మహిళా వలంటీర్‌పై టీడీపీ కార్యకర్తల దాడి 

9 Feb, 2020 04:46 IST|Sakshi
తోటి వలంటీర్లతో కలిసి మీడియాతో మాట్లాడుతున్న సరస్వతి

మంచినీటి పథకం తాళాలు అడగడంతో దౌర్జన్యం  

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలో ఘటన 

వజ్రపుకొత్తూరు (శ్రీకాకుళం): ఐదు నెలలుగా తాగు నీటి పథకానికి తాళాలు వేశారు.. తాళాలైనా ఇవ్వండి.. లేదా తాగునీరు సరఫరా చేయండి.. అంటూ గ్రామ వలంటీర్‌ అడగడమే పాపమైంది. ఒక్కసారిగా రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు శుక్రవారం సాయంత్రం వలంటీర్‌పై దాడికి తెగబడ్డారు. వలంటీర్‌ కిక్కిరి సరస్వతి జుత్తు పట్టుకుని కొట్టి దుర్భాషలాడుతూ దిక్కున్న చోట చెప్పుకోమంటూ హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పూండి–గోవిందపురం యాదవ వీధిలో జరిగిన ఘటనకు సంబంధించి బాధితురాలి కథనం.. గోవిందపురం యాదవ వీధిలో టీడీపీ హయాంలో పవర్‌ బోర్‌ నిర్మించారు.

ప్రభుత్వం మారిన అనంతరం ఐదు నెలలుగా దానికి తాళాలు వేశారు. స్థానికుల తాగునీటి అవస్థలు చూసి పంచాయతీ కార్యదర్శి రవివర్మ, మరో వలంటీర్‌ శిరీషతో కలిసి సరస్వతి టీడీపీ నాయకుడు పుచ్చ ఈశ్వరరావు ఇంటికెళ్లి తాళం అడిగారు. దీంతో ఈశ్వరరావు కుటుంబ సభ్యులు పుచ్చ సంధ్య, కర్ని సందీప్, చింత కేశవమ్మ, కర్ని వరలక్ష్మితో పాటు డొక్కరి రాజు తదితరులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తన మెడలోని రెండు తులాల బంగారు గొలుసు సైతం పోయిందని వలంటీర్‌ కన్నీటిపర్యంతమయ్యారు. శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, రాజీపడాలంటూ వజ్రపుకొత్తూరు ఎస్‌ఐ గోవింద ఒత్తిడి చేశారని ఆమె వాపోయారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మరో 15 మంది వలంటీర్లు, స్థానిక మహిళలతో కలిసి ఆమె డిమాండ్‌ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ చెప్పారు.   

మరిన్ని వార్తలు