305 పోస్టులు.. 3887 మంది అభ్యర్థులు

20 Oct, 2013 06:35 IST|Sakshi

ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: మహిళా శిశు సంక్షేమ శాఖలో పెద్ద సంఖ్యలో సూపర్‌వైజరు పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల పరిధిలోని వారికి ఒంగోలులో ఈ నెల 27వ తేదీ రాత పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. మూడు జిల్లాల పరిధిలో మొత్తం 305 పోస్టులకుగాను 3887 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో ప్రకాశం జిల్లా నుంచి 1214 మంది, గుంటూరు జిల్లా నుంచి 1891 మంది, నెల్లూరు జిల్లా నుంచి 782 మంది అభ్యర్థులు ఉన్నారు. అర్హులైన అంగన్‌వాడీ కార్యకర్తలు, కాంట్రాక్టు సూపర్‌వైజర్లు, గ్రేడ్-1, గ్రేడ్-2, అంగన్‌వాడీ శిక్షణ కేంద్రాల్లో పని చేసే కో-ఆర్డినేటర్లు రెగ్యులర్ సూపర్‌వైజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రతిభ, రోస్టర్ పద్ధతిన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. సూపర్‌వైజర్ పోస్టులకు సంబంధించిన మార్గదర్శకాలను మహిళా శిశు సంక్షేమ శాఖ రీజనల్ డిప్యూటీ డెరైక్టర్ సీహెచ్ కామేశ్వరమ్మ శనివారం విడుదల చేశారు.
 
 పరీక్ష నిర్వహణ సిలబస్
 ఆరేళ్లలోపు పిల్లలకు పోషణ, రక్షణ, ఆరోగ్య పరీక్షలు, రిఫరల్ సేవలు, వ్యాధి నిరోధక టీకాలు, ఆహార పదార్థాల పంపిణీ, నిర్వహణ, సాధారణ అవగాహన, పూర్వ ప్రాథమిక విద్య, శిశు అభివృద్ధి, స్త్రీ, శిశువుల రక్షణ, గృహ హింస,మహిళలపై హింస  సమగ్ర బాలల పరిరక్షణ పథకం, పోషణ, ఆరోగ్యవిద్య, గర్భిణులు, బాలింతలకు కౌన్సెలింగ్ వంటి అంశాలపై పరీక్షల సిలబస్ ఉంటుంది.
 
 పరీక్ష ఎలా నిర్వహిస్తారంటే..
 = 45 మార్కులకు (90 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలతో) ఓఎంఆర్ షీట్స్ ద్వారా రాత పరీక్ష నిర్వహించనున్నారు.
 = 8 తప్పుల సమాధానాలకు ఒక మార్కు మూల్యాంకనంలో తగ్గిస్తారు.
 = గ్రేడ్-1, గ్రేడ్-2 కాంట్రాక్టు సూపర్‌వైజర్లకు సర్వీస్ వెయిటేజ్ కింద 15 శాతం, బాలసేవిక శిక్షణ పొందిన వారికి 5 మార్కులు అదనంగా కేటాయించనున్నారు.
 = ఓఎంఆర్ షీట్స్‌లో సమాధానాలను బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్నుతో రాయాలి.
 
 పరీక్షలు ఎక్కడ జరుగుతాయంటే..
 ప్రకాశం జిల్లా నుంచి దరఖాస్తున్న వారిలో 538 మందికి సంతనూతలపాడు సమీపంలోని ఎస్‌ఎస్‌ఎన్ ఇంజినీరింగ్ కాలేజీ ఏ-బ్లాక్ ,  676 మందికి బీ-బ్లాక్‌లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా నుంచి దరఖాస్తు చేసుకున్న వారిలో 960 మందికి ఒంగోలులోని రావ్ అండ్ నాయుడు ఇంజినీరింగ్ కాలేజీ, 931 మందికి రైజ్ ప్రకాశం గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్‌లో పరీక్షా కేంద్రాలు కేటాయించారు. నెల్లూరు జిల్లా నుంచి దరఖాస్తు చేసుకున్న వారిలో 336 మందికి ఒంగోలులోని సెయింట్ జేవియర్స్ జూనియర్ కాలేజీ, 288 మందికి సెయింట్ జేవియర్స్ హైస్కూల్, 158 మందికి సంతనూతలపాడు సమీపంలోని ఎస్‌ఎస్‌ఎన్ ఇంజినీరింగ్ ఏ-బ్లాక్‌లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
 
 దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు: ఆర్‌డీడీ కామేశ్వరమ్మ
 సూపర్‌వైజర్ పోస్టులకు ప్రతిభ, రోస్టర్ పద్ధతి ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారని రీజనల్ డిప్యూటీ డెరైక్టర్ కామేశ్వరమ్మ వెల్లడించారు. అభ్యర్థులు దళారు మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. పరీక్షలు పారదర్శకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు పరీక్ష రోజు ఉదయం పది గంటలకల్లా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. అభ్యర్థులకు సంబంధిత సీడీపీఓల ద్వారా వారి కార్యాలయాల్లో హాల్ టికెట్లు అందిస్తామన్నారు. ఓఎంఆర్ షీట్స్ భర్తీ చేయించడం, సిలబస్‌పై తరగతుల నిర్వహించడం ద్వారా  పరీక్ష విధానంపై అభ్యర్థులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు