ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి

7 Oct, 2019 17:21 IST|Sakshi

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం

సాక్షి, ఢిల్లీ: జాతి నిర్మాణంలో యువతకు భాగస్వామ్యం ఇచ్చినప్పుడే మెరుగైన సమాజం ఏర్పడుతుందని, ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అది సాకారం అవుతుందని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. ఇటీవల ఉగాండాలోని కంపాలలో జరిగిన 64వ కామన్వెల్త్‌ పార్లమెంటరీ సదస్సులో పాల్గొన్న అనంతరం ఢిల్లీ చేరుకున్న స్పీకర్‌ సోమవారం ఏపీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.

58 దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న అన్ని పరిణామాలపై సుదీర్ఘంగా చర్చ జరిగిందని వివరించారు. నిరుద్యోగ సమస్య, దాని ప్రభావాలు, వాతావరణ మార్పు, బ్రెగ్జిట్, లైంగిక వేధింపుల నివారణ, స్పీకర్ల వ్యవస్థలో ఉన్న సవాల్లు, పార్లమెంటరీ వ్యవస్థలో పారదర్శకత వంటి అనేక అంశాలపై చర్చ జరిగిందన్నారు. జాతి నిర్మాణంలో, దేశ విధానపరమైన నిర్ణయాల్లో యువతకు భాగస్వామ్యం కల్పించాలని, వారి ఆలోచనలకు చోటు కల్పించే అవకాశాలు ఇవ్వాలని, అప్పుడే నిరుద్యోగ సమస్యను పరిష్కరించగలమని సదస్సులో వెల్లడించినట్టు చెప్పారు.

గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి, అందులో యువతకు భాగస్వామ్యం కల్పించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలను ప్రవేశపెట్టారని, వీటి ద్వారా మూడు నెలల్లో 5 లక్షల మందికి ఉపాధి కల్పించిగలిగారని వివరించానన్నారు. దీనిపై సదస్సుకు హాజరైన ప్రతినిధులు హర్షధ్వానాలు వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఇక ఈ విదేశీ పర్యటనలో పలువురు పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సమర్థ నాయకత్వం, పారదర్శక పాలన, అపార అవకాశాలను వివరించి పెట్టుబడులు ఆహ్వానించామని తెలిపారు.

మరిన్ని వార్తలు