తెగిస్తే.. విముక్తే!

17 Sep, 2013 00:49 IST|Sakshi
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: హైదరాబాద్ సంస్థాన పాలకుడు నిజాం దాస్య శృంఖలాల్లో నలుగుతూ, రజాకార్ల అరాచకాల నుంచి తెలంగాణ పీడిత ప్రజానీకం స్వేచ్ఛా వాయువులు పీల్చిన రోజు. జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌ల పీడన, భూ స్వాముల దోపిడీ చెరనుంచి విముక్తి పొందిన దినం. స్వాతంత్య్రోద్యమ నీడ తన సంస్థానంపై పడకుండా నిజాం నిషేధాజ్ఞలు విధించిన సందర్భం. రాజభాష ఉర్దూ తప్ప తమ భాషలో మాట్లాడుకోలేని దుస్థితి. జాగీరు పేరిట పోలీసు, న్యాయ, పాలనా అధికారులు దక్కించుకున్న జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌లు చెప్పిందే వేదం. గ్రంథాలయం, పాఠశాల, వ్యాయామశాల, సంఘం, సమావేశం ఏది పెట్టాలన్నా డేగ కళ్ల ‘గస్తీ నిషాన్ -53’ చట్టం చెప్పినట్లు వినాల్సిందే. రజాకారు దళాలు పల్లెల మీద విరుచుకుపడి మాన, ప్రాణాలను హరించాయి. అడ్డు తిరిగిన వారి ఆస్తులను బుగ్గి చేశాయి. స్వేచ్ఛగా బతకడమే నేరమైన చోట పల్లెలు తిరుగుబాటు జెండా ఎగురవేశాయి. విజ్ఞానం పంచి వివేకం పెంచేలా 1922లో సిద్దిపేటలో ప్రారంభమైన గ్రంథాల యోద్యమం జిల్లా అంతటా విస్తరించింది. ఆంధ్ర మహాసభ సమావేశాల రూపంలో రాజకీయ చైతన్యాన్ని సంతరించుకుంది. 
 
 తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి సిద్దిపేట, మెదక్, నర్సాపూర్ ప్రాంతాలకు చెందిన యువకులు ఊపిరిలూదారు. ‘కామ్రేడ్ అసోసియేషన్’ పేరిట జిల్లాకు చెందిన మగ్దుం మొహినొద్దిన్ ప్రజా చైతన్యానికి బాటలు వేశారు. 1940లో ఏర్పడిన ‘ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్’కు మెదక్ నుంచి కేవల్ కిషన్, సిద్దిపేట నుంచి రాజేశ్వరరావు అండగా నిలిచారు. 1944లో కేవల్ కిషన్ మెదక్‌లో బాల భారతి మండలి ఏర్పాటు చేసి ‘జీతగాడు’, ‘మార్పు’ సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా వ్యవసాయ, పాలేర్ల సంఘం ఏర్పాటు చేసి విమోచనోద్యమానికి ఊపిరులూదారు. 1939 మార్చిలో సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన జోగిపేటలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభ నిజాం వ్యతిరేక పోరాటంలో చరిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. సిద్దిపేట, మెదక్, నారాయణఖేడ్, జోగిపేట, నర్సాపూర్, గజ్వేల్ పరిసర ప్రాంతాలపై కరీంనగర్, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో జరిగిన ‘సంఘం’ పోరాటం ప్రభావం చూపింది. 1948 సెప్టెంబర్ 17న నిజాం పాలన నుంచి బయటపడిన తెలంగాణలో అంతర్భాగమైన మెతుకుసీమ ప్రజానీకం స్వేచ్ఛా వాయువులు పీల్చింది. ‘విమోచన దినం’, ‘విలీన దినం’ పేరేదైనా స్వేచ్ఛా పిపాసులైన ప్రజలు పోరాట స్ఫూర్తిని నెమరు వేసుకునే సందర్భమిది.
మరిన్ని వార్తలు