వేసవిలో చెమటకాయలా.. అయితే ఇలా..

31 Mar, 2018 13:18 IST|Sakshi

నిడమర్రు:వేసవికాలం వచ్చిందంటే.. మండే ఎండలు, భరించలేని చెమట. దీంతో పాటు శరీరంపై చెమటకాయలూ మొదలవుతాయి. ఈ కాలంలో ఇది చాలా మందిని బాధించే సమస్య. చెమటకాయల సమస్య పిల్లల్లో మరీ ఎక్కువ. శరీరంపై చెమటకాయలు ఉన్నప్పుడు వారి ప్రవర్తనలో చిరాకు ఎక్కువగానే కనిపిస్తుందని జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త, పిల్లల వైద్యనిపుణులు కె. శంకరరావు అంటున్నారు. ఈ చెమట పట్టడం అనేది ఒకరకంగా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే విధానం అని అన్నారు.  చెమట అధికమైనప్పుడు శరీరం మీద చెమటకాయలు ఏర్పడతాయని, వీటిని వైద్య పరిభాషలో ‘మిలీరియా రుబ్రా’ అంటారన్నారు. చెమటకాయలు ఎలా ఏర్పడతాయి.. తీసుకోవల్సిన జాగ్రత్తలు.. చికిత్స గురించి పలు సూచనలు తెలిపారు. ఆ వివరాలు తెలుసుకుందాం.

ఇలా ఏర్పడతాయి
చర్మంలో ఎక్రైన్‌ స్వెట్‌ గ్లాండ్స్‌ అనే చెమట గ్రంధులు ఉంటాయి. అలాగే మన చర్మంలో సహజంగా స్టెణలోకాకస్‌ ఎపిడెర్మిస్‌ అనే బ్యాక్టీరియా ఎప్పుడూ ఉంటుంది. ఈ బ్యాక్టీరియా వల్ల మృత చర్మకణాల వల్ల స్వేద రంధ్రాలు మూసుకుపోతాయి. దీంతో చెమట కాయలలాగా తయారవుతుంది. ఒక్కోసారి ఈ చెమటకాయల్లో చీము కూడా చేరుతుంది. ఈ చెమటకాయలు నిర్లక్ష్యం చేస్తే, ఇవి పెద్ద గడ్డలుగా మారే అవకాశం ఉంది. చెమటకాయలు వచ్చినచోట చెమట పట్టడం తగ్గిపోతుంది.

పిల్లలకే ఎక్కువ ఈ సమస్య
ఇవి పెద్దవాళ్ల కంటే పిల్లలకే ఎక్కువగా వస్తాయి. పుట్టిన బిడ్డ నుంచి రెండేళ్లలోపు వయసున్న పిల్లల్లో చెయటకాయల సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. చిన్నపిల్లల్లో ఈ స్వేదనాళం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందదు. ఆలాగే ఎండల్లో ఎక్కువగా తిరిగే పెద్దవారికి, చల్లటి ప్రదేశాల నుంచి వేడి ప్రదేశాలకు తరలి వెళ్లినవారికి, బిగుతుగా ఒంటికి పట్టేసినట్టు ఉండే వస్త్రాలు ధరించేవారికి, జ్వరం వచ్చినవారికి, ఈ చెయటకాయలు శరీరంపై ఏర్పడే అవకాశం ఎక్కువ.

చెమటకాయలు శరీరంపై ఇలా
చెమటకాయలు శరీరం మీద చాలా భాగాల్లో కనిపిస్తాయి. ముఖ్యంగా ముఖం, మెడ, చర్మం ముడత పడే చోట, వస్త్రాలు ఒరిపిడి ఉండే చోట ఉంటాయి.
పిల్లలలో.. ముఖం, వీపు, మెడ, గజ్జలు,
పెద్దవారిలో.. మెడ, తల, వీపు, చేతులపై చెమట కాయలు ఏర్పడతాయి.

జాగ్రత్తలు ఇలా..
శరీరానికి చెమట ఎక్కువగా పట్టకుండా జాగ్రత్త పడాలి.
వేడి వాతావరణంలోకి వెళ్లకూడదు.
చల్లటి ప్రదేశాలు లేదా ఏసీ ఉన్నచోట ఉండాలి.
మందంగా ఉండి, చుట్టేసేలాంటి వస్త్రాలు ధరించకూడదు.
బట్టల ఒరిపిడి లేకుండా చూసుకోవాలి.
సాధ్యమైనంత వరకూ పల్చగా ఉండే నూలు ధరించాలి.
బట్టల ఒరిపిడి లేకుండా చూసుకోవాలి.
సాధ్యమైనంత వరకూ పల్చగా ఉండే వస్త్రాలు ధరించాలి.
సబ్బును ఎక్కువగా వాడకూడదు.
సన్‌స్క్రీన్‌ లోషన్లు వాడాలి.
పిల్లలు ఎండలో చెమట పట్టేటట్టు ఆటలు ఆడకూడదు.
అందుబాటులో ఉంటే పండ్ల రసాలు, కొబ్బరి బొండం, నీటితో పాటు ఎక్కువగా మంచినీరు తాగుతూ ఉండాలి.

చికిత్స ఇలా..
ప్రిక్లీ హీట్‌ పౌడర్‌: ఈ పౌడర్‌ డ్రయింగ్‌ మిల్క్‌ ప్రోటీన్, ట్రైక్లోజాన్, మెం«థాల్‌ అనే పదార్థాలు ఉంటాయి. వీటిలో మిల్క్‌ ప్రొటీన్, ట్రైక్లోజాన్‌లు ఇన్‌ఫెక్షన్‌ని తగ్గిస్తాయి. మెంథాల్‌ శరీరానికి చల్లదనాన్ని కలిగిస్తుంది.
రోజుకి మూడు నాలుగుసార్లు చన్నీటి స్నానం చేస్తుంటే మంచిది. స్నానం చేసేటప్పుడు సబ్బును ఎక్కువగా వాడకూడదు.
చెమటకాయలు ఎక్కువగా ఉంటే క్యాలమిన్‌ లోషన్‌ వాడాలి.
జింక్‌ ఆక్సైడ్‌ వాడటం కూడా మంచిదే.
ఈ రెండూ వాడినా చెమటకాయలు తగ్గకపోతే చర్మవ్యాధుల నిపుణుడిని( డెర్మటాలజిస్ట్‌) సూచన మేరకు మాత్రమే ట్రోపికల్‌ కార్డికోస్టెరాయిడ్స్‌/ట్రోపికల్‌ యాంటీ బయాటిక్స్‌ వాడాలి.

మరిన్ని వార్తలు