీ, విచారించి రౌడీషీట్లు తొలగించాలని అభ్యర్థించారు.

ఎస్పీ స్పందిస్తూ పద్ధతి మార్చుకొని శాంతియుత వాతావరణంలో జీవిస్తున్నారని తమకు నమ్మకం కల్గితే రౌడీషీట్లు ఎత్తివేస్తామన్నా రు. రౌడీషీటర్ల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే తన సెల్ 9440796300, డీఎస్పీ 9440796303కు ఫోను చేస్తే తగి న చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రెడ్డి గంగాధర్, నగర, గ్రామీణ డీఎస్పీలు జి.వెంకటరాముడు, డాక్టర్ కె.తిరుమలేశ్వర్‌రెడ్డి, నగర ఇన్‌స్పెక్టర్లు కిశోర్‌బాబు, వి.సుధాకర్‌రెడ్డి, సీతారామయ్య, సుబ్బారావు, ఎస్‌ఐలు రామకృష్ణ, విజయకుమార్, రామ్మూర్తి పాల్గొన్నారు.

 పలువురు గైర్హాజరు
కౌన్సిలింగ్‌కు పలువురు రౌడీషీటర్ల గైర్హాజరయ్యారు. వారిలో రాజకీయ పార్టీలకు చెందిన వారు ఉండటంతో పోలీసులు కౌన్సిలింగ్‌కు తీసుకురాలేదని సహచర రౌడీషీటర్లు గుసగుసలాడారు.

మరిన్ని వార్తలు