అరకొరే వచ్చాయ్‌!

27 Jun, 2018 13:41 IST|Sakshi

పూర్తిగా పంపిణీకాని పాఠ్యపుస్తకాలు

రెండో దశ పుస్తకాల కోసం ఎదురు చూపులు

సాక్షి, విశాఖపట్నం: వేసవి సెలవులు పూర్తయ్యాయి. పాఠశాలలు తెరచుకున్నాయి.అయినా పాఠ్య పుస్తకాలు పూర్తిస్థాయిలో జిల్లాకు చేరలేదు. వచ్చిన అరకొర పుస్తకాల పంపిణీ పూర్తి కాలేదు. జిల్లాలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న వారు సుమారు 6.10 లక్షల మంది పిల్లలు ఉన్నారు. వీరిలో ప్రాథమిక పాఠశాలల్లో 3.10 లక్షలు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1.80 లక్షలు, ఉన్నత పాఠశాలల్లో 1.20 లక్షల మంది చదువుతున్నారు. ఒకటి నుంచి ఐదు తరగతుల వారికి తెలుగు, ఇంగ్లిష్, గణితం, పరిసరాల విజ్ఞానం సబ్జెక్టుల్లో బోధన ఉంటుంది.

హైస్కూల్‌ పిల్లలకు తెలుగు, ఇంగ్లిష్, హిందీ, గణితం, సాంఘిక శాస్త్రం, సామాన్య శాస్త్రం సబ్జెక్టులుంటాయి. ఇలా వీరందిరికీ సుమారు 19 లక్షల పాఠ్య పుస్తకాలు అవసరం. పాఠశాలలు తెరిచాక ఇప్పటివరకు సగం అంటే దాదాపు 10 లక్షల పాఠ్య పుస్తకాలు వచ్చాయి. వీటిని ఆయా స్కూళ్లకు ఎమ్మార్సీ కార్యాలయాల నుంచి పంపిణీ చేయిస్తున్నారు. ఇంకా మరో 9 లక్షల పుస్తకాలు రావాల్సి ఉంది. ఇవి మరో వారం రోజుల్లో రావచ్చని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.  అయితే పూర్వ విద్యార్థుల నుంచి గతేడాది పుస్తకాలను సేకరించి బుక్‌ బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తున్నారు. కొత్తవి వచ్చే వరకు వీటితో విద్యాబోధన సాగిస్తున్నారు.

ఎందుకీ ఆలస్యం!
ఈ ఏడాది నుంచి విద్యాశాఖ పాఠ్య పుస్తకాలకు క్యూఆర్‌ కోడ్‌ విధానాన్ని అమలు చేస్తోంది. ఈ పుస్తకాలపై క్యూఆర్‌ (క్విక్‌ రెస్పాన్స్‌) కోడ్‌ ఉంటుంది. వీటిని స్కాన్‌ చేయడం ద్వారా డిజిటల్‌ లెస్సన్స్‌ను ఆండ్రాయిడ్‌ మొబైళ్లు, ట్యాబ్‌లు, కంప్యూటర్లలోకి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. వాటిని విద్యార్థులు చదువుకోవడానికి వీలవుతుంది. ఇదంతా కొత్త విధానం కావడం వల్ల పుస్తకాల ముద్రణ, సరఫరా, పంపిణీ ఆలస్యమవుతుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

నెలాఖరుకల్లా రావచ్చు..
జిల్లాకు ఇప్పటిదాకా 10 లక్షల పాఠ్య పుస్తకాలు వచ్చాయి. వీటిని ఆయా పాఠశాలల్లో  పంపిణీ చేయిస్తున్నాం. మరో 9 లక్షల పుస్తకాలు అవసరమవుతాయి. ఇవి ఈ నెలాఖరుకల్లా వస్తాయని భావిస్తున్నాం. అప్పటిదాకా విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా బుక్‌ బ్యాంకులో ఉంచిన గతేడాది పుస్తకాలతో విద్యాబోధన సాగిస్తున్నాం.– బి.లింగేశ్వరరెడ్డి,జిల్లా విద్యాశాఖాధికారి

మరిన్ని వార్తలు