వైఎస్సార్‌సీపీ నేత ఇంటిపై దాడి

4 Aug, 2018 10:43 IST|Sakshi
బాధితునితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న రాష్ట్ర కార్యదర్శి రమేష్‌రెడ్డి

అర్ధరాత్రి వేళ మద్యం మత్తులో అగంతకుల దుశ్చర్య

రాడ్లతో తలుపులు పగులగొట్టే యత్నం

స్థానికులు మేల్కోవడంతో బైక్‌లపై ఉడాయింపు

తాడిపత్రి: తాడిపత్రి పట్టణంలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి జబ్బార్‌బాషా ఇంటిపై గురువారం అర్ధరాత్రి అగంతకులు దాడిచేశారు. స్థానికులు మేల్కోవడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. వివరాల్లోకెళితే.. వడ్లపాళెంలో నివాసముంటున్న జబ్బార్‌బాషా ఇటీవలే యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. గురువారం రాత్రి ఆయన తన నివాసంలో మేడపై నిద్రిస్తున్నాడు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పూటుగా మద్యం తాగిన పదిమంది వ్యక్తులు ద్విచక్రవాహనాల్లో వచ్చారు. బీరుబాటిళ్లు, రాడ్లతో జబ్బార్‌బాషా ఇంటిపై దాడికి తెగబడ్డారు. బయట పార్కింగ్‌ చేసిన ద్విచక్రవాహనాన్ని ధ్వంసం చేశారు.

రాడ్లతో ఇంటి తలుపులు పగులగొట్టేందుకు య త్నించారు. శబ్దం కావడంతో వీధిలో ఆరుబయట నిద్రిస్తున్న స్థానికులు లేచి అప్రమత్తమయ్యారు. దీన్ని గమనించిన దుండగులు ఈలలు, కేకలు వేసుకుంటూ ద్విచక్రవాహనాల్లో అక్కడి నుంచి ఉడాయించారు. బాధితుడు కిందకు దిగివచ్చి వెంటనే పోలీసులకు సమాచారమందించారు. వారు వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. శుక్రవారం ఉదయం విషయం తెలుసుకున్న వైయస్సార్‌సీపి రాష్ట్ర కార్యదర్శి రమేష్‌రెడ్డి దాడి ఘటనపై ఆరా తీశారు. బాధితుడిని వెంటబెట్టుకొని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు.

శాంతిభద్రతలు కాపాడండి
జబ్బార్‌బాషాపై దాడిచేసిన దుండగులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌రెడ్డి పోలీసులను కోరారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న వైఎస్సార్‌సీపీ నేతలను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారన్నారు. ఇటీవల కాలంలో కొందరు అసాంఘిక కార్యకలాపాలకూ పాల్పడుతున్నారని, రాత్రి తొమ్మిది గంటలు దాటితే ఇంటి నుంచి  అడుగు బయటపెట్టలేని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణంలో శాంతిభద్రతలను కాపాడాలని సీఐ సురేందర్‌రెడ్డిని కోరారు. 

అగంతకులను గుర్తించే పనిలో పోలీసులు
జబ్బార్‌బాషా ఇంటిపై దాడి చేసిన దుండగులను గుర్తించే పనిలో పట్టణ పోలీసులు నిమగ్నమయ్యారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ ఫుటేజీల ఆధారంగా అగంతకులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అనుమానితులను స్టేషన్‌కు పిలిపించి విచారణ చేస్తున్నట్లు తెలిసింది.  

మరిన్ని వార్తలు