పట్టుచీర కట్టుతో.. అతనే ఆమైతే..!

26 Sep, 2019 08:32 IST|Sakshi
శ్రీనివాసులు

నాట్యగత్తెను మరిపిస్తున్న శ్రీనివాసులు 

అద్భుత అభినయంతో ప్రశంసలు

నృత్యంలో ఆదోని యువకుడి ప్రతిభ 

సాక్షి, ఆదోని(కర్నూలు): అబ్బాయి అమ్మాయి అయితే ఎలా వుంటుంది? సంప్రదాయ పట్టుచీర కట్టుతో వేదికపైకి వచ్చి.. చక్కటి హావభావాలతో కూచిపూడి, భరతనాట్యం చేస్తుంటే ఎలా అనిస్తుంది. ఆదోని పట్టణం మండగిరి వీధికి చెందిన శ్రీనివాసులు అచ్చం ఇలాగే చేస్తున్నాడు. కాళ్లకు గజ్జెలు కట్టి,   ప్రేక్షకుల మదిని దోచుకుంటున్నాడు. గతేడాది డిసెంబరు 23న గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఎన్‌ఎస్‌ఎస్‌ రాష్ట్రస్థాయి కూచిపూడి నృత్యంలో బెస్ట్‌ ఫర్మామెన్స్‌ సర్టిఫికెట్‌ అందుకున్నాడు. ఇటీవల ఆదోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో సెట్కూర్‌ యూత్‌ సర్వీసెస్‌ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి కళా ప్రదర్శన పోటీల్లో కూడా కూచిపూడిలో మొదటి బహుమతి, భరత నాట్యంలో తృతీయ బహుమతి అందుకున్నాడు.

అంతేగాక అంతర్‌జిల్లా పోటీలకు అర్హత సాదించాడు. స్థానికంగా జరిగే పలు కార్యక్రమాలలో కూడ తన అద్భుత నాట్య కళాభినయంతో అందరి మెప్పు పొందుతున్నాడు. వర్ధమాన కళాకారుడిగా ప్రశంసలు అందుకుంటున్న శ్రీనివాసులు.. స్థానికంగా ఉన్న అవ్వ ఎడ్యుకేషనల్‌ సొసైటీలో ఆరు సంవత్సరాలుగా డ్యాన్స్‌ మాస్టర్లు విజయ్‌కుమార్, వాసు, రాజ్‌కుమార్‌తో శిక్షణ పొందుతున్నాడు. డిగ్రీ దాకా పూర్తి చేసిన శ్రీనివాసులు తన జీవితాన్ని కళామతల్లికి అంకితం చేస్తానని చెప్పారు. తండ్రి బసన్న.. కట్టెల మండి వ్యాపారి. తల్లి రంగమ్మ ఇటీవలె అనారోగ్యంతో మృతి చెందింది.

అంతర్‌ జిల్లా పోటీలకు అర్హత సాదించిన శ్రీనివాసులును అవ్వ ఎడ్యుకేషనల్‌ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాచోటి రామయ్య బుధవారం అభినందించారు. నాట్యమే తన జీవితంగా భావిస్తున్న శ్రీనివాసులుకు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు రావాలని రాచోటి రామయ్య అకాంక్షించారు. తనకు చిన్నతనం నుంచి నాట్యమంటే ఎంతో మక్కువ అని, తన అసక్తి మేరకు నాట్యంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చిన సొసైటీ నిర్వాహకులు, డాన్స్‌ మాస్టర్లకు శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలిపారు. తాను నాట్యంలో అత్యుత్తమ కళాకారుడిగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోను మంచి గుర్తింపు తెచ్చుకుంటానన్న విశ్వాసం వ్యక్తం చేశారు.

చదవండి : శ్రీశైలానికి పెరిగిన వరద ప్రవాహం

మరిన్ని వార్తలు