‘ఆర్డీఎస్, వేదవతి’ టెండర్లలో కుమ్మక్కు

25 Feb, 2019 03:35 IST|Sakshi

అంచనా వ్యయం పెంచడం ద్వారా ఖజానాపై రూ. 805.29 కోట్ల భారం

టెండర్‌ జారీ చేయక ముందే కోటరీ కాంట్రాక్టర్లతో ముఖ్యనేత బేరసారాలు

అడిగినంత కమీషన్‌కు అంగీకరించిన ఇద్దరు కాంట్రాక్టర్లకే పనులు దక్కేలా నిబంధనలు

ఆ మేరకు ఆ రెండు సంస్థలే అధిక ధరలకు షెడ్యూలు దాఖలు చేసిన వైనం

తద్వారా ఖజానాకు మరో రూ. 460 కోట్లు భారం

నిబంధనల ప్రకారం టెండర్లను రద్దు చేయాలి

ఉన్నత స్థాయి ఒత్తిళ్లకు తలొగ్గి సీవోటీ పరిశీలనకు పంపిన జలవనరుల అధికారులు

టెండర్‌లను ఆమోదించాలంటూ సీవోటీపై ముఖ్యనేత ఒత్తిడి

ఆమోదిస్తే ఖజానాపై రూ. 1,265.31 కోట్ల భారం

రూ. 750 కోట్లకుపైగా ముడుపుల వసూళ్లు! 

సాక్షి, అమరావతి: రాజోలిబండ డైవర్షన్‌ స్కీం (ఆర్డీఎస్‌) కుడి కాలువ పనులకు పెంచిన అంచనా వ్యయం రూ. 1,557.37 కోట్లు. ఈ టెండర్‌లో 4.75 శాతం ఎక్సెస్‌ (రూ. 1,631.34 కోట్లు)కు  ఒక సంస్థ, 4.89 శాతం ఎక్సెస్‌ (రూ. 1,633.52 కోట్లు)కు మరో సంస్థ కోట్‌ చేస్తూ షెడ్యూలు దాఖలు చేశాయి.

వేదవతి ఎత్తిపోతల పథకం పెంచిన అంచనా వ్యయం రూ. 1,536.28 కోట్లు. ఈ టెండర్‌లో రాజోలిబండలో రెండో సంస్థ 4.65 శాతం ఎక్సెస్‌ (రూ. 1,607.71 కోట్ల)కు, రాజోలిబండలో మొదటి సంస్థ 4.85 శాతం ఎక్సెస్‌ (రూ. 1,610.78 కోట్లు) కోట్‌ చేస్తూ షెడ్యూలు దాఖలు చేశాయి.

ఈ రెండు టెండర్లలో ఆయా సంస్థలు దాఖలు చేసిన మొత్తాలను పరిశీలిస్తే ఏమనిపిస్తోంది? రెండు కాంట్రాక్టు సంస్థలు కుమ్మక్కైనట్లు స్పష్టమవుతోంది కదా! నిబంధనల ప్రకారమైతే ఈ టెండర్లను రద్దు చేయాలి. కానీ.. కాంట్రాక్టు సంస్థలను కుమ్మక్కయ్యేలా చక్రం తిప్పింది రాష్ట్ర ముఖ్యనేత కావడంతో కర్నూలు జిల్లా జలవననరుల శాఖ అధికారులు టెండర్లను రద్దు చేయలేదు. టెండర్‌లలో వెల్లడైన అంశాలను శనివారం కమిషనర్‌ ఆఫ్‌ టెండర్స్‌(సీవోటీ)కి పంపారు. వేదవతి ఎత్తిపోతలను ఒక సంస్థకు, ఆర్డీఎస్‌ కుడి కాలువ పనులను మరో సంస్థకు కట్టబెట్టాలని సీవోటీపై ముఖ్యనేత తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు.

టెండర్లను పారదర్శకంగా నిర్వహించి ఉంటే కనీసం పది శాతం తక్కువ ధరలకే రెండు ప్రాజెక్టుల పనులు పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకొచ్చేవారు. మొదట అంచనా వ్యయం పెంచేయడంతో ఖజానాకు రూ. 805.29 కోట్ల మేర తూట్లు పొడిచారు. ఆ తర్వాత కమీషన్‌ల కోసం స్వయంగా ఆ ముఖ్యనేతే కాంట్రాక్టర్లను కుమ్మక్కు చేయడం వల్ల.. భారీ ఎక్సెస్‌కు పనులు అప్పగించాల్సి రావడంతో రూ. 460.02 కోట్ల భారం పడింది. ఈ వ్యవహారంలో రూ. 750 కోట్లకుపైగా ముడుపులు మారనున్నాయని అధికారవర్గాలు చెబుతున్నాయి.

విచ్చలవిడిగా అంచనాల పెంపు
కర్నూలు జిల్లాలో తుంగభద్ర నది నుంచి ఆర్డీఎస్‌ ఆనకట్టకు ఎగువ నుంచి కాలువ తవ్వి నాలుగు టీఎంసీలు తరలించడం ద్వారా 40 వేల ఎకరాలకు నీళ్లందించే పనులకు రూ. 1,557.37 కోట్ల అంచనా వ్యయంతో గత నెల 31న టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఆర్డీఎస్‌ కుడి కాలువ కోసం 2,15,47,550.42 క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులు చేపట్టాలి. 2018–19 ఎస్‌ఎస్‌ఆర్‌ ప్రకారం క్యూబిక్‌ మీటర్‌కు రూ. 120 చొప్పున మట్టి పనులకు రూ. 258.67 కోట్ల వ్యయం అవుతుంది. 4,40,261.88 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు చేయాలి. క్యూబిక్‌ మీటర్‌ కాంక్రీట్‌కు సగటున రూ.ఐదు వేలు చొప్పున రూ. 220.13 కోట్లు ఖర్చు అవుతుంది. నాలుగు దశల్లో నీటిని ఎత్తిపోయడానికి పంప్‌ హౌస్‌లు, ప్రెజర్‌మైన్ల కోసం రూ. 600 కోట్లకు మించి ఖర్చు కాదు.

కాంట్రాక్టర్‌ లాభం పది శాతాన్ని కలుపుకున్నా సరే ఈ పనుల అంచనా వ్యయం రూ. 1,186.6 కోట్లకు మించదు. అంటే రూ. 370.77 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. దీనికి ఎక్సెస్‌ అదనం. ఇదే జిల్లాలో వేదవతి నదికి వరద వచ్చే రోజుల్లో రోజుకు 59.91 క్యూసెక్కుల చొప్పున 4.20 టీంఎసీలను ఎత్తిపోసి 80 వేల ఎకరాలకు నీళ్లందించే పనులకు రూ. 1,536.28 కోట్ల వ్యయంతో గత నెల 31న టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఇందులో 1,66,17,781 క్యూబిక్‌ మీటర్ల మట్టి పనికి రూ. 199.41 కోట్ల వ్యయం అవుతుంది. 2,04,500 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులకు రూ. 102.25 కోట్ల వ్యయం అవుతుంది. మూడు దశల్లో ఎత్తిపోతల పనులకు రూ. 700 కోట్లకు మించి వ్యయం కాదు. కాంట్రాక్టర్‌ లాభం పది శాతం కలుపుకున్నా.. ఈ పనుల అంచనా వ్యయం రూ. 1,101.76 కోట్లకు మించదు. అంటే.. వేదవతి ఎత్తిపోతల అంచనా వ్యయం రూ. 434.52 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. దీనికి ఎక్సెస్‌ అదనం.

లాలూచీ పర్వం బహిర్గతం..: వేదవతి ఎత్తిపోతల, ఆర్డీఎస్‌ కుడి కాలువ పనులకు టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయక ముందే ముఖ్యనేత ఇద్దరు కోటరీ కాంట్రాక్టర్లతో భేటీ అయ్యారని అధికారవర్గాలు చెబుతున్నాయి. అడిగిన మేరకు కమీషన్‌లు ఇచ్చేందుకు ముందుకొచ్చిన ఇద్దరు కాంట్రాక్టర్లకు మాత్రమే షెడ్యూలు దాఖలు చేయడానికి అవకాశం ఉండేలా నిబంధనలు రూపొందించి టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసేలా అధికారులపై ఒత్తిడి తెచ్చారు. చంద్రబాబు ఎంపిక చేసిన  ఆ రెండు సంస్థలు మాత్రమే రెండు ప్రాజెక్టుల టెండర్లలో షెడ్యూలు దాఖలు చేశాయి. రెండు సంస్థలు కుమ్మక్కవడం వల్ల చెరొక ప్రాజెక్టు దక్కించుకునేలా అధిక ధరలకు కోట్‌ చేస్తూ షెడ్యూలు దాఖలు చేశాయి. ఈ లాలూచీపర్వం శుక్రవారం ప్రైస్‌ బిడ్‌ తెరిచినప్పుడు రట్టయింది. ఈ టెండర్‌లను ఆమోదిస్తే ఖజానాపై రూ.460 కోట్లకుపైగా భారం పడుతుంది. అంచనా వ్యయాలను నిక్కచ్చిగా లెక్కిస్తే రూ. 805.29 కోట్ల మేర తగ్గుతుంది. నిజాయతీగా టెండర్‌లను రద్దు చేస్తే ఖజానాకు కనీసం రూ. 1,265.31 కోట్ల మేర మిగులుతుంది. ముఖ్యనేత ఒత్తిళ్లకు తలొగ్గిన సీవోటీ టెండర్లను రద్దు చేస్తుందా? ఆమోదిస్తుందా? అన్నది తేలాల్సి ఉంది.  

మరిన్ని వార్తలు