సమగ్ర వివరాలు సమర్పించండి

26 Apr, 2015 02:44 IST|Sakshi

హౌసింగ్ సొసైటీల్లో అక్రమాలపై అధికారులకు సభా సంఘం ఆదేశం
 
హైదరాబాద్: హౌసింగ్ సొసైటీల్లో చోటుచేసుకున్న అక్రమాలపై సమగ్ర వివరాలను తమ ముందు ఉంచాలని శాసనసభా సంఘం అధికారులను ఆదేశించింది. వివిధ హౌసింగ్ సొసైటీల్లో అక్రమాలపై నిగ్గుతేల్చేందుకు ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ నేతృత్వంలో ఏర్పాటైన సభా సంఘం శనివారం శాసనసభ కమిటీ హాల్‌లో సమావేశమై ఫిల్మ్‌నగర్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వర్ తదితర సొసైటీల్లో చోటుచేసుకున్న అవకతవకలపై విచారణ జరిపింది. అసమగ్ర వివరాలతో సమావేశానికి వచ్చిన అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సమావేశంలో ప్రధానంగా పద్మాలయ, జయభేరీ స్టూడియోలలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సభా సంఘం అధికారులను నిలదీసింది.

జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో అక్రమంగా నిర్వహిస్తున్న భారతీ విద్యా భవన్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్ గుర్తింపు గడువు ముగుస్తున్న నేపథ్యంలో మళ్లీ పునరుద్ధరించవద్దని అధికారులకు సూచించింది. హౌసింగ్ సొసైటీల్లో నిబంధనల మేరకు సామాజిక అవసరాలకు కేటాయించిన 10 శాతం స్థలాల్లో సైతం వ్యాపార, వాణిజ్య భవనాలను నిర్మిస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడింది. ఈ సమావేశంలో సభా సంఘం సభ్యులు కర్నె ప్రభాకర్, కె.జనార్దన్‌రెడ్డి, భానుప్రసాదరావు, గువ్వల బాలరాజు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, అహమ్మద్ బలాల, చింతల రామచంద్రారెడ్డి, మాగంటి గోపినాథ్‌తో పాటు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.జి గోపాల్, జీహెచ్‌ఎంసీ ప్రత్యేకాధికారి సోమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు