టాస్క్‌ఫోర్స్‌కు 'తంబీల' టెన్షన్‌

27 May, 2020 07:56 IST|Sakshi
తిరుపతి టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయ ఆవరణలోకి దుంగలను తరలిస్తున్న వాహనం (ఫైల్‌)

జూన్‌లో తమిళనాడు నుంచి వచ్చే అవకాశం

తమిళ స్మగ్లర్ల కదలికలపై పోలీసుల నిఘా   

ఈసారి పీడీ యాక్టులు తప్పవంటున్న అధికారులు

తిరుపతి అర్బన్‌: తమిళనాడు ప్రభుత్వం ట్రాన్స్‌పోర్ట్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే తమిళనాడు నుంచి ఎర్ర స్మగ్లర్లు శేషాచలంలోకి చొరబడతారన్న టెన్షన్‌  టాస్క్‌ఫోర్స్‌ అధికారుల్లో మొదలైంది. వివరాల్లోకి వెళితే, లాక్‌డౌన్‌ నేపథ్యంలో రెండు నెలలుగా శేషాచలంలో ఎర్ర చందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడింది. మే 31కి లాక్‌డౌన్‌ ముగుస్తున్న నేపథ్యంలో తమిళనాడులో  రవాణా మొదలవనుంది.  ఈ నేపథ్యంలో తిరుఅన్నామలై ప్రాంతానికి చెందిన ఎర్రస్మగ్లర్లు జూన్‌లో జిల్లాలోని ఎర్ర అడవుల్లోకి చొరబడే ప్రమాదం ఉంది. దాంతో ముందస్తుగానే ఎర్రస్మగ్లర్లను జిల్లాలోకి అడుగుపెట్టనీయకుండా టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీ రవిశంకర్‌ నేతృత్వంలో పలు బృందాలు సిద్ధం అవుతున్నాయి. అయితే తమిళనాడుకు చెందిన ఎర్రస్మగ్లర్లు పెద్ద ఎత్తున జిల్లాలోని శేషాచలం అడవుల్లోనూ, వైఎస్సార్‌ కడప జిల్లాలోని పాలకొండల్లో ఎర్రదుంగలను రవాణా కోసం లాక్‌డౌన్‌కు ముందే డంపింగ్‌ చేసినట్లు తెలుస్తోంది. దాంతో టాస్క్‌ఫోర్స్‌ గాలింపు చర్యలు చేపట్టింది. ఇదే తరుణంలో పైలట్లుగా (పోలీసుల సమాచారం స్మగ్లర్లకు అందించేవారు) వ్యవహరిస్తున్న పాతస్మగ్లర్ల జాడ కోసం టాస్క్‌ఫోర్స్‌ విచారణ చేపడుతోంది. డంపింగ్‌ల వివరాలు పైలెట్లుగా పనిచేస్తున్న వారి వద్ద ఉన్నాయనే సమాచారంతో పోలీసులు అడుగులు వేస్తున్నారు. ఈ సారి ఎర్రచందనం జోలికివస్తే పీడీ యాక్టులతోపాటు కఠిన మైన కేసులు తప్పవనే సంకేతాలు ఇస్తున్నారు.

నెల్లూరులోనూ తాకిడి
చిత్తూరు, వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలతోపాటు నెల్లూరు జిల్లాలో కొంతభాగంలో ఎర్రచందనం ఉండడంతో ఎర్రస్మగ్లర్ల తాకిడి ఈ ప్రాంతంలో ఎక్కువగా చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కోట్ల విలువైన ఎర్రచందనాన్ని అక్రమ రవాణాకు చెక్‌ పెట్టడం కోసం టాస్క్‌ఫోర్స్‌ను వెలుగులోకి తెచ్చారు. ఆ మేరకు అటవీశాఖకు అండగా ఉంటుందనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ఏకైక టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయాన్ని ప్రభుత్వం 2016లో తిరుపతిలో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఐదేళ్లలో చూస్తే 580 కేసులను నమోదు చేశారు. 330 మెట్రిక్‌ టన్నులు (12122 ఎర్రదుంగలు)ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నా రు. 1891 మందిని అదుపులోకి తీసుకున్నారు. 297 వాహనాలను సీజ్‌ చేశారు. అయినా ఎర్రచందనం అక్రమాలకు అడ్డకట్టపడ్డలేదు. అయి తే కోవిడ్‌–19తో వారి ఊసేలేకుండా పోయింది. మళ్లీ పూర్వ పరిస్థితులు రాకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నంలో టాస్క్‌ ఫోర్స్‌ తలమునకలై పనిచేస్తోంది.

స్మగ్లర్లపై కఠినంగా వ్యవహరిస్తాం
తమిళనాడు ప్రభుత్వం వాహనాల రవాణాకు అనుమతి ఇస్తే స్మగ్లర్ల తాకిడి తప్పేలా లేదు. దాంతో బుధవారం నుంచి పలు బృందాలను ఏర్పాటు చేసి.. వారిపై నిఘా పెట్టనున్నాం. లాక్‌డౌన్‌కు ముందుగా పలుచోట్ల ఎర్రస్మగ్లర్లు ఎర్రచందనంను డంపింగ్‌ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు పాత స్మగ్లర్లు పైలెట్లుగా వ్యవహరిస్తున్నారు. వారి కోసం విచారణ చేస్తున్నాం. వారి వద్ద అదనపు సమాచారం ఉందని భావిస్తున్నాం. పాతస్మగ్లర్లు తమిళనాడు స్మగ్లర్లను ఆహ్వానిస్తున్నారు. అయితే ఈ సారి చర్యలు తీవ్రంగా ఉంటాయి.  ఎర్రస్మగ్లర్లపై కేసులు కఠినంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం.– రవిశంకర్, టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీ, తిరుపతి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు