ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తాం

6 Oct, 2014 01:53 IST|Sakshi
ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తాం

 ఉంగుటూరు : ప్రతి కార్యకర్తకు, వారి కుటుంబానికి అండగా నిలుస్తామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) భరోసా ఇచ్చారు. ఆదివారం రాత్రి నారాయణపురంలో ఉంగుటూరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగింది. నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాని మాట్లాడారు. జిల్లాలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, వారికి అండగా నిలుస్తామని ఆయన చెప్పారు. చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీలతో మోసపోయిన రైతులు, డ్వాక్రా మహిళలకు అండగా ఉండి పోరాడతామని నాని చెప్పారు. టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడితే అవసరమైతే పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా వచ్చి కార్యకర్తలకు అండగా నిలబడతారన్నారు. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయటంతో పాటు, మండల, జిల్లా కమిటీలలో నిజాయితీగా పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు ఇస్తామన్నారు. రుణమాఫీ, ఎన్నికల వాగ్ధానాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు జన్మభూమి కార్యక్రమాన్ని చేపట్టారని, ఆయన కుతంత్రాలను ప్రజలు గ్రహించాలన్నారు. చంద్రబాబు రుణమాఫీ చేయకపోవడంతో రైతులు, డ్వాక్రా మహిళలు రాష్ట్రవ్యాప్తంగా 14 వేల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. యానిమేటర్ల సమ్మె, వారి సమస్యలపై పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి అసెంబ్లీలో ప్రస్తావిస్తామని నాని హామీ ఇచ్చారు.
 
 ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించండి
 ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతి కార్యకర్త ఉద్యమించాలని ఆళ్ల నాని పిలుపునిచ్చారు. జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో సమస్యలపై నిలదీయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు జీఎస్ రావు మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత రుణామాఫీని పంచవర్ష ప్రణాళికగా అమలు చేస్తామని చెప్పటం అందరినీ మోసగించటమేనన్నారు. పింఛన్‌దారుల ఎంపికలో పచ్చ చొక్కాలకే అవకాశమిచ్చారని, అఖిలపక్ష కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. పార్టీ క్రమశిక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇందుకూరి రామకృష్ణంరాజు మాట్లాడుతూ తప్పులు వాగ్ధానాలు చేసి చంద్రబాబు గెలిచారని, ప్రజలు మోసపోయినట్టు ఇప్పుడు గ్రహిస్తున్నారన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు మాట్లాడుతూ నియోజకవర్గ కార్యకర్తలకు ఎప్పడూ అండగా ఉంటానని చెప్పారు. ఏ ఒక్కరినీ మరిచిపోనని, ఎక్కడైనా సమన్వయలోపం ఉంటే సరిదిద్దుకుని, నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తాన్నారు. సమావేశానికి ఉంగుటూరు, భీమడోలు, నిడమర్రు, గణపవరం మండలాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు,నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో బీసీ జిల్లా నాయకుడు ఘంటా ప్రసాదరావు, ఏలూరు ఏఎంసీ మాజీ చైర్మన్ పటగర్ల రామ్మోహనరావు, ఎంపీటీసీ సభ్యులు తోట సత్యనారాయణ, గాలింకి ప్రమీలారాణి, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి నేకూరి ఆశీర్వాదం, వైఈసీ నాయకులు బండారు నాగరాజు, సలాది భీమరాజు, కలిదిండి సుబ్బతాతరాజు, చల్లా సూర్యారావు, నడిపంల్లి సోమరాజు, సూర్యనారాయణరాజు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు