అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు

19 Feb, 2019 12:46 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్‌ కుమార్‌పై సొంత పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఆయన అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. శ్రావణ్‌ కుమార్‌ను వ్యతిరేకిస్తూ వెంకటపాలెం నుంచి తుళ్లూరు వరకు ఆయన వ్యతిరేక వర్గం పాదయాత్ర చేపట్టింది. ఈ క్రమంలో వెంకటపాలెం చేరుకున్న ఎమ్మెల్యే అనుకూల వర్గం పాదయాత్రను అడ్డుకుంది. దీంతో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.(టీడీపీ నేతల హెచ్చరికతో ఖంగుతిన్న మంత్రులు)

కాగా గత కొం‍తకాలంగా తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌పై అసమ్మతి పెరిగిపోతోంది. దీనిని నివారించేందుకు ఏకంగా మంత్రులు రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆయన వ్యతిరేక వర్గం తుళ్లూరు మండలంలో శనివారం విస్తృత స్థాయిలో సమావేశాలు నిర్వహించింది. రానున్న ఎన్నికల్లో శ్రావణ్‌కుమార్‌కు టికెట్‌ ఇవ్వొద్దని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అనుచరుల మద్దతు కోరారు. వెంకటపాలెం గ్రామానికి చెందిన నాయకుడు బెల్లంకొండ నరసింహారావును తమ వర్గంలోకి రావాలని చర్చలు జరిపారు. రాజధాని ప్రాంతంలో వర్గాలను తయారు చేస్తున్న ఎమ్మెల్యే చేతుల్లో పార్టీని పెట్టడం సరైంది కాదని చెప్పారు. శ్రావణ్‌కుమార్‌కు టికెట్‌ ఇస్తే సహకరించేది లేదని తీర్మానించుకున్నారు. స్థానిక నాయకుల మాట కాదని అధిష్టానం వ్యవహరిస్తే ఇక్కడ ఓడిస్తామని స్పష్టం చేశారు. టీడీపీ నేతలు నరేంద్రబాబు, సుధాకర్‌ తరదితరుల నివాసాలలో ఈ చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే వారు మంగళవారం పాదయాత్ర చేపట్టారు.

మరిన్ని వార్తలు