ఇసుక.. మస్కా

21 Apr, 2016 04:15 IST|Sakshi
ఇసుక.. మస్కా

ఉచిత విధానంతో విచ్చలవిడిగా వెలుస్తున్న డంప్‌లు
అందినకాడికి దోచేసుకుంటున్న
 అధికార పార్టీ నేతలు, రియల్టర్లు
సాధారణ ప్రజలకు దొరికేది కష్టమే
పట్టించుకోని అధికారులు

 
 
సాక్షి ప్రతినిధి, కర్నూలు : దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకుందామన్న చందంగా అధికార పార్టీ నేతలు.. రియల్టర్లు ఉచిత ఇసుకను దోచేసుకుంటున్నారు  వందల కొద్దీ ట్రాక్టర్ల ఇసుకను డంప్ చేసుకుంటున్నారు. ఉచిత ఇసుక విధానం అమలులోకి వచ్చినప్పటి నుంచి భారీ స్థాయిలో ట్రాక్టర్లను రంగంలోకి దించి దర్జాగా ఇసుకను డంప్ చేసుకుంటున్నారు. అయినా అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. మరోవైపు ప్రస్తుతం ఉన్న ఇసుక నిల్వలు కేవలం 9 నెలలకే సరిపోతాయనే అంచనాలు సాధారణ ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది.


 డంప్‌లే.. డంపులు
 ఏ రోజు అవసరాలకు ఆ రోజే ఇసుకను సరఫరా చేసుకోవాలని అలా కాకుండా అక్రమంగా నిల్వ చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయినా అధికార పార్టీ నేతలు, రియల్ ఎస్టేట్ సంస్థల వారు ఏ మాత్రమూ పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఎక్కడ చూసినా ఇసుక మేటలు వేస్తోంది. ఇప్పటికే ఆలూరు సమీపంలో ఒక ప్రైవేట్ పవన విద్యుత్ ప్లాంట్‌తో పాటు మంత్రాలయంలో శ్రీమఠం అధికారులు ఇసుకను భారీ స్థాయిలో డంపు చేసినట్టు ఆధారాలతో సహా ‘సాక్షి’ బయటపెట్టింది. అలాగే చాలాచోట్ల అధికారపార్టీ నేతలు, రియల్ ఎస్టేట్ సంస్థలు భారీగా ఇసుకను డంప్ చేసినట్లు తెలుస్తోంది. వందల ట్రాక్టర్ల ఇసుకను రాత్రనక... పగలనక తవ్వుకుంటూ డంప్ చేస్తున్నారు. కంటి చూపు మేరలో ఇసుక డంప్‌లు దర్శనమిస్తున్నా అధికారులు మాత్రం అటువైపు చూసేందుకు సాహసించడం లేదు. ఉన్న కొద్దిపాటీ ఇసుక నిల్వలను ఈ విధంగా డంప్ చేసుకుంటూ పోతే మరికొద్ది రోజుల్లో సాధారణ ప్రజలకు ఇంటి నిర్మాణానికి కూడా ఇసుక లభించే పరిస్థితి లేకుండా పోతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
 
 
 9 నెలలకే ఖలాస్
 జిల్లాలో మొత్తం నాలుగు ఇసుక రీచ్‌లు ఉన్నాయి. ఇందులో కర్నూలు మండలంలోని ఆర్. కొంతలపాడు, పుడూరు, నందవరం మండలంలోని గురజాలతో పాటు పత్తికొండ నియోజకవర్గంలో కనకలదిన్నెలో రీచ్‌లు ఉన్నాయి. ఈ నాలుగు రీచ్‌లలో ఉన్న ఇసుక నిల్వలు కేవలం 3 లక్షల క్యూబిక్‌మీటర్లు మాత్రమే. గతంలో రాయల్టీ విధానం అమలులో ఉన్న సమయంలోనే ఏడాది కాలంలోనే ఏకంగా 4 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను జిల్లా ప్రజలు కొనుగోలు చేశారు. అంటే ప్రస్తుతం ఉన్న ఇసుక నిల్వలు కేవలం 9 నెలలకు మించి సరిపోయే అవకాశం లేదు. ఆ తర్వాత జిల్లాలో ఇసుక దొరికే అవకాశమే లేదనే అభిప్రాయం నెలకొంది.

కొత్త రీచ్‌లకు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ నుంచి అనుమతులు లభించడం లేదు. దీంతో ఈ రీచ్‌లల్లో ఇసుకను తవ్వేందుకు అవకాశం లభించడం లేదు. ఇక ఇతర ప్రాంతాల్లో మరికొన్ని కొత్త రీచ్‌లకు అనుమతి ఇచ్చేందుకు స్థానికం భూగర్భ జలవనరులశాఖ అధికారులు అంగీకరించడం లేదు. అలాచేస్తే భూగర్భ నీటి నిల్వలు మరింత ప్రమాదకర స్థాయికి తరిగిపోతాయని వారు ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు