అందరిచూపు రుణ‘మాఫీ’ వైపే.. | Sakshi
Sakshi News home page

అందరిచూపు రుణ‘మాఫీ’ వైపే..

Published Wed, May 21 2014 2:10 AM

అందరిచూపు రుణ‘మాఫీ’ వైపే.. - Sakshi

ముదినేపల్లి రూరల్, న్యూస్‌లైన్ :అధికారంలోకొస్తే రుణాలు మాఫీ చేస్తానన్న టీడీపీ అధినేత చంద్రబాబు వాగ్ధానాన్ని నమ్మి ఓటేసిన వారంతా ప్రస్తుతం ఆ వైపే చూస్తున్నారు.  సాగు చేస్తున్న రైతులంతా సహకార సంఘాలు, వాణిజ్య బ్యాంకుల్లో భూములు తనఖా పెట్టి పంట రుణాలు పొందారు. రుణాలు రద్దు చేస్తే అప్పుల ఊబి నుంచి బైటపడి సేద్యాన్ని కొత్త పుంతలు తొక్కించాలనే ఆలోచనలో రైతులున్నారు. అయితే రుణమాఫీ పథకం అమలులో అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
 
వడ్డీ రూపేణా నష్టం...

వ్యవసాయ రుణాలపై రూ.లక్షవరకు గతప్రభుత్వం వడ్డీ మాఫీ చేసింది. రుణం పొందిన తేదీ నుంచి ఏడాది ముగిసే లోపు చెల్లిస్తేనే వడ్డీ మాఫీ అవుతుంది. అయితే రుణాలు రద్దుచేస్తామన్న టీడీపీ హామీతో వడ్డీ బకాయిల గడువు మీరినా రైతులు ఇప్పటి వరకు చెల్లించలేదు. దీంతో వడ్డీ పూర్తిగా చెల్లించిన వారికే రుణమాఫీ వర్తింపచేస్తే మిగిలిన రైతులు వడ్డీ రాయితీని కోల్పోవడంతో పాటు అపరాధపు వడ్డీతో సహా రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

సహకార సంఘాల్లో రుణాలు పొందిన రైతులు మార్చి నెలాఖరు లోపు రుణం చెల్లిస్తేనే పావలా వడ్డీ అమలు చేస్తున్నారు. రుణమాఫీ ప్రచారం వల్ల ఇప్పటి వరకు సంఘాలకు రైతులు బకాయిలు చెల్లించలేదు. రాష్ట్రంలో ప్రభుత్వం లేనందున పావలా వడ్డీపై ఎలాంటి ఉత్తర్వులు సంఘాలకు అందలేదు. రైతులంతా రుణమాఫీపై ఆశలు పెట్టుకున్నారు. రుణమాఫీ పథకం కొందరికే వర్తిస్తే ఇతర రైతులు ఆశాభంగం చెందక తప్పదు.
 
బంగారు రుణాలు?

బ్యాంకులు బంగారం తనఖాపై  రెండు రకాల రుణాలిస్తాయి. బ్యాంకు యాజమాన్యాలను బట్టి ఇతర రుణాలకు 13శాతం, వ్యవసాయ రుణాలకు 7శాతం వడ్డీ వసూలు చేస్తున్నాయి. గడువు తేదీలోగా చెల్లించకుంటే అపరాధపు వడ్డీ వసూలు చేస్తాయి. రైతులు చెల్లించిన శిస్తు రశీదుల ఆధారంగా వ్యవసాయ రుణాలిస్తున్నాయి. రుణమాఫీ అమలు చేస్తే బంగారంపై పొందిన రుణాలకు వర్తిస్తుందా లేదా అనేది పలువురిలో ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఇలాంటి రుణాలు పొందిన రైతులు  గడువు మీరుతున్నా బకాయిలు చెల్లించడంలేదు.  
 
ఆక్వా రుణాలు...

మండలంలో విస్తారంగా చేపల, రొయ్యల చెరువులున్నాయి. వీటిని తనఖాగా ఉంచి రైతులు సహకార సంఘాలు, బ్యాంకుల్లో రుణాలు పొందారు. ఆక్వాసాగులో రైతులు నష్టపోయిన సమయాల్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం అందడంలేదు. అదే వరిసాగు రైతులకు మాత్రం ఇన్‌పుట్ సబ్సిడీ ప్రభుత్వం నుంచి అందుతోంది. వ్యవసాయ రుణాల రద్దు పథకం -2008లో సైతం వీరి రుణాలు రద్దు కాలేదు. ఇటు వ్యవసాయంగానూ, అటు పరిశ్రమగానూ ఆక్వా సాగును గుర్తించనందువల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని రెతులు వాపోతున్నారు. రుణాలు పొందిన కౌలు రైతుల పరిస్థితి ఇదే విధంగా డోలాయమానంలో పడింది.
 
 హామీ నిలబె ట్టుకోవాలి
 రెండెకరాలు బ్యాంకులో తనఖాపెట్టి రూ.40వేలు రుణం పొందా. సార్వా, దాళ్వాలో అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయా. రుణాలు రద్దు చేసి చంద్రబాబు హామీ నిలబెట్టుకోవాలి.
 సీెహ చ్ వెంకటేశ్వరరావు, రైతు.
 
 రద్దు చేస్తేనే సేద్యం
 నాలుగెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తూ అప్పుల్లో మునిగిపోయా. జేఎల్జీ గ్రూపుతో బ్యాంకు నుంచి రూ.20వేలు రుణం పొందా. కౌలు రైతులు రుణాలు రద్దు చేస్తేనే నాలాంటి వారు తిరిగి సేద్యం చేసే అవకాశం ఉంది.
 రామకృష్ణ, కౌలు రైతు.

Advertisement
Advertisement