ఉపకారం..అందనంత దూరం!

21 Feb, 2019 13:34 IST|Sakshi

 నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న విద్యార్థులు

ఏటా ప్రీమియం చెల్లిస్తున్న పొదుపు మహిళలు  

నిధుల విడుదలలో ప్రభుత్వం తీవ్ర జాప్యం  

కర్నూలు, ఆళ్లగడ్డ: స్వయం సహాయక సంఘాల సభ్యుల పిల్లలకు ఉపకారవేతనాల పంపిణీ కార్యక్రమం అటకెక్కింది. నాలుగేళ్ల క్రితం వరకు ఆమ్‌ ఆద్మీ బీమా యోజన, అభయ హస్తం, జనశ్రీ బీమా యోజన పేరుతో ప్రతి ఏటా ఆగస్టులో స్కాలర్‌షిప్‌లు ఇచ్చేవారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా పథకాలను చంద్రన్న బీమా కిందకు తీసుకొచ్చారు కానీ అమలు చేయడం లేదు. ఏటా ప్రీమియం చెల్లిస్తున్న  పొదుపు మహిళలు మాత్రం తమ పిల్లలకు  స్కాలర్‌షిప్‌లు ఎప్పుడు ఇస్తారోనని ఎదురుచూస్తున్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ హయాంలో  పొదుపు మహిళల పిల్లలకు  ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం మొదలైంది. నాటి నుంచి 2014 వరకు  ఈ కార్యక్రమం సక్రమంగా సాగింది. ఆమ్‌ఆద్మీ, జనశ్రీ బీమా యోజన (ప్రస్తుతం చంద్రన్న బీమా)  పథకం కింద లబ్ధిదారులు ఏడాదికి రూ. 115 చొప్పున కమ్యూనిటీ మేనేజ్‌డ్‌ మైక్రో ఇన్సూరెన్స్‌కు ప్రీమియం చెల్లించాలి. అభయ హస్తం పథకంలో ఉన్నవారు ఏడాదికి రూ. 385 చెల్లించాలి. అలా చెల్లించిన వారి పిల్లలకు ఏడాదికి రూ. 1200 చొప్పున స్కాలర్‌షిప్‌లు ఇస్తారు. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్‌మీడియట్‌ చదివే విద్యార్థులు ఇందుకు అర్హులు.  

నాలుగేళ్లుగా ఎదురుచూపు
ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమ్‌ ఆద్మీ బీమా , అభయహస్తంను చంద్రన్న బీమాలోకి విలీనం చేశారు.  ఏటా జిల్లా వ్యాప్తంగా 1,18,780 మంది పొదుపు మహిళలు ప్రీమియం చెలిస్తున్నారు. అయితే, చదువు

కుంటున్న వీరి పిల్లలకు ఇప్పటి వరకు పైసా ఉపకార వేతనం అందలేదు.  2015 – 16, 2016 – 17, 2017 – 18 విద్యా సంవత్సరాలకు సంబంధించి ఇప్పటి వరకు మంజూరు కాలేదు. మరికొద్దిరోజులు గడిచితే  2018 – 19 విద్యా సంవత్సరం కూడా పూర్తవుతుంది. స్కాలర్‌షిప్‌లు మంజూరైతే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఎంతో కొంత ఊరట లభించేది.   

సన్నగిల్లుతున్న ఆశలు
పొదుపులో ఉన్న వారు ఎక్కువగా పేదలు. పనిచేస్తే కానీ పూటగడవదు. అలాంటి వీరు పిల్లలకు ఉపకారవేతనాలు వస్తే చదివించుకోవచ్చని ఆశించి ప్రీమియం చెలిస్తున్నారు.  అయితే, వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లేలా వ్యవహరిస్తుంది. ఉపకారవేతనాలు మంజూరు చేస్తుందో లేదో అధికారులకు సైతం తెలియని పరిస్థితి. చాలా మంది  మహిళలు ప్రతి రోజు పొదుపు సంఘాల లీడర్లు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో ఆమ్‌ ఆద్మీ బీమా యోజన కింద 22,794మంది, చంద్రన్న బీమా కింద 78,820 మంది, అభయహస్తం  కింద  16,166 మంది ఉపకారవేతనాల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారు.

సభ్యులకు సమాధానం చెప్పలేకపోతున్నాం
నేను జనశ్రీ బీమా యోజన కింద   ఒక్కో సభ్యురాలితో రూ. 115 లెక్కన 40 మంది,  అభయ హస్తం కింద రూ. 385 ప్రకారం 15 మంది, ఆమ్‌ఆద్మీ బీమా కింద రూ. 115 ప్రకారం 20 మందితో ప్రీమియం వసూలు చేసి కార్యాలయంలో చెల్లించా.  5 సంవత్సరాల నుంచి ప్రతి ఏటా చెల్లిస్తూనే ఉన్నాం. ఇంతవరకు ఒక్క సభ్యురాలికి కూడా  పైసా రాలేదు. ఎందుకు రావడం లేదని సభ్యులు అడిగితే  సమాధానం చెప్పలేక పోతున్నాం. అధికారులను అడిగితే తెలియదంటున్నారు.– ప్రమీల, ఐక్య సంఘం  లీడర్‌  

మరిన్ని వార్తలు