ఆమోదమా.. తిరస్కారమా?

15 Sep, 2014 04:21 IST|Sakshi

- ఏర్పేడు మండలంలో ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్
- ఏర్పాటుకు భూమిని గుర్తించిన కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్
- కేంద్ర మానవవనరుల శాఖకు నివేదిక పంపిన కలెక్టర్  
- అక్టోబర్‌లో పర్యటించనున్న కేంద్ర బృందం


జిల్లాలోని ఏర్పేడు మండలం మేర్లపాకలో ఐఐటీ(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ), పంగూరుకు సమీపంలో ఐఐఎస్‌ఈఆర్(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సు ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) క్యాంపస్‌లను ఏర్పాటుచేయాలని కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ కేంద్ర మానవ వనరులశాఖకు సూచించారు. ఐఐటీ ఏర్పాటుకు 440 ఎకరాలు, ఐఐఎస్‌ఈఆర్ ఏర్పాటుకు 398 ఎకరాల భూమిని గుర్తించి కేంద్రానికి నివేదిక పంపారు. ఈ భూములను కేంద్ర బృందం పరిశీలించి ఇచ్చే నివేదిక ఆధారంగానే ఆ సంస్థలను ఎక్కడ ఏర్పాటు చేయాలో స్పష్టమవుతుంది.
 
సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్ర విభజన నేపథ్యంలో జాతీయ విద్యా సంస్థలను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుచేస్తామని అప్పట్లో యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. పునర్‌విభజన బిల్లులో పేర్కొన్న మేరకు 2014-15 బడ్జెట్లో ఐఐటీని ఏర్పాటు చేయడానికి కేంద్రం ఆమోదించింది. ఐఐఎస్‌ఈఆర్ ఏర్పాటుపై ఇప్పటిదాకా కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ రెండు విద్యాసంస్థల ఏర్పాటుకు అవసరమైన భూమిని గుర్తించాలని జూలై 21న కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్‌ను ఆదేశించింది. శ్రీకాళహస్తి, ఏర్పేడు, చంద్రగిరి మండలాల పరిధిలో జాతీయ విద్యాసంస్థల ఏర్పాటుకు రెవెన్యూ అధికారులు భూమిని గుర్తించారు.

జాతీయ విద్యాసంస్థల ఏర్పాటు అంశం అధికార టీడీపీలో ఆధిపత్యపోరుకు తెరతీసింది. అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆ విద్యా సంస్థలను తన నియోజకవర్గంలోనే ఏర్పాటుచేసుకోవడానికి అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఇది పసిగట్టిన సీఎం చంద్రబాబు సొంతూరు నారావారిపల్లె టీడీపీ నేతలు.. ఆ విద్యా సంస్థలను చంద్రగిరి నియోజకవర్గంలో ఏర్పాటుచేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు తాను గతంలో ప్రాతినిథ్యం వహించిన నగరి నియోజకవర్గంలోని వడమాలపేటలో ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌ను ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు.

మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఒత్తిళ్లకు తలొగ్గిన కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్.. ఏర్పేడు మండలంలో మేర్లపాక సమీపంలో ఐఐటీ, పంగూరు సమీపంలో ఐఐఎస్‌ఈఆర్‌ను ఏర్పాటుచేయాలని ప్రతిపాదిస్తూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు నివేదిక పంపారు. కలెక్టర్ ప్రతిపాదనపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మేర్లపాక, పంగూరులో ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్ ఏర్పాటుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా లేదా అన్న అంశాన్ని అధ్యయనం చేసేందుకు నిపుణుల బృందాన్ని కేంద్ర మానవవనరులశాఖ జిల్లాకు పంపనుంది.

అక్టోబర్‌లో ఏర్పేడులో నిపుణుల బృందం పర్యటించనుంది. విమానాశ్రయం సమీపంలో ఉండటం.. జాతీయ రహదారులు అందుబాటులో ఉండటం.. నీటి సౌకర్యం ఉండటం.. భద్రతకు ఢోకా లేకుండా ఉంటే ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌కు నిపుణుల బృందం ఆమోదముద్ర వేస్తుంది. కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ప్రతిపాదించిన మేర్లపాక, పంగూరు గ్రామాలు రేణిగుంట విమానాశ్రయానికి 25 నుంచి 30 కిమీల దూరంలో ఉంటాయి. నాయుడుపేట-పూతలపట్టు జాతీయ రహదారి సమీపంలోనేమేర్లపాక ఉంటుంది. ఆ జాతీయ రహదారి నుంచి ఆరేడు కిమీ దూరంలో పంగూరు ఉంటుంది.

విమానాశ్రయం, జాతీయరహదారి ఆ రెండు గ్రామాలకూ అందుబాటులో ఉన్నా.. పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం, నీటి ఎద్దడి ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్ ఏర్పాటుకు ప్రతికూలంగా మారే అవకాశం ఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. కాలుష్యం, నీటి ఎద్దడిని అధిగమించగలిగితేనే అక్కడ ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్ ఏరా్పాటుకు కేంద్ర బృందం అనుమతించే అవకాశం ఉంటుదని రెవెన్యూశాఖకు చెందిన ఓ కీలకాధికారి ‘సాక్షి’కి వెల్లడించడం గమనార్హం.

మరిన్ని వార్తలు