బుచ్చయ్యపై తమ్ముళ్ల గుస్సా

30 Sep, 2018 07:41 IST|Sakshi

డబ్బులు ఇవ్వకండంటూ ఫ్లాట్ల లబ్ధిదారులకు ఎమ్మెల్యే గోరంట్ల సూచన

ఎవరైనా అడిగితే 1100కి ఫిర్యాదు చేయండని సలహా

కార్పొరేటర్ల ముందు లబ్ధిదారుల సమావేశంలో వ్యాఖ్యలు

తమను అవినీతిపరులుగా చిత్రీకరిస్తున్నారంటూ పలువురు మండిపాటు

 ఎమ్మెల్యే అనుచర ప్రజా ప్రతినిధులు చేస్తున్న దందాపై అంతర్గత చర్చలు

సాక్షి, రాజమహేంద్రవరం: ‘‘ఇళ్ల లబ్ధిదారులు ఎంపిక, ఫ్లాట్ల కేటాయింపు పారదర్శకంగా చేశాం. ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదు. ఎవరైనా లంచాలు అడిగితే 1100కి ఫిర్యాదు చేయండి’’ అంటూ ఈ నెల 26వ తేదీన ఫ్లాట్ల కేటాయింపు పత్రాల పంపిణీ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు పలువురు కార్పొరేటర్లలో ఆగ్రహావేశాలకు కారణమయ్యాయి. అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, లబ్ధిదారుల వాటా, బ్యాంకు రుణం సహాయంతో జీ ప్లస్‌ 3 అపార్ట్‌మెంట్లు నిర్మించి ఇచ్చేందుకు పథకం రూపాందిం చారు.

జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవ రం నగరపాలక సంస్థలు, పిఠాపురం, అమలాపురం, పెద్దాపురం, తుని, రామచంద్రపు రం, మండపేట, సామర్లకోట మున్సిపాలిటీల్లో 2015లో దాదాపు 21 వేల ఇళ్లను మంజూరు చేశారు. ఇందులో రాజమహేం ద్రవరం నగరపాలక సంస్థ వాటాగా 4,200 ఇళ్లు వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణ అనంతరం 2016 మే నెలలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఒక్కొక్కచోట ఒక్కోలా ఎంపిక ప్రక్రియ నిర్వహించారు.

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో సుమారు 16 వేల మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. నగరంలో ప్రభుత్వ భూమి లేకపోవడంతో రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గం పరిధిలోని బొమ్మూరు, తొర్రేడు, శాటిలైట్‌సిటీ ప్రాంతాల్లో 4,200 ఇళ్లను నిర్మిస్తున్నారు. ఫలితంగా స్థలం మా పరిధిలోనిదంటూ రూరల్‌ ఎమ్మెల్యే ఇళ్లలో వాటా తీసుకున్నారు. 2,400 ఇళ్లు నగరపాలక సంస్థలోని డివిజన్లకు, మిగతా 1,800 రూరల్‌ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు ఇచ్చేలా నిర్ణయించారు. ఆ మేరకు 50 డివిజన్లలో డివిజన్‌కు 35 మంది చొప్పున లబ్ధిదారులను లాటరీ విధానంలో ఎంపిక చేశారు. 

ప్రజా ప్రతినిధులకు వాటాలు.. 
డివిజన్‌కు 35 ఇళ్ల చొప్పున 1,750 ఇళ్లకు లాటరీ తీయగా, రాజమహేంద్రవరం రూరల్‌లో ఏ విధంగా లబ్ధిదారులు ఎంపిక జరిగిందీ ఎవరికీ తెలియదు. లాటరీ అనంతరం అప్పటి కమిషనర్, ప్రజా ప్రతినిధులు ప్రతి కార్పొరేటర్‌కు తలా రెండు ఇళ్ల చొప్పున ఇచ్చారు. ఇవిగాక అధికార టీడీపీ కార్పొరేటర్లలో కొంతమందికి ఎంపీ మాగంటి మురళీమోహన్, ఎమ్మెల్యే గోరంట్ల, నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఐదు ఇళ్లు చొప్పున ఇచ్చారు. వాటి లబ్ధిదారులను ఆయా కార్పొరేటర్లు ఎంపిక చేశారు.

 ఈ ఇళ్లను పలువురు రూ.50 వేల చొప్పున తీసుకుని ఇవ్వగా, మరికొందరు ఏమీ ఆశించకుండానే అర్హులైన వారిని సిఫార్సు చేశారు. నగదు వసూలు చేసే విషయమై పలుమార్లు గోరంట్ల బుచ్చయ్యచౌదరి అంతర్గత సమావేశాల్లో ప్రస్తావించారని సమాచారం. అయినా పట్టించుకోని పలువురు యథావిధిగా తమపని తాము చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రెండేళ్ల తర్వాత ఫ్లాట్ల కేటాయింపు పత్రాల పంపిణీ చేసే సమయంలో లబ్ధిదారులు ముందు ఎమ్మెల్యే గోరంట్ల లంచాలు ఇవ్వొద్దంటూ బహిరంగ ప్రకటన చేయడంతో పలువురు కార్పొరేటర్లు గరంగరంగా ఉన్నారు.

ఆ వ్యవహారాల సంగతేంటీ..?
ఎమ్మెల్యే గోరంట్ల తమను ఉద్దేశించి తమ డివిజన్‌ ప్రజల ముందు మాట్లాడడంతో కార్పొరేటర్లు తీవ్ర అవమానంగా భావిస్తున్నారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టవద్దని కూడా చెప్పవచ్చుగా అంటూ సమావేశంలోనే పలువురు పక్కవారి వద్ద వ్యాఖ్యానించారు. అక్కడ ఖర్చు పెట్టిన డబ్బు ఎలా తిరిగి రాబట్టాలో సెలవిస్తే వింటామని సమావేశంలో కూర్చున్న పలువురు కార్పొరేటర్ల భర్తలు వ్యాఖ్యానించారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు హయాంలో ఆవరోడ్డులో కట్టిన ఇళ్లను గత ఏడాది పంపిణీ చేశారు. అక్కడ అనర్హులంటూ దాదాపు 600 మందికి మొండిచేయి చూపారు. 

ఆయా ఫ్లాట్లను గోరంట్ల బుచ్చయ్యచౌదరి అనుంగు అనుచరులు, కార్పొరేషన్‌లో పదవులు ఉన్నవారు గ్రౌండ్‌ ఫ్లోర్‌ రూ.6 లక్షలు, మొదటి అంతస్తు రూ.4 లక్షలు, రెండో అంతస్తు రూ.2.75 లక్షల చొప్పున విక్రయించుకున్నారని, మరి వాటి సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. పోలీసు స్టేషన్లలో ఇన్‌స్పెక్టర్ల నియామకాలకు డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తున్నారు. ఇసుక ర్యాంపులు గుప్పెట్లో పెట్టుకుని రోజూ రూ.లక్షలు దండుకుంటున్న వైనంపై కూడా మాట్లాడాలని అధికార పార్టీ కార్పొరేటర్లు డిమాండ్‌ చేస్తున్నారు. తాము చేస్తే ఒప్పు.. ఇతరులు చేస్తే తప్పు అన్న చందంగా కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడడంపై ప్రస్తుతం టీడీపీ కార్పొరేటర్లలో చర్చ జరుగుతోంది. ఇది ఎటు దారితీస్తుందో వేచి చూడాలి. మరో వైపు గోరంట్ల వ్యాఖ్యలు విన్న ఇతరులు.. ‘ఆవు చేలో మేస్తుంటే.. దూడ గట్టున మేస్తుందా?’ అంటూ చమత్కరించడం కొసమెరుపు.

మరిన్ని వార్తలు