తడియారని జ్ఞాపకాలు... | Sakshi
Sakshi News home page

తడియారని జ్ఞాపకాలు...

Published Tue, Sep 17 2013 12:07 AM

తడియారని జ్ఞాపకాలు...

నేడు తెలంగాణ విమోచన దినోత్సవం
 
 ‘తెలంగాణ సాయుధపోరాటం’ అనే మాట వినగానే ఇప్పటికీ ఆ పోరాటంలో పాల్గొన్నవారి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. రజాకార్ల దాడుల నుంచి తప్పించుకుని పక్క ప్రాంతాల్లో తలలు దాచుకున్న వారు, నడుం బిగించి నాటుతుపాకీలు పట్టుకున్న మహిళలు, కొడుకులు సాయుధులై వెళుతుంటే హారతిచ్చి పంపిన ముసలి తల్లితండ్రులు, పసికందుల్ని మంచాలపై వదిలి భర్తల వెంట నడిచిన మాతృమూర్తులు... ఒకరేమిటి! రజాకార్లని తరిమి కొట్టిన వేలాదిమంది వీరుల్ని తలచుకోవాల్సిన రోజు ఇది.  ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఉంటున్న ఒక కుటుంబంలోని ముగ్గురు తోబుట్టువులలో ఇద్దరు అన్నదమ్ములు, వారి పెద్దన్నయ్య భార్య... తమ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
 
 అజ్ఞాతంలో ఉండి పోరాడాం
 - చెన్న కృష్ణారెడ్డి, రిటైర్డ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్
 
 ‘‘నేను పదోతరగతి చదువుతున్న సమయంలో ‘దేశంలో ఎగురుతున్న జెండా, మన ఊళ్లో ఎందుకు ఎగరడం లేదు’ అనే వాక్యం చెవిలో పడగానే, నా బాధ్యతేంటో నాకు అర్థమైంది. స్టూడెంట్ యూనియన్ మూమెంట్‌కి అధ్యక్షత వహించాను. అన్నయ్య సుదర్శన్‌రెడ్డి అప్పటికే హైదరాబాద్‌లో జైల్లో ఉండి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. తమ్ముడు రంగారెడ్డి కమ్యూనిస్టుపార్టీకి మద్దతుగా తిరుగుతున్నాడు. నాన్న పాటి చంద్రారెడ్డి పోలీస్‌పటేల్‌గా పనిచేశారు. యూత్ కాంగ్రెస్ శిక్షణ తర్వాత నేను కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్నాను. సూర్యాపేట దగ్గరున్న క్యాంపు ఆఫీసుకి పల్లెల్లో ఉండే రజాకార్ల కదలికల్ని రహస్యంగా చేరవేయడం మా పని. మా జాడ కనుక్కుని మమ్మల్ని పట్టుకోవడానికి నిజాం ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసేది. ముఖ్యంగా మా అమ్మానాన్నలు  ఏ బిడ్డ జాడా చెప్పకుండా పోలీసుల చేతుల్లో బాధలు అనుభవించారు.’’
 
 పదేళ్ల వయసులోనే బర్మార్ పేల్చడం వచ్చు!
 - పాటి రంగారెడ్డి
 
 ‘‘నల్గొండ దగ్గర వర్ధ్దమానకోట మా ఊరు. రజాకార్ల దుర్మార్గానికి సమాధానంగా ఆయుధం చేతబట్టి యుద్ధం లో సైనికుల్లా వారిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేవాళ్లం. పదేళ్ల వయసుకే బర్మార్ (నాటు తుపాకీ) పేల్చడం వచ్చు. రజాకార్లు ఊళ్లపై దాడికి వచ్చినపుడు ఎత్తుగా ఉన్న భవంతుల్ని వారి నివాసంగా ఎన్నుకునేవారు. దాంతో మేం... మా ఇంటితో మొదలుపెట్టి ఆరు మేడలు కూల్చేశాం. అడవికి ఆనుకుని ఉన్న ఏరు దగ్గర రాత్రుళ్లు పడుకుని పగలు రహస్యంగా పల్లెల్లో తిరిగేవాళ్లం. తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల  ప్రాణాలతో బయటపడ్డాం. రజాకార్ల అన్యాయాల్ని ఎదిరించి పోరాడుతున్న మేమంటే పల్లెప్రజలకు అంతులేని అభిమానం ఉండేది. ఏ సమయంలో వెళ్లినా కడుపునిండా భోజనం పెట్టేవారు. ఒకసారి ఖమ్మం వెళుతుండగా పోలీసులకి దొరికిపోయాను. కొన్నాళ్లు ఖమ్మం జైల్లో ఉన్నాను. రెండు నెలల తర్వాత గుల్బర్గా జైలుకి పంపించారు. ఆరు నెలల తర్వాత విడుదల చేశారు. ఆ తర్వాత చాలానెలలు ప్రతిరోజు పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి సంతకం పెట్టాల్సి వచ్చేది. ఆ పోరాటం కోసం మారువేషాలు వేసుకుని ఊరికి వెళ్లిన జ్ఞాపకాలు ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి.’’
 
 అరవై ఏళ్లనాటి చేదు జ్ఞాపకాలు

 - పాటి శర్మిష్ఠ, సెక్రటరీ-కరస్పాండెంట్, మాడపాటి హనుమంతరావు గర్ల్స్ హైస్కూల్


 ‘‘నా భర్త సుదర్శన్‌రెడ్డి ఎప్పటిలాగే పొద్దున్నే టీ తాగడం కోసం సుల్తాన్‌బజార్‌కి వెళ్లాడు. ఇంతలో అక్కడ బాంబు పేలింది. క్షణాల్లో పోలీసులు వచ్చి ‘ప్రతిరోజు పొద్దున్నే  ఇక్కడికి ఎందుకు వస్తున్నావో ఇప్పుడర్థమైంది. ఆ బాంబు పేలుడు నీ పనే కదా...’ అని జైల్లో పడేశారు. ఆయన అప్పటికే ఎంబీబీఎస్ పూర్తిచేశారు. డాక్టరుగా పదిమందికీ సేవలందించాల్సిన సమయంలో జైల్లో ఉండటం వల్ల నైజాం ప్రభుత్వ అరాచకాలపై పోరాడారు. ఇక నా సంగతికొస్తే... మా నాన్నగారు వరకాంతం గోపాల్‌రెడ్డి మమ్మల్ని కొన్నాళ్లపాటు తమిళనాడు పంపేశారు.’’
 
 - భువనేశ్వరి
 సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

 

రజ్వీ పేరు మీదుగా రజాకార్లు
 మన దేశానికి స్వాతంత్య్రం రాకముందు, వచ్చాక ఏడాదిన్నర వరకూ కూడా హైదరాబాద్ రాష్ట్రం (అప్పట్లో తెలంగాణ జిల్లాలన్నీ ‘హైదరాబాద్’ రాష్ర్టం పేరుతో ఉండేవి) నైజాం పాలనలోనే ఉండేది. పన్ను వసూలు పేరుతో నిజాం అధికారులు ప్రజల్ని చాలా ఇబ్బందులు పెట్టేవారు. దాంతో ప్రజల నుంచి తిరుగుబాటు మొదలైంది. ఆ సమయంలో కాసిమ్ రజ్వి అనే రాజకీయ నాయకుడు తిరుగుబాటును అణచివేయడానికి ఒక ప్రైవేటు సైన్యం తయారుచేసుకున్నాడు. రజ్వి పంపిన మనుషులు కాబట్టి వారిని రజాకార్లు అనేవారు. వారు ఊళ్లపై పడి ప్రజల ఆస్తుల్ని దోచుకోవడం, ఎదురుతిరిగిన వారిపై, మహిళలపై దాడులకు తెగబడి రాక్షసక్రీడను మరపించేలా ప్రవర్తించేవారు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చేవరకూ రజాకార్లపై తిరుగుబాటు చేసినప్పుటికీ 1947 ఆగస్టు15 తర్వాత తెలంగాణ సాయుధపోరాటం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఆ సమయంలోనే వేలాదిమంది వీరులు పోరాటంలో ప్రాణాలు కోల్పోయారు. పోలీస్ చర్య తర్వాత 1948 సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన జరిగింది.
 

Advertisement
Advertisement