రెండో రోజూ కొనసాగిన రిలే నిరాహార దీక్షలు

18 Mar, 2015 04:26 IST|Sakshi

ఆనందపేట (గుంటూరు):  ప్రత్యేక హోదా-ఆంధ్రుల హక్కు అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా విభాగం ఆధ్వర్యంలో ప్రారంభించిన రిలే నిరాహార దీక్షలు రెండోరోజు మంగళవారం కూడా కొనసాగాయి. రెండోరోజు శిబిరానికి పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు బీజేపీ విషబీజాన్ని నాటిందని, తెలుగుదేశం పార్టీ ఆ విష వృక్షాన్ని నీరు పోసి పెంచి పోషించిందని ఆరోపించారు.రాష్ట్ర విభజనకు అన్ని పార్టీలు ఏకగ్రీవంగా అంగీకారం తెలిపిన తరువాతే కాంగ్రెస్ పార్టీ తుది నిర్ణయం తీసుకుందన్నారు. విభజన తరువాత రాష్ట్రానికి మేలు జరిగేలా అనేక అంశాలతో ఆర్డినెన్స్ జారీ చేశామన్నారు.

పోలవరం జాతీయ ప్రాజెక్టును పూర్తి చేయాలని, రూ.5 లక్షల కోట్లతో పథకాలను రూపొందించాలని చట్టం రూపంలో చేశామని ఆయన వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వం కొత్తగా ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టనవసరం లేదని, విభజన చట్టంలోని అంశాలను అమలుచేస్తే చాలని ఆయన అన్నారు. బీజేపీ, టీడీపీలు వారి స్వార్ధ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని బలి చేస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు.  రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకునేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్‌చార్జి, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, కాంగ్రెస్‌పార్టీ జిల్లా పరిశీలకుడు ఆకుల శ్రీనివాసరావు, కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు, నగర అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు షేక్ మస్తాన్‌వలి, మాజీ శాసనసభ్యులు లింగంశెట్టి ఈశ్వరరావు, చదలవాడ జయరాంబాబు, యర్రం వెంకటేశ్వరరెడ్డి, జిల్లాపరిషత్ మాజీ చైర్‌పర్సన్ కూచిపూడి విజయ,  కాంగ్రెస్‌పార్టీ నాయకులు కూచిపూడి సాంబశివరావు, వణుకూరి శ్రీనివాసరెడ్డి, షేక్ అబ్దుల్ వహీద్, కొరివి వినయ్‌కుమార్, మిరియాల రత్నకుమారి, ఈరి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు