ఆ ఊరికి రోడ్డొద్దు!

28 May, 2018 11:09 IST|Sakshi
గుండ్లశింగవరం నుంచి గడ్డమేకల పల్లెకు వెళ్లే రోడ్డు

అడ్డుకుంటున్న అధికారపార్టీ ఎమ్మెల్యే

నష్టపరిహారం పేరుతో నాటకాలు  

నాలుగేళ్లుగా అదే తీరు

సాక్షి ప్రతినిధి, కర్నూలు:  సాధారణంగా ఫలానా గ్రామానికి రోడ్డు వేయండి అని ప్రతిపాదించడం ప్రజా ప్రతినిధుల విధి. అయితే, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ఫలానా గ్రామానికి రోడ్డు వేయవద్దంటూ నాలుగేళ్లుగా అడ్డుపడుతున్నారు. తన సంస్థకు కాకుండా మరో కాంట్రాక్టు సంస్థకు పనులు దక్కడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. మూడేళ్లుగా ఏదో ఒక కొర్రీ వేస్తూ.. అధికారులను బెదిరిస్తూ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కాకుండా అధికారపార్టీకి చెందిన బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు విమర్శల పాలవుతోంది.

వాస్తవానికి అవుకు మండల కేంద్రం నుంచి గుండ్ల శింగవరం గ్రామానికి 13 కిలోమీటర్ల రోడ్డు వేసేందుకు కేంద్ర ప్రభుత్వంప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన (పీఎంజీఎస్‌వై) కింద రూ.7.48 కోట్లు మంజూరు చేసింది. ఇందుకోసం 2014 సెప్టెంబరులో పంచాయతీరాజ్‌శాఖ టెండర్లను పిలిచింది. ఈ టెండర్లను శ్రీలక్ష్మీ వెంకటేశ్వర కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ తక్కువ ధరకే (లెస్‌కు) కోట్‌ చేసి దక్కించుకుంది. అయితే, సంస్థకు టెండర్‌ నిబంధనల మేరకు అర్హత లేదని మొదట్లో కొర్రీలు వేసిన ఎమ్మెల్యే.... ఆ తర్వాత భూ సేకరణ సమస్య పేరుతో రోడ్డు వేయకుండా అడ్డుకుంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఈ గ్రామాల పరిధిలో ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి బలముండటమే కాకుండా... తన సంస్థకు పనులు దక్కకపోవడమేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

కాంట్రాక్టు అప్పగించినా....!
బనగానపల్లె నియోజకవర్గంలోని అవుకు మండల కేంద్రం నుంచి జి. శింగవరం గ్రామానికి రోడ్డు వేసేందుకు 2015లోనే టెండర్లను పిలిచారు. అయితే, వివిధ కొర్రీలు వేస్తూ ఎమ్మెల్యే ఈ టెండర్లను అడ్డుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇందుకు కారణం ఈ టెండర్‌ తన సంస్థకు కాకుండా మరో సంస్థకు రావడమే. సుమారు రూ.8 కోట్ల విలువ చేసే ఈ రోడ్డు పనులను మరో కాంట్రాక్టు సంస్థకు దక్కడంతో అడ్డుకుని... కాంట్రాక్టు రద్దు చేయించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయితే, సదరు కాంట్రాక్టు సంస్థ కోర్టుకు వెళ్లి మరీ ఆదేశాలు తెచ్చుకోవడంతో ఇప్పుడు భూ సేకరణ సమస్యను ఎమ్మెల్యే తెరమీదకు తెస్తున్నట్టు తెలుస్తోంది.

మొదట్లో టెండర్‌ పనులను దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థకు లెటర్‌ ఆఫ్‌ అవార్డు (ఎల్‌వోఏ) ఇవ్వకుండా అధికారులపై ఒత్తిడి తెచ్చారు. తీరా కోర్టు నుంచి అక్షింతలు రావడంతో అధికారులు ఎల్‌వోఏ ఇవ్వాల్సి వచ్చింది. అయితే, ఇప్పుడు పనులు ప్రారంభించకుండా నంద్యాల డివిజన్‌ పరిధిలోని పంచాయతీరాజ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు (ఈఈ)పై ఒత్తిడి తెస్తున్నారు. ఇందుకోసం భూమిని కోల్పోయే రైతులు.. 2017లో  కోర్టును ఆశ్రయించారని, దానిపై ఆదేశాలు వచ్చే వరకూ పనులు ప్రారంభించవద్దని ఒత్తిళ్లు తెస్తున్నారు. ఒకవేళ పనులు ప్రారంభిస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ ఏకంగా ఈ నెల 3వ తేదీన ఆయన లేఖ రాయడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఒత్తిళ్లతో పనులు ప్రారంభించకుండా అధికారులు  అడ్డుకుంటున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  రోడ్డు వేయకపోతే రానున్న వర్షాకాలంలో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని మెట్టుపల్లె, రామవరం, గుండ్ల శింగవరం గ్రామ ప్రజలు వాపోతున్నారు.  

రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది
వర్షాకాలంలో మా గ్రామానికి చేరుకోవాలంటే నరకం చూడాల్సి వస్తోంది. బీటీ రోడ్డు పూర్తయితే నాలుగు గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. అంతేగాక రైతులు పంట ఉత్పత్తులు ఇళ్లకు, మార్కెట్‌కు తరలించేందుకు ఇబ్బందులు తొలగుతాయి.దేవరకొండ శివశంకర్, గడ్డమేకలపల్లె

మరిన్ని వార్తలు