నిజాయతీగా ఉంటే... భయపడాల్సిన పనిలేదు!

12 Sep, 2019 02:34 IST|Sakshi

బ్యాంకులకు కేంద్ర మంత్రి అనురాగ్‌ఠాకూర్‌

న్యూఢిల్లీ: బ్యాంకులు దేశ ప్రయోజనాల కోణంలో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలని, భవిష్యత్తులో దర్యాప్తు సంస్థలు వేధింపులకు గురి చేస్తాయన్న భయం వద్దని కేంద్ర ఆరి్థక శాఖా సహాయ మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌ అన్నారు. ముంబైలో బుధవారం జరిగిన ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘ప్రభుత్వం బ్యాంకింగ్‌ రంగానికి మద్దతుగా నిలబడుతుంది. మంచి విశ్వాసంతో, నిజాయతీగా బ్యాంకులు తీసుకునే ఏ నిర్ణయాన్ని కూడా భవిష్యత్తులో ఏ దర్యాప్తు సంస్థ సైతం తీవ్రంగా పరిగణించడం జరగదు.

ఈ విషయంలో నాది హామీ. బ్యాంకులు, దేశ ప్రయోజనాల కోసం స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలి’’ అని ఠాకూర్‌ పేర్కొన్నారు. ఇటీవల చోటుచేసుకున్న భారీ మోసాలు, రుణ అవకతవకలు, ఎన్‌పీఏ కేసుల్లో ప్రభుత్వరంగ బ్యాంకుల ఉన్నతోద్యోగులు సమన్లు అందుకుని విచారణకు హాజరైన విషయం తెలిసిందే. దీంతో బ్యాంకులు రుణాల మంజూరి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. కార్పొరేట్లకు అంతగా రుణాలు ఇచ్చేందుకు ముందుకు రాని పరిస్థితుల్లో మంత్రి వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. 

మరిన్ని వార్తలు