అపర భగీరథుడు ఆంధ్ర కేసరి

23 Aug, 2014 01:32 IST|Sakshi
అపర భగీరథుడు ఆంధ్ర కేసరి
  •     నేడు ‘టంగుటూరి’ జయంతి
  •     ఆంధ్రుల ఆవేశం, ఆత్మవిశ్వాసానికి ప్రతీక ప్రకాశం పంతులు
  •   నేడు రాష్ట్రవ్యాప్తంగా అధికారిక జయంతి కార్యక్రమాలు
  •   1953, ఫిబ్రవరి 13న ప్రకాశం బ్యారేజీకి శంకుస్థాపన
  •   బ్యారేజీ నిర్మాణంతో కృష్ణాడెల్టాకు తీరిన నీటి కరువు
  •   బతికుండగానే బెజవాడలో కాంస్య విగ్రహం
  • దివిలోని గంగమ్మను భగీరథుడు భువికి రప్పిస్తే.. అక్కరకు రాకుండాపోతున్న కృష్ణమ్మను ఆయకట్టుకు అనుకూలం చేసి అపర భగీరథుడయ్యూడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగువారిని వేరుచేసి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి ఆద్యుడయ్యూరు. అంతటి గొప్పవ్యక్తి జయంతి కార్యక్రమాలను రాష్ట్రమంతటా అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
     
    సాక్షి, విజయవాడ బ్యూరో : టంగుటూరి ప్రకాశం పంతులు పేరు వినగానే మొదట గుర్తొచ్చేవి రెండే రెండు. మొదటిది ప్రకాశం జిల్లా, రెండోది ప్రకాశం బ్యారేజీ. ఒంగోలుకు సమీపంలోని వినోదరాయునిపాలెంలో పుట్టిన టంగుటూరి బాల్యమంతా ఒంగోలు, అద్దంకి, నాయుడుపేట ప్రాంతాల్లోనే గడిచింది. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో పట్టభద్రుడయ్యాక ఆయన దృష్టి స్వాతంత్య్రోద్యమం వైపు మళ్లింది. 1928లో బొంబాయి చేరుకున్న సమైన్ కమిషన్‌పై ఉద్యమించి ‘ఆంధ్రకేసరి’గా గుర్తింపు పొందారు. ఉమ్మడి మద్రాసు నుంచి మన రాష్ట్రం విడిపోయాక కర్నూలు రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది. దీనికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టంగుటూరి బెజవాడ కేంద్రంగా కీలక రాజకీయాన్ని నెరిపి ఇక్కడి నుంచే పాలన కొనసాగించారు.
     
    కృష్ణాడెల్టా వరప్రదాయిని ప్రకాశం బ్యారేజీ
     
    అప్పట్లో కోల్‌కతా, బొబ్బిలి, విజయనగరం, వాల్తేరు, రాజమండ్రి ప్రాంతాల నుంచి మద్రాసు, తిరుపతి, కంచి వంటి ప్రధాన నగరాలకు వెళ్లాల్సిన వారు బెజవాడ చేరుకోగానే కృష్ణానది దాటేందుకు నానా అవస్థలు పడేవారు. ఒక్కోసారి పడవ ప్రమాదాలు జరిగి నిండు ప్రాణాలు పోతుండేవి. 1952లో కృష్ణానదికి భారీ వరదలు వచ్చాయి. నదీ ప్రవాహ వేగానికి బెజవాడ వద్ద నదికి అడ్డంగా కాటన్ నిర్మించిన కొండరాళ్ల ఆనకట్ట కొంతమేర కొట్టుకుపోయింది.

    అప్పట్లో ఇంజినీరుగా గుర్తింపు పొందిన వేపా కృష్ణమూర్తి పంటు మీద నదీ ప్రవాహంలోకి ప్రవేశించి గండిని పూడ్చే ప్రయత్నంలో నదిలో పడి కొట్టుకుపోయారు. ఈ సంఘటన ప్రకాశం పంతులును కదిలించింది. వెంటనే బ్యారేజీ కట్టాల్సిందేనని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ నిధులకు తోడు రైతాంగం నీటి తీరువా కింద చెల్లించిన వేల రూపాయలను జోడించి బ్యారేజీ నిర్మాణానికి పూనుకున్నారు.  సీఎం హోదాలో 1954 ఫిబ్రవరి 13న (భీష్మేకాదశి) బ్యారేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

    ఆ తరువాత సీఎంగా పదవిలోకి వచ్చిన నీలం సంజీవరెడ్డి 1957 డిసెంబరు 24న బ్యారేజీని కృష్ణాడెల్టా ప్రజలకు అంకితమిచ్చారు. దీనివల్ల ఉత్తరాంధ్ర, కోస్తా, సర్కారు జిల్లాల మధ్య రాకపోకలు పెరిగాయి. ప్రకాశం బ్యారేజీ నిర్మాణం వల్ల ఏలూరు, కొమ్మమూరు, బకింగ్‌హాం కాల్వలు అభివృద్ధి చెంది కాకినాడ- మద్రాసు నగరాల మధ్య జలరవాణా మార్గం సులభతరమైంది. అంతేకాకుండా కృష్ణాడెల్టాలోని నాలుగు జిల్లాల రైతులు 13 లక్షల ఎకరాల్లో ఏటా మాగాణి సాగు చేసుకునేందుకు ప్రకాశం బ్యారేజీ వరదాయినిగా మారింది.
     
    ‘టంగుటూరి’ జీవితంలో ప్రధాన ఘట్టాలు

    న్యాయవాద వృత్తిలో స్థిరపడాలని కలలుగన్న ప్రకాశం పంతులుకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు డబ్బులు లేక రాత్రికి రాత్రి 50 కిలోమీటర్ల నడిచి మేనమామ దగ్గరికి వెళ్లినా ఫీజుకు అవసరమైన రూ.3 లభించలేదు. ఈ విషయం తెలుసుకున్న ఆయన తల్లి తన పట్టువస్త్రాన్ని తాకట్టు పెట్టి ఫీజు చెల్లించింది. ఈ ఘటన ఆంధ్రకేసరి మనసులో చిరస్థాయిగా మిగిలిపోయింది. తాను సీఎంగా పనిచేసిన రోజుల్లో పేద విద్యార్థుల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశారు.
     
    తన గురువు హనుమంతరావును చూసేందుకు ఒంగోలు నుంచి రాజమండ్రి వెళ్లిన ప్రకాశం తిరుగు ప్రయాణంలో కృష్ణానదిని దాటలేక వెనక్కి వెళ్లారు. ప్రియ శిష్యుడు వెళ్లిపోవడంతో బాధపడుతూ కూర్చున్న గురువు హనుమంతరావు తిరిగొచ్చిన ప్రకాశాన్ని చూసి పులికించిపోయి రాజమండ్రిలోనే ఉంచుకుని చదివించారు.
     
    1949లో కారులో కృష్ణానది వరకు చేరుకున్న ప్రకాశం పంతులు నాలుగు అడుగుల ఎత్తులో ప్రవహిస్తున్న నదిని దాటి మద్రాసు వెళ్లాల్సి ఉంది. కారు డ్రైవర్ ముందుకు పోనిచ్చేందుకు భయపడుతుంటే ఆయనకు ధైర్యం చెప్పి కారును నీళ్లలోనే పోనిచ్చి ఆవలి ఒడ్డుకు చేరుకున్న ప్రకాశం ధైర్యాన్ని అప్పట్లోనే జనం అభినందించారు.
     
    1951 జులై 23న బెజవాడలో ప్రకాశం పంతులు అభిమానులు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి విమానంలో బయల్దేరిన ప్రముఖులందరూ వర్షం వల్ల నాగపూర్‌లోనే ఆగిపోయారు. మరుసటి రోజు బెజవాడ చేరుకున్న వీరంతా విగ్రహాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఆ రోజు ప్రకాశం పంతులు బెజవాడలోనే ఉండి విగ్రహం నెలకొల్పిన చోటకు వెళ్లలేదు.
     

మరిన్ని వార్తలు