అలా మాయచేశారు

25 Mar, 2016 03:47 IST|Sakshi
అలా మాయచేశారు

  నీటి లెక్కలన్నీ.. కాకి లెక్కలే
  అధికారుల నోరు నొక్కేసిన అధికారం..
కలెక్టర్‌తోనే అబద్ధం  చెప్పించిన వైనం..!
  ఆందోళన వీడని రైతులు కోర్టుకెక్కనున్న నీటియుద్ధం

 
 సాక్షి ప్రతినిధి, నెల్లూరు
: జిల్లాలో సాగునీటికి ప్రధాన ఆధారం సోమశిల జలాశయం. నిబంధనల ప్రకారం ఆ నీటిపై పెన్నా డెల్టా రైతాంగానికి పూర్తి హక్కులు ఉన్నాయి. అటువంటి నీటిని చిత్తూరు జిల్లాకు తరలించటంపై జిల్లా రైతులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అప్పటినుంచి సోమశిల నీటి పంపిణీలో జరిగిన అక్రమాలను సాక్షి వరుసగా వెలుగులోకి తీసుకొచ్చింది. స్పందించిన అధికారయంత్రాంగం రెండో పంటకు నీరిచ్చేందుకు అంగీకరించి ఐఏబీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే అధికార పార్టీ నాయకులు పకడ్బందీ వ్యూహంతో బుధవారం నిర్వహించిన ఐఏబీ సమావేశంలో సోమశిల నీటిపంపిణీ వాస్తవాలు బయటకు రాకుండా తొక్కిపెట్టారు. అయితే రైతుల కోరిక మేరకు రెండో పంటకు నీరు ఇచ్చి అంతా సవ్యంగానే ఉందని అనిపించారు. అయితే జలాశయంలో నీరు నిల్వ ఉంచడం దగ్గర నుంచి రెండో ఐఏబీ నిర్వహణ దాకా ఇరిగేషన్ అధికారులతీరుపై రైతులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నీటి లెక్కల్లో పక్కా మోసం జరిగిందని ఆరోపిస్తున్నారు.

 నీటి లెక్కలు తేల్చకుండానే..
 మొదటి పంటకు 4.32 లక్షల ఎకరాలకు నీరు ఇస్తామని మొదటి ఐఏబీలో తీర్మానించారు. అయితే తీర్మానంలో నిర్ణయించిన దాని కంటే 6లక్షల ఎకరాల్లో అధికంగా అంటే 10 లక్షల ఎకరాల్లో పంట పండించామని అధికారపార్టీ నాయకులు గొప్పలు చెప్పుకున్నారు. ఎక్కడ, ఎన్ని ఎకరాలకు ఎలా నీరు ఇచ్చారో చెప్పలేదని, ఇది నీటి దుర్వినియోగం కాదా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. పైగా ఐఏబీలో ఆమోదించిన తీర్మానం ప్రకారం కాకుండా ఇష్టారాజ్యం గా నీటిని వాడుకోవడం కూడా ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు.

 రైతుల మధ్య చిచ్చుపెడుతున్నారు
 కనుపూరు, కావలి కాలువలపై మోటార్లతో ఇష్టం వచ్చినట్లు నీరు తోడుకోవడాన్ని ప్రభుత్వం సమర్ధిస్తున్నప్పుడు దానిని ఎందుకు చట్టపరం చేయరని రైతులు ప్రశ్నిస్తున్నారు. డెల్టా, నాన్ డెల్టా రైతుల మధ్య చిచ్చు బెట్టేలా అధికారపార్టీ నేతలు మాట్లాడటం అన్యాయం కాదా అని అడుగుతున్నారు.

 కండలేరు నీటి నిల్వల పరిస్థితేంటి?
 వరద ముప్పు ఉందని చెబుతూ సోమశిల నిండకముందే కండలేరుకు 8 టీఎంసీల నీటిని అధికారులు తరలించారు. అప్పటి జలాశయ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కండలేరుకు తరలించామని అధికారులు చెప్పుకొచ్చారు. అయితే వరద ఉధృతి తగ్గిన తర్వాత సైతం కండలేరుకు రోజు నీటిని పంపారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 28 టీఎంసీల నీరు ఎలా వినియోగిస్తారో ఐఏబీలో చర్చకు రాకపోవడాన్ని తప్పుబడుతున్నారు.

 సమావేశానికి ఎందుకు అనుమతించలేదు
 తమ డిమాండ్ మేరకు ఏర్పాటుచేసిన ఐఏబీ సమావేశానికి తమను ఎందుకు అనుమతించలేదని రైతులు ప్రశ్నిస్తున్నారు.  భారీ బందోబస్తు ఏర్పాటుచేసి తమ గొంతులను నొక్కేసి అంతా బాగుందని మాయచేసేందుకే రెండో ఐఏబీ సమావేశం జరిపించినట్లు ఉందని, ఇది ప్రతిఒక్కరికీ అర్థమైందని రైతులంటున్నారు.

 కోర్టును ఆశ్రయించనున్న రైతులు
 ఇలా మొదటి ఐఏబీలో తీర్మానాలను ఏ మేరకు అమలు చేశారో తెలియజేయకపోవడాన్ని రైతులు గ్రహించారు. తమ డిమాండ్లకోసం ఏర్పాటుచేసిన సమావేశంలో తమకు అనుమతి ఇవ్వకుం డా తమ హక్కులను హరించడానికి జరిగిన కుట్రను బయటపెట్టేందుకు పెన్నా డెల్టా ైరైతులు కోర్టు ఆశ్రయించనున్నారు.  

 చిత్తూరు ఆయకట్టు సంగతేంటి?
 మొదటి ఐఏబీ సమావేశంలో ఎన్నడూలేనివిధంగా చిత్తూరు జిల్లా స్థిరీకరణ ఆయకట్టు 62,749 ఎకరాలు, ఆరుతడి 18,798 ఎకరాలు మొత్తం 81,547 ఎకరాలకు నీటిని ఇస్తామని తీర్మానించా రు. అయితే ఆ ఆయకట్టుకు నీటి పంపిణీపై అటు అధికారులు, ఇటు టీడీపీనేతలు నోరెత్తకపోవడంపై రైతులు అనుమానం  వ్య క్తం చేస్తున్నారు. పైగా ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ అసలు చిత్తూరు జిల్లాకు నీరెట్లా పోతాయని ఎదురుదాడి చేశారు. అలాంటప్పుడు మొదటి ఐఏబీ తీర్మానంలో చిత్తూరు జిల్లా ఆయకట్టును ఎందుకు చేర్చారని రైతులు ప్రశ్నిస్తున్నారు.

అంతా అనుమానాస్పదమే: సోమశిలలో ఎక్కువ ఉన్న నీటిపై విచారణకు  కమిటీని ఏర్పాటు చేసినప్పుడు.. మూడు నెలల అవకతవకలపై కమిటీని వేసి తీర్మానించాల్సిన అవసరముంది. అయితే కలెక్టర్ నేనే చూశాను.. అంతా కరెక్ట్‌గా ఉందని చెప్పడం వెనుక రాజకీయ కుట్ర ఉందని రైతులు పేర్కొంటున్నారు. అధికారులను కలెక్టర్ వెనకేసుకొస్తే కలెక్టర్‌కు నేతలు అండగా నిలబడి తమ గొంతును నొక్కేశారని అన్నదాతలు మండిపడుతున్నారు.

మరిన్ని వార్తలు