తండ్రీకొడుకులు ఇద్దరూ స్కామ్‌స్టర్‌లే  | Sakshi
Sakshi News home page

తండ్రీకొడుకులు ఇద్దరూ స్కామ్‌స్టర్‌లే 

Published Wed, Sep 6 2023 5:44 AM

Perni Nani comments on Chandrababu and Lokesh - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిన స్కామ్‌.. సీమన్స్, అమరావతి భూకుంభకోణాల దారులన్నీ ఒకే చోటుకు చేరుతున్నాయని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) చెప్పారు. ఐటీ శాఖ చంద్రబాబుకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్న వ్యక్తులే.. సీమన్స్, అమరావతి అసైన్డ్‌ భూకుంభకోణాల్లో ప్రధానపాత్ర పోషించారని సీఐడీ తేల్చిందని గుర్తుచేశారు. ఈ కుంభకోణాల మూలాలు చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్‌ల వద్దే ఉన్నాయని చెప్పారు. తండ్రీకొడుకులు ఇద్దరూ స్కామ్‌స్టర్‌లేనన్నారు.

వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధానిలో ఎస్సీ, ఎస్టీ అసైన్డ్‌ భూములు చేతులు మార్చే క్రమంలో పెద్ద స్కామ్‌ జరిగిందని గతంలోనే సీఐడీ తేల్చిందని గుర్తుచేశారు. అమరావతి పేరుతో జరిగిన స్కామ్‌లన్నింటిలో డొల్ల కంపెనీలు పెట్టి, వాటిద్వారా తండ్రీకొడుకులు ముడుపులు పుచ్చుకున్న విషయాలు ఇప్పటికే సీఐడీ విచారణలో రట్టయిందని ఎత్తిచూపారు. డొల్ల కంపెనీలతో డబ్బును జేబులో వేసుకోవడం.. హవాలా ద్వారా తండ్రీకొడుకులకు చేరవేయడంలో ఈ మధ్య కూడా మరో స్కామ్‌ బయటకొచ్చిందని చెప్పారు.

అమరావతిలో రాజధాని కడతానని, ప్రతి ఇటుకకు డబ్బులివ్వండని.. మనల్ని అందర్నీ తాకట్టు పెట్టి బాండ్స్‌ ఇష్యూచేసి చంద్రబాబు తెచ్చిన డబ్బులు ఆయా కంపెనీలకు ఇచ్చారని తెలిపారు. ఆ కంపెనీల ద్వారా నిధులు డొల్ల కంపెనీలకు మళ్లించారని, ఐటీ శాఖ నోటీసులు చూస్తే.. చంద్రబాబు మొత్తం రూ.160 కోట్ల రూపాయలు కొట్టేశారని తేలిందని చెప్పారు. లోకేశ్‌ మిత్రుడు రాజేశ్, చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ ద్వారా అమరావతి పేరుతో జనం సొమ్మును కొట్టేశారన్నారు. ఐటీ శాఖ నోటీసుల్లో పేర్కొన్న తరహాలోనే.. ఇప్పటికే సీఐడీ విచారణలో తేలిన స్కిల్‌ స్కాం, అమరావతి అసైన్డ్‌ భూముల కుంభకోణం, కాంట్రాక్ట్‌ పనుల్లో అక్రమాలు, ఫైబర్‌నెట్‌ స్కామ్‌లలోను ఈ వ్యక్తుల ద్వారా ఇదే విధమైన రూటింగ్‌ జరిగిందని చెప్పారు.

ఎంవీపీ, పీఏ శ్రీనివాస్, రాజేశ్‌ తదితరులు ఆ కుంభకోణాల్లోను ప్రధానపాత్ర పోషించారన్నారు. ఐదేళ్లలో రకరకాల స్కీమ్‌ల పేరుతో స్కామ్‌లు చేసిన చంద్రబాబు వేలకోట్ల రూపాయలు దోచుకుని హైదరాబాద్‌­లో దాచుకున్నారని మండిపడ్డారు. ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయన్నారు.  ప్రజాధనాన్ని దోచేసిన తండ్రీకొడుకులను వలేసి భలే పట్టుకున్నారని ఐటీ శాఖను ప్రశంసించాల్సింది పోయి విమర్శించడం సిగ్గుచేటని చెప్పారు. తండ్రీకొడుకులు ఏయే పాపాలు చేశారని నాలుగేళ్లుగా చెబుతున్నామో అవన్నీ ఒక్కొక్కటిగా ఆధారాలతో దొరుకుతున్నాయని తెలిపారు. కచ్చితంగా చంద్రబాబు పాపం పండే రోజు వచ్చింది.. అవినీతి బట్టబయలైంది.. పరిహారం చెల్లించాల్సిన రోజు వస్తుంది.. అని పేర్ని నాని చెప్పారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement