ఉగాది నుంచి గుంటూరులో టీడీపీ కార్యాలయం

27 Mar, 2016 02:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్, కొరిటెపాడు (గుంటూరు): తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ కార్యాలయం వచ్చే నెల 8వ తేది ఉగాది నుంచి గుంటూరు కేంద్రంగా పని చేయనుంది. ఈ కార్యాలయాన్ని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభిస్తారని సమాచారం. గుంటూరు నగరంలోని పిచ్చుకలకుంట ప్రాంతంలో ఉన్న టీడీపీ జిల్లా కార్యాలయాన్ని లోకేష్ వ్యక్తిగత కార్యదర్శి సాంబశివరావు, పార్టీ కార్యాలయంలో ఐటీ వ్యవహారాలను పర్యవేక్షించే రాజేష్‌లు శనివారం పరిశీలించారు. అంతకు ముందు వాస్తు సిద్ధాంతి కూడా కార్యాలయాన్ని పరిశీలించారు. 

గుంటూరు జిల్లా కార్యాలయం నుంచి రాష్ట్ర పార్టీ వ్యవహారాలను నిర్వహించవచ్చని, పార్కింగ్, ఇతర సమస్యలేవీ ఉండవని వారు నివేదించడంతో గుంటూరు కార్యాలయాన్ని తాత్కాలికంగా రాష్ట్ర పార్టీ వ్యవహారాలు నడిపేందుకు ఎంపిక చేశారు. మంగళగిరిలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి 5 ఎకరాల స్థలం కేటాయించాల్సిందిగా ఇప్పటికే టీడీపీ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. భూమి కేటాయించిన వెంటనే అక్కడ నిర్మాణ పనులు చేపడతారు. భవన నిర్మాణం పూరైన తర్వాత గుంటూరు నుంచి పని చేసే తాత్కాలిక కార్యాలయాన్ని అక్కడికి తరలిస్తారు.

మరిన్ని వార్తలు