వైఎస్‌ జగన్‌కు చెరకు రైతుల వినతి

17 Oct, 2018 11:16 IST|Sakshi

సాక్షి , విజయనగరం: ప్రజాసంకల్పయాత్రలో వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ప్రజలు కలిసి తమ సమస్యలు విన్నవించుకుంటున్నారు. ఇందులో భాగంగా రంగరాయపురం వద్ద చెరకు రైతులు కలిసి వినతి పత్రం అందజేశారు. గత ఏడాది రైతులకు బకాయిలు ఉన్న రూ.13 కోట్లు ఎన్‌సీఎస్‌ ఘగర్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి సుజయ కృష్ణా రంగారావు దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లినా తమ సమస్య పరిష్కారం కాలేదని రైతులు గోడు వెల్లబోసుకున్నారు. బకాయి బిల్లుల కోసం ఉద్యమిస్తామంటే రైతులపై పోలీసు కేసులు పెట్టిస్తామని బెదిరిస్తున్నారని కన్నీరుమున్నీరయ్యారు. ఎన్‌సీఎస్‌ ఘగర్‌ ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేయాలని కోరారు.

సరైన రోడ్డు లేక అవస్థలు పడుతున్నాం: విద్యార్థులు

ప్రజాసంకల్పయాత్రలో ఉన్న వైఎస్‌ జగన్‌ను స్కూలు విద్యార్థులు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. పాత పెంట ప్రభుత్వ స్కూల్‌కి రోడ్డు లేక వెళ్లలేకపోతున్నామని వైఎస్‌ జగన్‌కు తెలిపారు. ఎం.బూర్జివలస, ఎం.పనుకువలస, కొత్తపెంట, గుణతోటవలస పరిసర ప్రాంతాల విద్యార్థులు పాత పెంట స్కూలులోనే చదువుకోవాల్సిన పరిస్థితి ఉందని వివరించారు. 15 ఏళ్ల క్రితం మట్టి రోడ్డు వేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు.

ఇప్పుడా రోడ్డు గుంతలమయం అయిందన్నారు. వర్షం పడితే నడవటానికి కూడా వీలులేని దుస్థితి ఆ రోడ్డులో ఉందని చెప్పారు. తమ ప్రాంతాల నుంచి బొబ్బిలి మీదుగా 15 కిలోమీటర్లు తిరిగి రావలసి వస్తోందని బాధ వ్యక్తం చేశారు. 500 మంది విద్యార్థులు ఈ స్కూల్లో చదువుతున్నామని, స్కూల్‌కు వెళ్లేందుకు రోడ్డు వేయించాలని వైఎస్‌ జగన్‌ను కోరారు.

>
మరిన్ని వార్తలు