కొత్త ప్రభుత్వంలోనే బదిలీలు

21 May, 2014 02:13 IST|Sakshi

కర్నూలు రూరల్, న్యూస్‌లైన్: ఎన్నికల ప్రక్రియ ముగిసింది. అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. విధుల్లో పాల్గొనేందుకు వచ్చిన ఇతర జిల్లాల అధికారులు ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా చేదువార్త వారి చెవిన పడింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు జిల్లాను వీడే అవకాశం లేదని తెలిసి నిట్టూరుస్తున్నారు. వాస్తవానికి ఎన్నికలు పూర్తయ్యాక.. బదిలీల ప్రక్రియను ఈనెల 24 లోపు పూర్తి చేయాల్సి ఉంది. అయితే కొత్త ప్రభుత్వ ఏర్పాటు మెలికతో ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఎంపీడీఓలు, తహశీల్దార్లు, పోలీసు అధికారులకు మరో 15 రోజుల పాటు పడిగాపులు తప్పదని తెలుస్తోంది.
 
 ఎన్నికల సందర్భంగా జిల్లాలో మూడు సంవత్సరాలకు పైబడి పని చేస్తున్న అధికారులను ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఇతర జిల్లాలకు బదిలీ చేయడం తెలిసిందే. అందులో భాగంగానే గత ఫిబ్రవరిలో జిల్లాకు అనంతపురం, కడప, చిత్తూరు నుంచి 48 మంది తహశీల్దారు, 37 మంది ఎంపీడీఓలు.. కొందరు పోలీసు అధికారులు బదిలీపై వచ్చారు. ఎన్నికల తంతు పూర్తి కావడంతో వారంతా తిరిగి ఆయా జిల్లాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 24వ తేదీతో తాము వెళ్లిపోవచ్చని భావించగా.. రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్నందున ఆ ప్రక్రియ విధివిధానాలపై కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చే నివేదికపై దేశ ప్రధాని ఆమోదం తెలపాల్సి ఉందని తెలిసి నిరాశకు లోనవుతున్నారు.
 
 యూపీఏ ప్రభుత్వం ఘోర పరాజయం పాలవడం.. ఎన్‌డీఏ అధికారంలోకి రావడంతో ఉద్యోగుల బదిలీలకు సాంకేతిక కారణాలు అడ్డొస్తున్నట్లు తెలిసింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి పదవీ విరమణ చేయడం.. కొత్త సీఎస్‌ను నియమించకపోవడం.. రాష్ట్ర విభజన ప్రక్రియకు సమయం దగ్గర పడటం కూడా బదిలీల బ్రేక్‌కు కారణమైనట్లు సమాచారం. ఏదేమైనా జూన్ 2వ తేదీ తర్వాత కేంద్రం, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యే వరకు బదిలీలపై ఉద్యోగులు ఆశలు వదులుకోవాల్సిందే.
 

మరిన్ని వార్తలు