ప్యాకేజీ స్టార్‌తో పొత్తు.. నన్ను పక్కన పెడతారా? | Sakshi
Sakshi News home page

ప్యాకేజీ స్టార్‌తో పొత్తు.. నన్ను పక్కన పెడతారా?

Published Thu, Oct 26 2023 7:30 AM

- - Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం: టీడీపీ, జనసేన సమన్వయ భేటీలో తెలుగుదేశం సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరికి అవమానం జరిగిందా..? కీలక సమావేశంలో స్థానం కల్పించకపోవడం వెనుక వేరే మతలబు ఉందా? పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నా జూనియర్లను అందలం ఎక్కించి ఆయన గుర్తింపును హరిస్తున్నారా? రాజమహేంద్రవరం రూరల్‌ అసెంబ్లీ నియోజకవర్గం జనసేనకు కేటాయించేందుకే ఇలా వ్యవహరిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి.

ఇదీ సంగతి..
స్కిల్‌ కుంభకోణంలో అరెస్టయి రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రిమాండ్‌ అనుభవిస్తున్న నేపథ్యంలో ఇటీవల టీడీపీ, జనసేన నేతల ఉమ్మడి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇరు పార్టీల నుంచి 14 మంది సభ్యులతో కూడిన కమిటీ సుమారు 3 గంటల పాటు భేటీ అయింది. కమిటీలో పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కంటే సీనియర్‌ అయిన రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి చోటు లభించలేదు.

ఒక్కమాటలో చెప్పాలంటే చేదు అనుభవమే ఎదురైంది. తన కంటే పార్టీలో జూనియర్లు నిమ్మల రామానాయుడు, తంగిరాల సౌమ్య, చివరకు కాంగ్రెస్‌ నుంచి టీడీపీలోకి వచ్చిన వలస నేత పితాని సత్యనారాయణకు కూడా కమిటీలో స్థానం కల్పించడంతో బుచ్చయ్య అభిమానులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నట్లు సమాచారం. సీనియర్‌ నేతకు తగిన గౌరవం, గుర్తింపు దక్కకపోవడంతో టీడీపీపై వీరి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు తెలిసింది. 25 ఏళ్లకు పైగా ఎమ్మెల్యేగా వ్యవహరించిన వ్యక్తి పార్టీ బలోపేతం, ఉమ్మడి వ్యూహాలపై సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కూడా పనికిరారా? అని ప్రశ్నిస్తున్నారు.

పొత్తు సెగ తగిలిందా?
టీడీపీ, జనసేన పొత్తు సెగ మొట్టమొదటిగా రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్లకు తగిలిందన్న భావన టీడీపీ శ్రేణుల్లో నెలకొంది. పొత్తు కుదిరితే రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే అభ్యర్థి స్థానం జనసేనకు కేటాయిస్తారన్న ప్రచారం ఆది నుంచీ సాగుతోంది. జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్‌ రూరల్‌ స్థానం నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. అధినేత పవన్‌ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని, ఆరు నూరైనా రూరల్‌ స్థానం తనకే దక్కుతుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ ఉన్న పరిస్థితుల్లో జనసేన అభ్యర్థనకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వక తప్పని పరిస్థితి. సీనియర్‌ నేత బుచ్చయ్యకు పార్టీలో సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఈ ప్రచారానికి ఇది మరింత బలం చేకూరుస్తోంది. ఇదే జరిగితే బుచ్చయ్యకు భంగపాటు తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ములాఖత్‌లోనూ శృంగభంగమే
సెంట్రల్‌ జైల్లో ఉన్న బాబుతో ములాఖత్‌లోనూ బుచ్చయ్యకు అవమానమే ఎదురైంది. పార్టీ అధినేతను జైలులో కలిసే అవకాశం ఒక్కసారి కూడా దక్కలేదు. తెలంగాణ, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందిన నేతలు బాబు కుటుంబ సభ్యులతో పాటు వెళ్లి ములాఖత్‌ అవుతున్నారు. స్థానికంగా ఉన్న, సీనియర్‌ నేతను ఒక్కసారి కూడా పిలవకపోవడంతో పార్టీ బుచ్చయ్యకు ఎంత ప్రాధాన్యంఇస్తోందో తేటతెల్లమవుతోందని ఆయన వర్గీయులు లోలోన మదనపడుతున్నారు.

ఆది నుంచీ ఆధిపత్య పోరే..
బుచ్చయ్య, ఆదిరెడ్డి అప్పారావు వర్గాల మధ్య ఆది నుంచీ ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. రూరల్‌ ఎమ్మెల్యే అయినా ఆయన దృష్టంతా సిటీపైనే ఉండేది. పార్టీలో సీనియరైనా తనను కాదని ఇతరులను ప్రోత్సహిస్తున్నారని ఆవేదన చెందేవారు. ఈ విషయాన్ని ఆయన అనేక సందర్భాలలో వెళ్లగక్కిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఆదిరెడ్డి వర్గం సైతం ఆయనకు దీటుగా జవాబు ఇస్తూనే సిటీలో బలపడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

నియోజకవర్గానికే పరిమితం
చంద్రబాబు అరెస్టయి సెంట్రల్‌ జైలుకు వచ్చిన నాటి నుంచీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కుటుంబానికి టీడీపీలో కొంత ప్రాధాన్యత పెరిగినట్లు ఆపార్టీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు జైలు జీవితం నేపథ్యంలో బాబు కుటుంబం రాజమహేంద్రవరంలోనే బస చేస్తోంది. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆయన సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిలు ఇక్కడి నుంచే ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. వీటన్నింటీకీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి వాసు సారథ్యం వహిస్తున్నారు. లోకేష్‌ క్యాంప్‌ కార్యాలయం వద్ద కూడా ఈయన తన ముద్ర చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ పరిణామం బుచ్చయ్యకు మరింత భంగపాటుకు గురయ్యేలా చేస్తోంది. రూరల్‌ అసెంబ్లీ స్థానం లేకపోతే సిటీ టికెట్‌ ఆశిద్దామంటే అప్పారావు కుటుంబం ఏకు మేకు అయిందన్న చందంగా మారింది పరిస్థితి. చేసేది లేక బుచ్చయ్య చౌదరి చంద్రబాబు అరెస్టుకు నిరసనగా చేపట్టే కార్యక్రమాల్లో సింహభాగం తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement