కేంద్రం నుంచి రూ.1.50 లక్షల కోట్లు!

27 Aug, 2013 06:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: పద్నాలుగవ ఆర్థిక సంఘ కాలంలో కేంద్రం నుంచి వివిధ రూపాల్లో రూ.1,50,000 లక్షల కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందుకు అనుగుణంగా 14వ ఆర్థిక సంఘానికి ప్రజంటేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల 12 నుంచి 14వ తేదీ వరకు సంఘం చైర్మన్ వై.వి.రెడ్డి, ముగ్గురు సంఘ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వంతో ఈ విషయమై సమీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
 
 14వ ఆర్థిక సంఘానికి సమర్పించాల్సిన మెమోరాండంలో పొందుపరచాల్సిన అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలతో పాటు సాంఘిక సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాగునీటి రంగాలలో చేపడుతున్న ముఖ్యమైన కార్యక్రమాలను ఆర్థిక సంఘం దృష్టికి తీసుకెళ్లి వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టడానికి అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్ర తలసరి ఆదాయం జాతీయ సగటుతో పోల్చుకుంటే అధికంగా ఉన్నా.. విద్య, వైద్య రంగాల్లో రాష్ట్రంలోని అనేక జిల్లాలు జాతీయ సగటుకు తక్కువగా ఉన్నాయని ముఖ్యమంత్రి అన్నారు. ఈ అంశాలను ఆర్థిక సంఘం దృష్టికి తీసుకువెళ్లి వెనుకబడిన జిల్లాలకు అదనపు ఆర్థిక సహాయం అందేలా, తద్వారా జాతీయ సగటును చేరుకునే విధంగా కృషి చేయాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాలకు ఇచ్చే గ్రాంట్లపై ఆర్థిక సంఘం దృష్టి సారించేలా చేసి, అదనపు సహాయాన్ని సాధించాలని ఆయన సూచించారు. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి 14వ ఆర్థిక సంఘ కాలం ప్రారంభమవుతుంది.
 
 

>
మరిన్ని వార్తలు