గ్రహణం సందర్భంగా పలు ఆలయాలు మూసివేత

16 Jul, 2019 19:08 IST|Sakshi

సాక్షి, చిత్తూరు : చంద్రగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని ఆలయాలను మూసివేయనున్నారు. అయితే గ్రహణం రోజున శ్రీకాళహస్తి ఆలయం తెరిచే ఉంటుందని ఆలయ వేద పండితులు శివప్రసాద్‌ శర్మ తెలిపారు. గ్రహణకాల సమయంలో ప్రత్యేక గ్రహణకాల అభిషేకాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. మంగళవారం రాత్రి ఒంటి గంట నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సంపూర్ణ కేతు చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని తెరచి ఉంచి ఉదయం మూడు గంటల నుంచి గ్రహణ కాలాభిషేకాలు, సంకల్పము, స్వామి అమ్మవార్లకు అభిషేకాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

సాక్షి, తిరుమల : చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం శ్రీవారి ఆలయం మూసివేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.08 కోట్లు అని వెల్లడించారు. గ్రహణం కారణంగా మంగళవారం రాత్రి 7 గంటలకు ఆలయ ద్వారాలు మూసివేస్తామని.. తిరిగి బుధవాం ఉదయం 5 గంటలకు ఆలయ ద్వారాలు తెరవనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం సుప్రభాతం, శుద్ధి తర్వాత శ్రీవారి దర్శనం ఉంటుందని వెల్లడించారు. కాగా ‌గ్రహణం సందర్భంగా అన్నప్రసాద కేంద్రాన్ని టీటీడీ మూసివేసింది.

సాక్షి, యాదాద్రి : నేడు చంద్రగ్రహణం సందర్భంగా సాయంత్రం 6.30 నిముషాల నుంచి రేపు ఉదయం 5.30 నిమిషాల వరకు యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ మూసివేయనున్నారు. రేపు ఉదయం 5.30 నిముషాలకు ఆలయం తెరిచి సంప్రోక్షణ అనంతరం నిత్య విధులు నిర్వహించి ఉదయం తొమ్మిది గంటల నుంచి భక్తులకు దర్శనాలకు అనుమతి ఉంటుంది. ఈ క్రమంలో ఈ రోజు సాయంత్రం, రేపు ఉదయం భక్తులచే జరుపబడే ఆర్జిత సేవలు రద్దు చేయనున్నారు.

మరిన్ని వార్తలు