దళితుల వల్లే ఈ దరిద్రం.. డీసీపీ యూజ్‌లెస్‌ ఫెలో

12 Sep, 2019 02:38 IST|Sakshi
డీసీపీని దూషిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు

చలో ఆత్మకూరు సాక్షిగా ఏపీ పోలీస్‌ అధికారులపై టీడీపీ నేతల వీరంగం

ఐపీఎస్‌ అధికారి విక్రాంత్‌ పాటిల్‌పై రెచ్చిపోయిన అచ్చెన్నాయుడు 

దళిత మహిళా ఎస్‌ఐని దూషించిన మహిళా కమిషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ నన్నపనేని 

ఇంటి నుంచి చంద్రబాబు డైరెక్షన్‌.. బయట నేతల ఓవరాక్షన్‌ 

నాకు రూల్స్‌ చెప్పొద్దు.. ఎక్స్‌ట్రాలు చేయొద్దు.. యూజ్‌లెస్‌ ఫెలో.. నన్ను ఆపడానికి నీకు ఎవడిచ్చాడు అధికారం.
– డీసీపీ విక్రాంత్‌ పాటిల్‌ను ఉద్దేశించి టీడీపీ నేత అచ్చెన్నాయుడు

ఈ దళితుల వల్లే మాకీ దరిద్రం.
    – దళిత మహిళా ఎస్సైని ఉద్దేశించి నన్నపనేని రాజకుమారి, టీడీపీ మహిళా నేతలు

సాక్షి, అమరావతి/విజయవాడ: ‘చలో ఆత్మకూరు’ పేరుతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడికక్కడ రెచ్చిపోయారు. వీధి రౌడీల్లా మారి పోలీస్‌ అధికారులపై దౌర్జన్యాలకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా అలజడులు సృష్టించేందుకు యత్నించారు. 144 సెక్షన్‌ అమల్లో ఉందని, చలో ఆత్మకూరుకు అనుమతి లేదని నచ్చజెప్పబోయిన పోలీసులపై వీరంగమాడారు. ఎక్కడికక్కడ ఆందోళనలు చేయాలని, పోలీసులపై తిరగబడాలని టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా చంద్రబాబు టీడీపీ నేతలను రెచ్చగొట్టి ఘర్షణలకు పురిగొల్పారు. బుధవారం చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపునిచ్చిన చంద్రబాబు అలజడులు సృష్టించాలని నూరిపోయడంతో ఉండవల్లి కరకట్టపై ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు రెచ్చిపోయారు. అక్కడ విధుల్లో ఉన్న ఐపీఎస్‌ అధికారి, విశాఖ డీసీపీ విక్రాంత్‌ పాటిల్‌ను ‘యూజ్‌లెస్‌ ఫెలో’ అంటూ తిట్టారు. మరోవైపు టీడీపీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి మంగళగిరిలో దళిత మహిళా ఎస్‌ఐ అనూరాధను కులం పేరుతో తిడుతూ ‘దళితుల వల్లే ఈ దరిద్రం’ అనడంతో ఎస్‌ఐ తీవ్ర మనస్తాపం చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిచోట టీడీపీ నాయకులు పోలీసులతో గొడవకు దిగి రభస సృష్టించేందుకు ప్రయత్నించారు.

బాబు డైరెక్షన్‌లో ఉండవల్లిలో హైడ్రామా
టీడీపీ నాయకులు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద బుధవారం హైడ్రామా నడిపాయి. శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవుతుందనే కారణంతో అక్కడికి చేరుకున్న పోలీసులు చలో ఆత్మకూరుకు అనుమతి లేదని తెలిపారు. దీంతో లోనికి వెళ్లిపోయిన చంద్రబాబు పార్టీ నాయకులతో ఎప్పటికప్పుడు టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఆందోళనలు ఎలా చేయాలి, ఏ విధంగా ఘర్షణలు సృష్టించాలనే దానిపై సూచనలు ఇచ్చారు. మరోవైపు పోలీసుల తీరును నిరసిస్తూ 12 గంటల నిరాహార దీక్ష చేస్తున్నట్లు మీడియాకు లీకులిచ్చారు. రాష్ట్ర మంతటా దీక్షలు చేయాలని పిలుపునిచ్చారు. మధ్యాహ్నం 12 గంటల సమమయంలో మళ్లీ బయటకు వచ్చిన చంద్రబాబు ఆత్మకూరు వెళతానంటూ కారు ఎక్కి కూర్చున్నారు. పోలీసులు అప్పటికే ఆయన ఇంటి ప్రధాన గేటు వద్ద మోహరించి బయటకు వెళ్లడానికి అనుమతి లేదని తేల్చిచెప్పారు. అప్పటికే చంద్రబాబు ఇంటి లోపలికి వెళ్లిన పలువురు టీడీపీ నాయకులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. కొద్దిసేపటి తర్వాత చంద్రబాబు లోనికి వెళ్లిపోయి అక్కడున్న నాయకులతో మంతనాలు జరిపారు. అంతకుముందు ఆయన కుమారుడు లోకేష్‌ను కూడా పోలీసులు బయటకు వెళ్లకుండా అడ్డుకోగా.. ఆయన కూడా వాదులాటకు దిగారు. 

రెచ్చిపోయిన అచ్చెన్న
చంద్రబాబు నివాసం బయట కరకట్ట రోడ్డుపై మాజీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పోలీస్‌ అధికారులతో వాగ్వివాదానికి దిగి రభస చేశారు. మోటార్‌ సైకిల్‌పై చంద్రబాబు నివాసానికి వచ్చిన ఆయన్ను పోలీసులు ఆపి 144వ సెక్షన్‌ అమల్లో ఉన్నందున లోనికి వెళ్లకూడదని చెప్పారు. దీంతో రెచ్చిపోయిన అచ్చెన్న బిగ్గరగా అరుస్తూ తనకు రూల్స్‌ చెప్పొద్దంటూ పోలీసులను నెట్టుకుంటూ చంద్రబాబు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. బందోబస్తు విధుల్లో ఉన్న విశాఖ డీసీపీ విక్రాంత్‌ పాటిల్‌ ఆయన్ను నిలుపుదల చేశారు. ఆ దశలో అచ్చెన ‘ఎక్స్‌ట్రాలు’ చేయొద్దని వేలు చూపిస్తూ బెదిరించారు. వెనక్కి వెళ్లిపోవాలని పోలీసులు సర్దిచెబుతున్నా వినకుండా రెచ్చిపోయి విక్రాంత్‌ పాటిల్‌ను ‘యూజ్‌లెస్‌ ఫెలో. నన్ను ఆపడానికి నీకెవడిచ్చాడు అధికారం’ అని దుర్భాషలాడుతూ తోపులాటకు దిగారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేసి వ్యానులో ఎక్కించి వేరే ప్రాంతానికి తీసుకెళ్లారు. 

దళిత ఎస్‌ఐని దూషించిన నన్నపనేని
టీడీపీ మహిళా నాయకులు మహిళా ఎస్‌ఐని కులం పేరుతో దూషించి దళితులపై ఉన్న వివక్షను మారోసారి చాటుకున్నారు. మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, జవహర్, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత, మహిళా కమిషన్‌ మాజీ చైర్మన్‌ నన్నపనేని రాజకుమారి, మరికొందరు నాయకులను అరెస్ట్‌ చేసిన పోలీసులు మంగళగిరి స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి మరో స్టేషన్‌కు తరలించేందుకు రెండు వాహనాలను ఏర్పాటు చేయగా.. అందులో ఒకటి పెదకాకాని మహిళా ఎస్‌ఐ అనురాధ వాహనం. నన్నపనేని రాజకుమారి, వంగలపూడి అనిత, మరో ముగ్గురు మహిళలను ఆ జీప్‌లో ఎక్కిస్తుండగా.. ‘ఈ దళితుల వల్లే మాకీ దరిద్రం’ అంటూ దూషణకు దిగారు. దీంతో దళిత ఎస్‌ఐ అనురాధ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ‘దరిద్రులంటూ హేళన చేస్తారా. నేను కష్టపడి ఉద్వోగం సంపాదించుకున్నా’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని ఎస్‌ఐ అనురాధ చెప్పగా.. సీఐ నరేష్‌కుమార్‌ సముదాయించారు. తాను ఈ అవమానాన్ని తట్టుకుని విధులు నిర్వర్తించలేనని, వాహనం నుంచి నాయకులను దించేస్తే వెళ్లిపోతానని చెప్పడంతో సీఐ నరేష్‌కుమార్‌ తప్పని పరిస్థితులలో మాజీ మంత్రులను నాయకులను వేరే వాహనంలోకి మార్చారు. ఇంత జరుగుతున్నా టీడీపీ నాయకులు కనీసం తాము అలా అనలేదని కాని, అలా అనడం తప్పు అని కాని చెప్పకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. 

ఇతర నేతలదీ అదే దారి
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరుతుండగా.. ఆమెను బయటకు రావొద్దని పోలీసులు చెప్పారు. పోలీసులను తోసుకుంటూ ఆమె హంగామా సృష్టించారు. ఎంపీ కేశినేని నాని ర్యాలీగా ప్రకాశం బ్యారేజీ వద్దకు రాగా.. ‘కైండ్లీ ర్వికెస్ట్‌ సార్‌.. ముందుకు వెళ్లొద్దు’ అంటూ సీఐ కాశీ విశ్వనాథ్‌ విజ్ఞప్తి చేశారు. ప్రకాశం బ్యారేజీపై తన అనుచరులతో కలిసి బైఠాయించటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో కేశినేనిని ప్రివెంటివ్‌ అరెస్ట్‌ చేశారు. అనంతరం ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకున్న మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్సీ దినేష్‌రెడ్డి, మాజీ మంత్రులు గొల్లపల్లి సూర్యారావు, కేఈ ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్సీలు వైవీబీ రాజేంద్రప్రసాద్, బుద్దా వెంకన్న, అశోక్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, నల్లగట్ల స్వామిదాస్‌ ఆత్మకూరు వెళ్లేందుకు ప్రయత్నించగా.. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు వారిని ఇళ్లనుంచి బయటకు రానివ్వలేదు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్యను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ప్రతిచోట టీడీపీ నాయకులు పోలీసులపై విరుచుకుపడ్డారు. అలజడులు సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించారు. 

ఎంత రెచ్చగొట్టినా లాఠీ ఎత్తని పోలీసులు
టీడీపీ నేతలు ‘చలో ఆత్మకూరు’ పేరిట పోలీసులను ఎంత రెచ్చగొట్టినా కనీసం లాఠీ కూడా ఎత్తకుండా సంయమనం పాటించారు. పల్నాడు ప్రాంతంలో సున్నిత పరిస్థితులు ఉన్నందున పోలీసులు అక్కడ 144 సెక్షన్‌ విధించారు. ఆత్మకూరు బయలుదేరిన టీడీపీ నాయకులను అక్కడకు వెళ్లకుండా నిలువరించబోతుండగా.. రెచ్చిపోయిన టీడీపీ నేతలు ఐపీఎస్‌ నుండి ఎస్‌ఐ స్థాయి అధికారులపైనా విరుచుకుపడ్డారు. పోలీసులు ఎక్కడా తమ పరిధి దాటకుండా ప్రవర్తించి చలో ఆత్మకూరు కార్యక్రమం సందర్భంగా చిన్నపాటి ఘటన కూడా చోటుచేసుకోకుండా నివారించగలిగారు. ఈ సందర్భంగా డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మాట్లాడుతూ.. పల్నాడులో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉన్నందువల్లే ప్రతిపక్ష నేత చంద్రబాబు ముందస్తు గృహ నిర్బంధం చేసినట్లు చెప్పారు. ఇదిలావుండగా.. విధుల్లో ఉన్న ఐపీఎస్‌ అధికారి విక్రాంతి పాటిల్‌ను యూజ్‌లెస్‌ ఫెలో అంటూ దుర్భాషలాడి పోలీస్‌ ప్రతిష్టను కించపరచిన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె.శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షుడు నర్రెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, గుంటూరు రూరల్‌ జిల్లా అధ్యక్షుడు టి.మాణిక్యాలరావు డిమాండ్‌ చేశారు. 

అచ్చెన్నాయుడిపై కేసు
తాడేపల్లి/టెక్కలి: ఐపీఎస్‌ అధికారి విక్రాంత్‌ పాటిల్‌పై ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అనుచిత ప్రవర్తనపై ఎస్‌ఐ కోటయ్య ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకుల ఫిర్యాదుతో శ్రీకాకుళం జిల్లా టెక్కలి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇదిలావుండగా.. స్వార్థ రాజకీయాల కోసం దళితుల మధ్య వివాదాలు సృష్టిస్తున్న ‘చంద్రబాబు గో బ్యాక్‌’ అంటూ ఎమ్మార్పీఎస్‌ నాయకులు మాచర్ల పార్క్‌ సెంటర్‌లో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బుధవారం నిరసన వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు