అప్పుడే గజగజ

5 Dec, 2018 12:29 IST|Sakshi
ఆకాశం నిండా మబ్బులు, కొండలలో మంచు

చింతపల్లి (పాడేరు): ఈ ఏడాది చలి ముందుగానే వచ్చేసింది.  చలి పులి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు ఒక్క సారిగా దిగజారుతుండడంతో గిరిజనులు గజగజ వణుకుతున్నారు. మంగళవారం ఇక్కడ 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ విభాగం పర్యవేక్షకుడు కె.దిలీప్‌ తెలిపారు. గత నెల 25న 6 డిగ్రీలు, 26న 5 డిగ్రీలుగా నమోదైన ఉష్ణోగ్రతలు తరువాత పెరిగి 7, 8గా నమోదయ్యాయి. సోమవారం 8 డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రత  మంగళవారానికి ఒక్క సారిగా 4 డిగ్రీలకు పడిపోయింది.

దీంతో   ఉదయం 10 గంటలైనా చలి గిలిపెడుతూనే ఉంది. మిట్ట మధ్యాహ్నం కూడా ఉన్ని దుస్తులు లేకుండా ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించలేని పరిస్థితి. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు కిటికీలు వేసుకుని ప్రయాణిస్తున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లే గిరిజనులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు చలికి  అవస్థలు పడుతున్నారు.   డిసెంబర్‌లో చలి మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని   దిలీప్‌ చెప్పారు.   మంచు, చలి కారణంగా సోకే వ్యాధుల పట్ల గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని స్థానిక కమ్యూనిటీ ఆస్పత్రి వైద్యాధికారి రఘురామ్‌ సూచించారు. కాగా, ఏజెన్సీ వాతావరణాన్ని ఆస్వాదించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు.

మధ్యాహ్నం నుంచే తేలికపాటి మంచు
అరకులోయ: బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి మన్యంలో వాతావరణంపై ప్రభావం చూపింది. సోమవారం ఆర్ధరాత్రి నుంచి పొగమంచు దట్టంగా కురిసింది. ఉదయం 9గంటల వరకు మంచు తెరలు వీడలేదు. చలిగాలుల తీవ్రత కాస్త తగ్గినా సూర్యోదయం తరువాత కూడా వాతావరణమంతా మబ్బుగా ఉండడంతో ఎండ   లేకుండా పోయింది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి అరకులోయ, డుంబ్రిగుడ, హుకుంపేట మండలాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తేలికపాటి మంచుతో కొండలు, రోడ్లు దర్శనమిచ్చాయి. ఆకాశమంతా మబ్బులు కమ్ముకోవడంతో వర్షం కురుస్తుందని ప్రజలు భావించారు.  జల్లులు కూడా కురవలేదు.

మరిన్ని వార్తలు