రాష్ట్రానికే ‘పవర్‌’!

8 Jun, 2020 04:26 IST|Sakshi

సాక్షి, అమరావతి: విద్యుత్‌ సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వానికే సంపూర్ణ అధికారాలు ఉండాలని రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు కేంద్రానికి స్పష్టం చేశాయి. అప్పుడే విద్యుత్‌ చార్జీలు అ న్ని వర్గాలకు భారం కాకుండా ఉంటాయని పేర్కొన్నాయి. విద్యుత్తు రంగంలోకి ప్రైవేట్‌ పంపిణీ సంస్థలను తీసుకురావాలన్న ఆలోచనపై కేంద్రం పునరాలోచన చేయాలని సూచించాయి. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విద్యుత్‌ సంస్థల అధికారాలను కేంద్రీకరిస్తూ 2003 విద్యుత్‌ సంస్కరణల చట్టానికి కేంద్రం సవరణలు ప్రతిపాదించింది. దీనిపై అన్ని రాష్ట్రాలు అభిప్రాయాలు తెలియచేయాలని కోరింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఇంధన శాఖ ఇటీవల రాసిన లేఖ వివరాలను ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి ఆదివారం మీడియాకు వెల్లడించారు. 

ప్రత్యక్ష సబ్సిడీకి ప్రతికూలత 
రైతులు, పేదలకు రాష్ట్ర ప్రభుత్వం చౌకగా విద్యుత్‌ అందిస్తోంది. అయితే దీని స్థానంలో సబ్సిడీని వారి ఖాతాల్లోకే జమ చేయాలని కేంద్రం చట్ట సవరణల్లో పేర్కొంది. దీనివల్ల ఆయా వర్గాలు పలు ఇబ్బందులకు గురవుతాయి. సబ్సిడీ వారి ఖాతాల్లోకి వచ్చినా ముందుగానే విద్యుత్‌ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఇది సామాజిక సమస్యలకు కారణమవుతుంది. విద్యుత్‌ చార్జీలు ఎలా ఉండాలనేది స్థానిక పరిస్థితులను బట్టి రాష్ట్ర రెగ్యులేటరీ కమిషన్‌ నిర్ణయిస్తుంది. ఈ అధికారాన్ని కేంద్రం తీసుకుంటే పలు వర్గాలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందని రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు స్పష్టం చేశాయి.  

కేంద్రం చేతుల్లోకి కమిషన్‌ సరికాదు.. 
రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి చైర్మన్, ఇద్దరు సభ్యులను రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తోంది. ఈ అధికారాన్ని కేంద్రానికి కట్టబెడుతూ చేసిన చట్ట సవరణ ప్రతిపాదన ఏమాత్రం సమంజసంగా లేదని విద్యుత్‌ సంస్థలు పేర్కొన్నాయి. దీనివల్ల డిస్కమ్‌లు, రాష్ట్ర విద్యుత్‌ ఉత్పత్తిదారులు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.  విద్యుత్‌ కాంట్రాక్ట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధారిటీ ఏర్పాటుపై రాష్ట్ర సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రతి  వివాదానికి ఢిల్లీ వెళ్లాల్సిన పరిస్థితి డిస్కమ్‌లకు కొత్త సమస్యలు సృష్టిస్తాయని స్పష్టం చేశాయి. ఆర్థికంగానూ ఇది డిస్కమ్‌లకు ఇబ్బందేనని తెలిపాయి. విద్యుత్‌ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన రాష్ట్ర లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఎస్‌ఎల్‌డీసీ) స్థానంలో కేంద్ర లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఎన్‌ఎల్‌డీసీ)కి సర్వాధికారాలు కట్టబెట్టే యోచనను విద్యుత్‌ సంస్థలు వ్యతిరేకించాయి. దీనివల్ల డిస్కమ్‌లు ఆర్థికం గా నష్టపోయే వీలుందని ఆందోళన వ్యక్తం చేశాయి. 

ప్రైవేట్‌ పవర్‌కు జవాబుదారీ ఎవరు? 
ప్రైవేట్‌ విద్యుత్‌ పంపిణీ సంస్థలను రంగంలోకి దించే ఈ చట్ట సవరణ ప్రతిపాదనపై డిస్కమ్‌లు పలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. విద్యుత్‌ పంపిణీ విషయంలో ఎవరు జవాబుదారీగా ఉంటారనేది చట్టంలో స్పష్టత ఇవ్వలేదని తెలిపాయి. ఫ్రాంచైజ్, లైసెన్స్‌లు, సబ్‌ లైసెన్స్‌ల విధానాన్ని వివరిస్తూ స్పష్టమైన మార్గదర్శకాలను ప్రజల ముందుంచాలని సూచించాయి. ఏదేమైనా రైతులకు ఉచిత విద్యుత్‌ అందించాలన్నా, పేదలకు చౌకగా విద్యుత్‌ సరఫరా జరగాలన్నా విద్యుత్‌ సంస్థలపై రాష్ట్రాలకే అధికారం ఉండాలని అభిప్రాయపడ్డాయి.  

మరిన్ని వార్తలు