చీమకుర్తిలో ఉద్రిక్తత

27 Jul, 2015 02:00 IST|Sakshi
చీమకుర్తిలో ఉద్రిక్తత

కంకర లారీ దూసుకెళ్లడంతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న మహిళ
ఆందోళనకు దిగిన క్షతగాత్రురాలి బంధువులు, స్థానికులు
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు స్వల్ప లాఠీచార్జి చేసిన పోలీసులు
 
 చీమకుర్తి : చీమకుర్తి మెయిన్‌రోడ్డుపై ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. పరిస్థితి అదుపు తప్పటంతో చివరకు పోలీసులు స్వల్పంగా లాఠీచార్జీ చేయాల్సి వచ్చింది. పోలీసులు, బంధువులు, ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం.. చీమకుర్తి క్రిస్టియన్‌పాలేనికి చెందిన పూండ్ల మేరీ తన తల్లి పాటిబండ్ల కోటేశ్వరితో కలిసి మాంసం మార్కెట్‌లో చేపలు కొనుగోలు చేస్తోంది. ఈ క్రమంలో ఓ కంకర లారీ వచ్చి మేరీని ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే స్పృహ తప్పి కోమాలోకి వెళ్లింది. మృతి చెందిందని స్థానికులు అనుకుంటున్న తరుణంలో మేరీ శరీర భాగాలు కదులుతుండటంతో 108లో రిమ్స్‌కు తరలించారు. మేరీ బతకటం కష్టమని వైద్యులు చెప్పటంతో సంఘమిత్రకు తరలించారు. ఆదివారం రాత్రికి కూడా ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు బంధువులు, పోలీసులు తెలిపారు.

 లారీని అడ్డుకున్న బంధువులు
 మేరీ కోమాలోకి వెళ్లడంతో బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ లారీని కదలనీయకుండా అడ్డుకున్నారు. అప్పటికే వాహనాలు బారులు తీరాయి. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆందోళనకారులు వెనక్కుతగ్గలేదు. చివరకు పోలీసులు స్వల్ప లాఠీ చార్జి చేసి పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం మేరీ బంధువులు పోలీసుస్టేషన్‌కు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

మరిన్ని వార్తలు