యానాంలో స్వైన్‌ఫ్లూ కలకలం..

22 Apr, 2019 12:56 IST|Sakshi
అంబేడ్కర్‌నగర్‌ ఏటిగట్టు ప్రాంతం వద్ద పందులు స్వైర్యవిహారం

అంబేడ్కర్‌నగర్‌ వ్యక్తికి సోకిందని నిర్ధారణ

కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న యువకుడు

తూర్పుగోదావరి, యానాం: యానాం పట్టణంలో స్వైన్‌ఫ్లూ కలకలం సృష్టించింది. పట్టణపరిధిలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన ఇసుకపట్ల సంపత్‌ అనే వ్యక్తికి స్వైన్‌ఫ్లూ సోకిందని కాకినాడకు చెందిన ఒక ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు రక్తపరీక్షల ఆధారంగా గుర్తించి మెరుగైన వైద్యం కోసం అతడిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. కొన్ని రోజులుగా సంపత్‌ అనారోగ్యబారిన పడడంతో అతడిని కుటుంబసభ్యులు శుక్రవారం యానాంలో ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకువెళ్లగా పరిస్థితి విషమించడంతో కాకినాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ వివిధ పరీక్షలు నిర్వహించి ఆదివారం మధ్యాహ్నం స్వైన్‌ఫ్లూ అని నిర్ధారించారని వారి కుటుంబసభ్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తీసుకువెళ్లారు.  బాధితుడు దరియాలతిప్పలో ప్రైవేట్‌ ఫ్యాక్టరీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.

అపరిశుభ్రత వల్లే : అంబేడ్కర్‌నగర్‌ గ్రామస్తులు
అంబేడ్కర్‌ నగర్‌ శివారు ప్రాంతాలు ముఖ్యంగా కోరంగినదీ కాలువ వెంబడి ఉన్న ఏటిగట్టుకు ఆనుకుని ఉన్న నివాసాల వద్ద పరిసరాలు అశుభ్రంగా ఉంటున్నాయని పందులు స్వైరవిహారం చేస్తున్నాయని, మున్సిపాలిటీవారు చెత్తను తీసుకువెళ్లడం లేదని గ్రామస్తులు ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు. పందులు గుంపులుగా వచ్చి అక్కడే తిష్టవేస్తున్నాయని వాటి గురించి ఎవరూ పట్టించు కోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ సిబ్బంది ఇక్కడి చెత్తను తొలగించడం లేదు సరికదా, ఎక్కడి నుంచో తెచ్చిన చెత్తను ఇక్కడే వేస్తున్నారని వారు తెలిపారు. ముఖ్యంగా పందులు స్వైరవిహారం చేయడం వల్లే స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకిందని తక్షణం అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. నివాసాల చెంతకు పందులు వస్తుండటంతో పలువురిపై దాడులు చేస్తున్నాయని ఈ సమస్యను పరిష్కరించాలని ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని వారు ముక్తంకంఠంతో కోరుతున్నారు.

మరిన్ని వార్తలు