తెలంగాణ దెబ్బ

6 Feb, 2015 02:17 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కర్నూలు:  ధాన్యం సేకరణకు ‘తెలంగాణ’ దెబ్బ పడింది. జిల్లాలో పండించిన ధాన్యంలో సుమారు 90 శాతం మేరకు ఇప్పటికే తెలంగాణ రాష్ర్టం.. అందులోనూ ప్రధానంగా మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రైస్ మిల్లర్లు కొనుగోలు చేశారు. ధాన్యం కొనుగోలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే తెలంగాణ మిల్లర్లు అధిక ధరకు కొనుగోలు చేయడమే ఇందుకు ప్రధాన కారణం.
 
 అంతేకాకుండా ఇక్కడి మిల్లర్లు నేరుగా నగదు ఇవ్వకుండా బ్యాంకులోకి జమ చేయాలనేది ప్రభుత్వ నిబంధన. దీంతో ధాన్యం విక్రయించిన సొమ్ము బ్యాంకులోకి పడిన వెంటనే పాత అప్పులకు జమ అవుతోంది. దీంతో నగదు చెల్లిస్తున్న తెలంగాణ మిల్లర్లకే ధాన్యాన్ని విక్రయించేందుకు ఇక్కడి రైతులు మొగ్గుచూపారు. ఫలితంగా లెవీ సేకరణకు జిల్లా మిల్లర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లెవీ సేకరణ పూర్తికాకపోతే... రూపాయికే కిలో బియ్యంతో పాటు సంక్షేమ హాస్టళ్లకు బియ్యం సరఫరాకు సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
 అధిక ధరతో అటే అమ్మకాలు..!
 జిల్లాలో పండించిన గ్రేడ్ ఏ రకం ధాన్యాన్ని క్వింటాలుకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ను రూ. 1400గా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి బయటి మార్కెట్లో ఈ ధర కంటే అధికంగా ఉంది. అయితే, తెలంగాణ మిల్లర్లు ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఎంఎస్‌పీ కంటే, బయటి మార్కెట్ ధర కంటే అధిక ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణం. దీంతో జిల్లాలోని గ్రేడ్ ఏ రకం ధాన్యంలో సుమారు 90 శాతం మేరకు ఇప్పటికే తెలంగాణ మిల్లర్లు కొనుగోలు చేశారు. ఫలితంగా ధాన్యం సేకరణకు జిల్లాలోని రైస్ మిల్లర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లెవీ కింద ప్రభుత్వానికి ఇవ్వాల్సిన 25 శాతం కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.  
 
 ధాన్యం సొమ్ము కాస్తా పాత అప్పుకు జమ..!
 నేరుగా జిల్లాలోని రైస్ మిల్లర్లకు ధాన్యం విక్రయించేందుకు రైతులు మొగ్గుచూపకపోవడానికి మరో ముఖ్యమైన కారణం నగదు చెల్లింపులు లేకపోవడమే. ఇక్కడి మిల్లర్లకు ధాన్యాన్ని విక్రయించాలంటే ఆధార్ కార్డుతో పాటు బ్యాంకు అకౌంటు నెంబరును రైతులు ఇవ్వాల్సి ఉంది. ధాన్యం కొనుగోలు చేసిన మొత్తాన్ని నేరుగా రైతు బ్యాంకు అకౌంటులోకి జమ చేయాల్సి ఉంటుంది. అయితే, ఇక్కడే రైతులకు కొత్త చిక్కు వచ్చి పడింది. రుణమాఫీ ఇంకా పూర్తి కానందున.. ధాన్యం విక్రయించిన సొమ్ము కాస్తా పాత అప్పులకు బ్యాంకర్లు జమ చేస్తున్నారు. దీంతో బ్యాంకు అకౌంట్‌లోకి జమ చేస్తున్నందున తాము ధాన్యాన్ని విక్రయించలేమని రైతులు తెగేసి చెబుతున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రం... ప్రధానంగా మహబూబ్‌నగర్ జిల్లాలోని మిల్లర్లు నేరుగా చేతికే నగదు ఇచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. అంతేకాదు.. ఎంఎస్‌పీ కంటే అధిక ధరకు కొనుగోలు చేస్తుండటంతో రైతులు స్థానికంగా ధాన్యాన్ని అమ్మేందుకు ససేమిరా అంటున్నారు.
 
 ఇప్పటివరకు సేకరించింది వేయి టన్నులే...!
 రైస్ మిల్లర్లు సేకరించిన మొత్తం ధాన్యంలో 25 శాతం మొత్తాన్ని లెవీ కింద పౌర సరఫరాల శాఖకు మిల్లర్లు అందజేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన మన జిల్లాలోని మిల్లర్లు  18 వేల టన్నుల దాన్యాన్ని సేకరించి ఇక్కడి పౌర సరఫరాల శాఖ అధికారులకు అందజేయాల్సి ఉంది. అయితే, ఇప్పటివరకు కేవలం 1000 టన్నుల ధాన్యాన్ని మాత్రమే మిల్లర్లు సేకరించారు. ఈ రబీ సీజనులో మరో వేయి టన్నులను మాత్రమే సేకరించే అవకాశం ఉందని మిల్లర్లు అంటున్నారు. అంటే మొత్తం 18 వేల టన్నులకుగానూ కేవలం 2 వేల టన్నులు మాత్రమే లెవీ కింద ఇవ్వనన్నారన్నమాట.
 
 అంటే నిర్ణీత లక్ష్యంలో కేవలం 11 శాతం మాత్రమే పూర్తైదన్నమాట. ఈ నేపథ్యంలో రూపాయికే కిలో బియ్యం పథకంతో పాటు సంక్షేమ హాస్టళ్లకు బియ్యం సరఫరాకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘జిల్లాలో మొత్తం లెవీ సేకరించే మిల్లులు 90 ఉన్నాయి. ఒక మిల్లుకు 200 టన్నుల లెవీ సేకరణను లక్ష్యంగా నిర్ణయించారు. అయితే, తెలంగాణ మిల్లర్లు నేరుగా నగదు ఇవ్వడంతో పాటు అధిక ధరకు కొంటుండటంతో వారికే ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు మొగ్గుచూపారు’ అని జిల్లా రైస్‌మిల్లుల సంఘం అధ్యక్షుడు వెంకట నారాయణ ‘సాక్షి’కి తెలిపారు.
 

మరిన్ని వార్తలు